రెండు నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌స్తున్న ర‌వితేజ సినిమా

మాస్ మహారాజ్ ర‌వితేజ నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.;

Update: 2026-03-09 10:38 GMT

మాస్ మహారాజ్ ర‌వితేజ నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోకపోయినా, ఇప్పుడు డిజిటల్ వేదికపై కొత్త అవకాశాన్ని అందుకోవడానికి సిద్ధ‌మైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 ఈ సినిమాను మార్చి 13 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.



 


ఆల్రెడీ ఓటీటీకి వ‌చ్చేసిన సంక్రాంతి సినిమాలు

సాధారణంగా ఇటీవల విడుదలైన పెద్ద సినిమాలు థియేటర్లలో రిలీజైన నెలరోజుల్లోనే ఓటీటీకి చేరుతున్న నేపథ్యంలో, భర్త మహాశయులకు విజ్ఞప్తి మాత్రం దాదాపు రెండు నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్‌కు రావడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సంక్రాంతి సందర్భంగా మొత్తం ఐదు సినిమాలు విడుదల కాగా, వాటిలో అన్ని సినిమాలు దాదాపు ఇప్పటికే ఓటీటీలోకి వచ్చాయి. అయితే ఈ సినిమా మాత్రం ఆలస్యంగా స్ట్రీమింగ్‌కు వస్తుండటం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది.

మార్చి 13న జీ5లో భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి

మార్చి 13 నుంచి భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి సినిమా జీ5లో స్ట్రీమింగ్ కు రానుంద‌ని అనౌన్స్‌మెంట్ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఆ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. ర‌వితేజ హీరోగా, కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో డింపుల్ హ‌యాతి, ఆషికా రంగ‌నాథ్ హీరోయిన్లుగా న‌టించిన ఈ సినిమాను సుధాక‌ర్ చెరుకూరి నిర్మించ‌గా, ఈ మూవీలో ర‌వితేజ కామెడీ టైమింగ్, ఇద్ద‌రు హీరోయిన్ల‌తో ఆయ‌న చేసే రొమాంటిక్ సీన్స్ ఓటీటీ ఆడియ‌న్స్ ను అల‌రిస్తాయ‌ని అంతా భావిస్తున్నారు.

భార్య‌- ప్రియురాలి మ‌ధ్య న‌లిగిపోయే భ‌ర్త క‌థ..

ఇక ఈ మూవీ కథ విషయానికొస్తే, ఇది ఒక భర్త జీవితం చుట్టూ తిరుగుతుంది. బిజినెస్ డీల్ కోసం స్పెయిన్‌కు వెళ్లిన హీరో అక్కడ ఒక మహిళతో పరిచయం పెంచుకుంటాడు. అదే సమయంలో అతని భార్య మాత్రం చాలా పొసెసివ్ స్వభావం కలిగిన వ్యక్తి. ఈ ఇద్దరి మధ్య చిక్కుకుపోయిన భర్త ఎదుర్కొనే పరిస్థితులు, అతడు పడే ఇబ్బందులు, వాటి నుంచి బయటపడేందుకు చేసే ప్రయత్నాలే కథకు ప్రధాన బలం. భార్య- ప్రియురాలు మధ్య నలిగే భర్త పరిస్థితిని హాస్యభరితంగా చూపిస్తూ డైరెక్ట‌ర్ క‌థ‌ను చాలా ఎంట‌ర్టైనింగ్ గా ముందుకు నడిపించారు.

రెండు నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి..

రీసెంట్ గా సినీ పరిశ్రమలో థియేట్రికల్ రిలీజ్- ఓటీటీ రిలీజ్ మధ్య కనీసం ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే చర్చలు జరుగుతున్న సమయంలో భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి మూవీ డిజిటల్ రిలీజ్ ఆసక్తికరంగా మారింది. సాధారణంగా నెలరోజుల్లోనే ఓటీటీకి వచ్చే సినిమాల మధ్య పోటీ ఎక్కువగా ఉండగా, ఈ సినిమా ఆలస్యంగా రావడం వల్ల కొత్తగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. థియేట‌ర్ల‌లో ఓ మోస్త‌రు రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో ఏ మేర అల‌రిస్తుంద‌నేది చూడాలి. ఒక‌వేళ ఈ సినిమా ఓటీటీలో మంచి రెస్పాన్స్ ను అందుకుంటే, ఫ్యూచ‌ర్ లో సినిమాల థియేట‌ర్- ఓటీటీ విండోపై జ‌రుగుతున్న చ‌ర్చ‌ల‌కు ఇదొక కొత్త మార్గాన్ని చూపే అవ‌కాశ‌ముంది.

Tags:    

Similar News