'గర్ల్‌ఫ్రెండ్' సేఫ్.. కానీ రష్మికకు ఇదే అసలైన టెస్ట్!
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ది గర్ల్‌ఫ్రెండ్ నాన్ థియేట్రికల్ బిజినెస్ చాలా సాలిడ్‌గా క్లోజ్ అయిందట.;
'ది గర్ల్‌ఫ్రెండ్' సినిమాతో నేషనల్ క్రష్ రష్మిక మందన్న నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా, రిలీజ్‌కు ముందే బిజినెస్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సినిమా కంటెంట్ ఎలా ఉన్నా, నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో మేకర్స్ ఇప్పటికే సేఫ్ జోన్‌లోకి వచ్చేసినట్లు గట్టిగా టాక్ నడుస్తోంది. రష్మికకు ఉన్న పాన్ ఇండియా క్రేజ్, గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద బ్యానర్ వాల్యూ ఈ డీల్స్‌కు బాగా ప్లస్ అయ్యాయి.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ది గర్ల్‌ఫ్రెండ్ నాన్ థియేట్రికల్ బిజినెస్ చాలా సాలిడ్‌గా క్లోజ్ అయిందట. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ ఏకంగా 14 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీనికి అదనంగా, శాటిలైట్ రైట్స్ ద్వారా మరో 4 కోట్లు, ఆడియో రైట్స్ ద్వారా 3 కోట్లు.. ఇలా మొత్తం మీద రిలీజ్‌కు ముందే మేకర్స్ టేబుల్‌పైకి 21 కోట్లు వచ్చేశాయని టాక్ వస్తోంది.
ఈ లెక్కన సినిమా ఆల్రెడీ ప్రాఫిట్ జోన్‌లోనే ఉంది. కానీ, ఇక్కడే అసలు ఛాలెంజ్ మొదలైంది. ఈ బిజినెస్ అంతా రష్మిక స్టార్‌డమ్ మీదే జరిగిందా లేక ఆమె నటించిన గత సినిమాల సక్సెస్ మీద జరిగిందా అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే, రష్మిక రీసెంట్ కెరీర్ గ్రాఫ్ చూస్తే, ఆమె ట్రాక్ రికార్డ్ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది.
'పుష్ప 2' సినిమా బాక్సాఫీస్ వద్ద 1700 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆ తర్వాత ఆమె నటించిన 'చావా' 800 కోట్లు, 'కుబేర' 100 కోట్లకు పైగా రాబట్టాయి. ఈ మూడు సినిమాలూ బ్లాక్‌బస్టర్లే. కానీ, ఈ భారీ విజయాలన్నీ ఆయా హీరోల (అల్లు అర్జున్, విక్కీ కౌశల్, ధనుష్) స్టార్‌డమ్, డైరెక్టర్ల కంటెంట్ వంటి విషయాలు చాలానే హెల్ప్ అయ్యాయి. ఇక రీసెంట్‌గా వచ్చిన రొమాంటిక్ హారర్ కామెడీ తమ్మ సినిమాకు రష్మికనే మెయిన్ అట్రాక్షన్ అయినా, బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఆశించినంతగా ఆడలేదు. ఇక ఇప్పుడు 'ది గర్ల్‌ఫ్రెండ్' మీదే అందరి ఫోకస్ పడింది. ఈ సినిమాలో హీరో ఉన్నా, ప్రమోషన్ల భారం మొత్తం రష్మిక మీదే ఉంది.
నాన్ థియేట్రికల్ రైట్స్‌తో మేకర్స్ సేఫ్ అయ్యారు. కానీ, రష్మిక తన సోలో క్రేజ్‌తో మొదటిరోజు టికెట్లు తెంచగలదా లేదా అనేది ఈ సినిమాతో ప్రూవ్ అవ్వాలి. మొదటి రోజు మౌత్ టాక్ బాగుంటేనే సినిమా నిలదొక్కుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆమె క్రేజ్ కు ఇది అసలైన ఛాలెంజ్. 'ది గర్ల్‌ఫ్రెండ్' సినిమాకు థియేట్రికల్ టార్గెట్ కూడా దాదాపు మిడ్ రేంజ్‌లోనే ఉండొచ్చు. మరి, రష్మిక తన భుజాలపై ఈ సినిమాను మోసి, ఆ టార్గెట్‌ను ఎన్ని రోజుల్లో అందుకుంటుందో చూడాలి.