రణ్‌వీర్ ముగ్గురు సౌత్ డైరెక్టర్లని పక్కన పెట్టాడా?
ఇదిలా ఉంటే వరుస ఫ్లాపులు, డిజాస్టర్లతో సతమతమైన టైమ్‌లో రణ్‌వీర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ కోసం సౌత్ డైరెక్టర్ల వైపు చూశాడు.;
బాలీవుడ్ క్రేజీ స్టార్ రణ్‌వీర్ సింగ్ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాడు. తను నటించిన స్పై యాక్షన్ ఎంటర్‌టైనర్ `ధురంధర్` వరల్డ్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టింది. గత కొంత కాలంగా వరుస ఫ్లాపుల్లో ఉన్న రణ్‌వీర్ సింగ్‌ని పతాక స్థాయిలో నిలబెట్టి పాన్ ఇండియా స్టార్‌ని చేసింది. ఆదిత్యధర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ గత ఏడాది డిసెంబర్‌లో విడుదలై సంచలనం సృష్టించడంతో రణ్‌వీర్ సింగ్ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చేశాడు. ఈ మూవీతో దేశ వ్యాప్తంగా హాట్ ఫేవరేట్ హీరోగా మారిపోయాడు.
ఈ నేపథ్యంలోనే మార్చి 19న రణ్‌వీర్ నటించిన `ధురంధర్` సీక్వెల్ వచ్చేస్తోంది. ఇప్పటికే పెయిడ్ ప్రీమియ అడ్వాన్స్ బుకింగ్స్‌తో రికార్డుల మోత మొదలు పెట్టిన `ధురంధర్ 2` సరికొత్త రికార్డుల దిశగా పయనిస్తోంది. ఈసారి ప్రారంభ వసూళ్లు భారీగా ఉంటాయని బన్నీ `పుష్ప 2` రికార్డ్ ను తిరగరాయడం ఖాయమని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. `ధురంధర్ 2` ఫీవర్ చూస్తుంటే దానికి మించి రికార్డుల్ని తిరగరాసేలా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే వరుస ఫ్లాపులు, డిజాస్టర్లతో సతమతమైన టైమ్‌లో రణ్‌వీర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ కోసం సౌత్ డైరెక్టర్ల వైపు చూశాడు.
తమిళ, తెలుగు భాషల్లో చియాన్ విక్రమ్ కథానాయకుడిగా శంకర్ తెరకెక్కించిన భారీ యాక్షన్ మూవీ `అపరిచితుడు`. ఈ మూవీని బాలీవుడ్‌లో రణ్‌వీర్ సింగ్ హీరోగా రీమేక్ చేయాలని ప్లాన్ చేశారు. జయంతి లాల్ గడ ప్రొడ్యూసర్. అయితే లీగల్ చిక్కులు, ఇండియన్ 2 వివాదం కారణంగా శంకర్ సౌత్ వరకే లాక్ అయిపోయాడు. `అపరిచితుడు` రీమేక్ చేయలేని పరిస్థితి. దీంతో రణ్‌వీర్ సింగ్ ఇది అయ్యే పని కాదని శంకర్‌తో సినిమా ప్రయత్నాలని విరమించికుని బాలీవుడ్ లో తన ప్రయత్నాలు తాను చేసుకోవడం మొదలు పెట్టాడు.
ఆదిత్యధర్ ఎదురవ్వడంతో ఇద్దరి కాంబినేషన్‌లో రా అండ్ రస్టిక్ అంశాల నేపథ్యంలో `ధురంధర్` తెరపైకొచ్చింది. సైలెంట్‌గా విడుదలైన ఈ సినిమా ఏ స్థాయి సంచలనాలు సృష్టించిందో అందరికి తెలిసిందే. ఇదే సమయంలో టాలీవుడ్ మాస్ మసాలా యాక్షన్ సినిమాల డైరెక్టర్ బోయపాటి శ్రీను హీరో రణ్‌వీర్ సింగ్‌ని కలిసి భారీ యాక్షన్ డ్రామాకు ప్లాన్ చేశాడు. కానీ బోయపాటి చెప్పిన స్టోరీ రణ్‌వీర్‌కు నచ్చకపోవడంతో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కకుండానే ఆగిపోయింది. `ధురంధర్` సీక్వెల్ లైన్‌లో ఉండటం, ఈ మూవీతో ఆశించిన దానికి మించి పాపులారిటీ రావడంతో రణ్‌వీర్ సింగ్ ..బోయపాటిని పక్కన పెట్టారట.
దీనికి ముందు మరో సౌత్ డైరెక్టర్‌ని కూడా రణ్ వీర్ పక్కన పెట్టినట్టుగా తెలిసింది. మలయాళంలో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలతో నటుడిగా, `మిన్నల్ మురళి` వంటి సూపర్ హీరో మూవీతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న బసిల్ జోసెఫ్ బాలీవుడ్‌లో సినిమా చేయాలనుకున్నాడట. అది కూడా సూపర్ హీరో స్టోరీతో. ఇందుకు రణ్‌వీర్ అయితే కరెక్ట్ అని భావించి తనని కలిసి శక్తిమాన్ స్టోరీ వినిపించాడని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే బసిల్‌కు రణ్‌వీర్‌కు మధ్య ఏర్పడిన క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగానే ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదని, దాంతో బసిల్ జోసెఫ్ ఫ్రెష్ స్టోరీని రెడీ చేసుకుని ఇప్పుడు బన్నీ వెంటపడుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన శిరీష్ వివాహ వేడుకలో బసిల్ జోసెఫ్ కనిపించడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది.