'డాన్ 3' కి దురంధర్ ఊహించని ఝలక్
ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ధురంధర్ దాదాపు రూ. 600 కోట్ల నికర వసూళ్లను దాటే దిశగా పయనిస్తోందని ట్రేడ్ అంచనా వెలువరించింది.;
`దురంధర్` గ్రాండ్ సక్సెస్ చాలా సమీకరణాలను మార్చివేస్తున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా రణ్ వీర్ సింగ్ ఎంతగానో ఆవురావురుమంటూ ఎదురు చూసిన గ్రాండ్ విక్టరీని ఎట్టకేలకు అందుకున్నాడు. ఐదారేళ్లుగా వరుస పరాజయాలతో ముఖంలో రక్తం చుక్క కనిపించని రణ్ వీర్ ఇప్పుడు ఫెయిర్ అండ్ గ్లోతో షైనింగ్ గా కనిపిస్తున్నాడు.
ఫ్లాపులు నీరసం పుట్టిస్తాయి. ప్రజల్లో చిన్న చూపునకు కారణమవుతాయి. కానీ ఒకే ఒక్క విజయం హనుమంతుడిలా శక్తి సంపన్నుడిని చేస్తుంది. ఇప్పుడు దురంధర్ ఘనవిజయంతో పది పర్వతాలను ఒకేసారి అమాంతం ఎత్తి పడేసేంత బలం పుంజుకున్నాడు రణ్ వీర్.
అయితే దీని ఫలితం ఫర్హాన్ అక్తర్ ప్రాజెక్ట్ పై పడింది. అతడు దశాబ్ధ కాలంగా కలలు కంటున్న `డాన్ 3` షెడ్యూళ్లను మరోసారి వాయిదా పడేట్టు చేసింది దురంధర్. కొత్త సంవత్సరంలో సెట్స్ పైకి తీసుకెళ్లాలని ఉవ్విళ్లూరుతున్న ఫర్హాన్ కి రణ్ వీర్ బ్యాడ్ న్యూస్ చెప్పాడని ముంబై మీడియాలో కథనాలొస్తున్నాయి. అతడు దురంధర్ సక్సెస్ తర్వాత `డాన్ 3` నుంచి వైదొలగాలని నిర్ణయంచుకున్నాడని, నటించే ప్రతి సినిమా వైవిధ్యంగా ఉండాలని కోరుకుంటున్నాడని కథనాలొస్తున్నాయి.
ముఖ్యంగా 2026 సమ్మర్ లో విడుదల చేయాల్సిన దురంధర్ సీక్వెల్ దురంధర్ 2 పై హార్డ్ వర్క్ చేయాలని, ఆ తర్వాత జోంబీ మూవీ `ప్రళయ్` (ప్రళయం)ని వెంటనే పట్టాలెక్కించాలని భావిస్తున్నట్టు కథనాలొస్తున్నాయి. ఈ రెండు సినిమాల షూటింగులను ఏకకాలంలో ముందుకు నడిపించాలంటే, డాన్ 3 లాంటి భారీ ప్రాజెక్టును ముట్టుకోకూడదు. ప్రస్తుతం రణ్ వీర్ అలాంటి పని చేస్తున్నాడు! అంటూ మీడియాలో కథనాలొస్తున్నాయి.
ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ధురంధర్ దాదాపు రూ. 600 కోట్ల నికర వసూళ్లను దాటే దిశగా పయనిస్తోందని ట్రేడ్ అంచనా వెలువరించింది. నాలుగో వారం కూడా ఈ సినిమా జీవితకాల వసూళ్లను రూ. 700 కోట్ల నెట్ (800కోట్ల గ్రాస్)కు చేరుకుంటుందని భావిస్తున్నారు. ఈ ఊపు చూశాక రణ్ వీర్ దురంధర్ 2 పైనే ఎక్కువగా దృష్టి సారించనున్నాడని కథనాలొస్తున్నాయి.
ప్రస్తుతం రణ్ వీర్ దురంధర్ 2 తర్వాత జాంబీ కథతో రూపొందనున్న `ప్రళయ్` చిత్రంలో నటిస్తాడు. జై మెహతా దీనికి దర్శకత్వం వహిస్తాడు. సింగ్ ఈ ప్రాజెక్టును వేగవంతం చేసి, మొదట అనుకున్న దానికంటే త్వరగా ప్రారంభించాలని ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని అప్లాజ్ ఎంటర్‌టైన్మెంట్ నిర్మిస్తుంది. జోంబీ థ్రిల్లర్ కథాంశం ఆసక్తికరం. జాంబీల భారి నుంచి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఒక యువకుడు ఎలాంటి పోరాటం సాగించాడన్నదే కథాంశం. `డాన్ 3` నుండి నిష్క్రమించిన తర్వాత జై మెహతా చిత్రంపైనే ఫోకస్ చేస్తాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సింగ్ వ్యక్తిగతంగా తేదీలు, షెడ్యూల్‌లను సర్దుబాటు చేయడంలో ఆసక్తిగా ఉన్నాడు.
నిజానికి ఫర్హాన్ అక్తర్ `డాన్ 3`ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించాలని భావించాడు. ముందుగా కృతి సనన్‌ను కథానాయికా నిర్ధారించారు. యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్‌ను భారీ బడ్జెట్ తో నిర్మించాలని ఫర్హాన్ భావించాడు. పలు యూరోపియన్ దేశాలలో భారీ చిత్రీకరణ కోసం షెడ్యూల్ చేసాడు. కానీ డాన్ 3 నుండి రణ్‌వీర్ సింగ్ నిష్క్రమించడం ఫ్రాంచైజీకి అతి పెద్ద దెబ్బగా మారిందని గుసగుస వినిపిస్తోంది. ఇప్పటివరకూ దీనిని ఫర్హాన్ కానీ, రణ్ వీర్ కానీ అధికారికంగా ధృవీకరించలేదు. ప్రస్తుతానికి ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే.
అయితే రణ్ వీర్ తన కెరీర్ విషయంలో చాలా తెలివిగా ఆలోచిస్తున్నాడు. ధురంధర్ ఇప్పటికీ వసూళ్లలో తన బ్లాక్ బస్టర్ ప్రవాహాన్ని కొనసాగిస్తుండటంతో, సింగ్ ఎంపికల పరంగా చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. ప్రతిదీ వైవిధ్యంగా ఉండాలని తపిస్తున్నాడు. క్రియేటివ్‌గా ఏదైనా కొత్తదనం నిండిన కథాంశంతో ముందుకు సాగాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.