కామెడీకి కేరాఫ్‌గా తిరిగి వస్తున్న నరేష్.. ఈసారి ఫ్యామిలీ మొత్తం టార్గెట్!
హీరోకు చిన్నప్పటి నుంచి దేవతలపై ప్రత్యేకమైన నమ్మకం ఉండటం, ఎలాంటి కష్టపడకుండానే హీరో కావాలనే అతడి కల చుట్టూ కథ సాగుతుందని తెలిపారు.
కొంతకాలంగా సీరియస్, విభిన్నమైన పాత్రలకు ప్రాధాన్యం ఇస్తున్న అల్లరి నరేష్ ఇప్పుడు తనకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన కామెడీ జానర్‌లోకి మళ్లీ అడుగుపెడుతున్నారు. ఫాంటసీ, కామెడీ అంశాలను మేళవిస్తూ రూపొందిన రంభ ఊర్వశి మేనక సినిమాతో ప్రేక్షకులను నవ్వించేందుకు సిద్ధమవుతున్నారు. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది.
ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకొచ్చిన అల్లరి నరేష్, ఈ సినిమా సక్సెస్ పై నమ్మకాన్ని వ్యక్తం చేశారు. చాలా రోజుల తర్వాత పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్ చేస్తున్నాననే ఆనందం ఈ సినిమా వల్ల కలిగిందన్నారు. కితకితలు, బెండు అప్పారావు తరహా కామెడీ సినిమాలను ఆడియన్స్ తన నుంచి మిస్ అవుతున్నారని, ఆ లోటును కొంతవరకు ఈ సినిమా తీర్చుతుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. ఈ కథలో సాధారణంగా కనిపించే సోషియో ఫాంటసీకి భిన్నమైన కాన్సెప్ట్ ఉంటుందని నరేష్ తెలిపారు. సాధారణంగా మనుషులు స్వర్గం లేదా దేవలోకానికి వెళ్లే కథలు చూశామని, కానీ ఇందులో మాత్రం రంభ, ఊర్వశి, మేనక స్వర్గం నుంచి భూమిపైకి రావడమే మెయిన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ అని చెప్పారు. హీరోకు చిన్నప్పటి నుంచి దేవతలపై ప్రత్యేకమైన నమ్మకం ఉండటం, ఎలాంటి కష్టపడకుండానే హీరో కావాలనే అతడి కల చుట్టూ కథ సాగుతుందని తెలిపారు.
సినిమాలో తన క్యారెక్టర్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంటుందని నరేష్ చెప్పారు. ఊరిలో అందరి దగ్గర అప్పులు చేసి, ఎవరూ పెద్దగా నమ్మని వ్యక్తిగా కనిపించే హీరో జీవితంలో దేవతలొచ్చాక ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేదే సినిమాలో ప్రధాన వినోదమని పేర్కొన్నారు. కామెడీ విషయంలో డైరెక్టర్ తన బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయేలా సీన్స్ ను డిజైన్ చేశారని తెలిపారు. చాలా క్లీన్, ఆర్గానిక్ కామెడీతో ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలా సినిమా ఉంటుందని చెప్పారు. చిన్నపిల్లలకు కూడా ఫాంటసీ ప్రపంచం, స్వర్గం- నరకం వంటి అంశాలు కొత్త అనుభూతిని ఇస్తాయని అన్నారు. సినిమాలో వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, అజయ్, తారక్ పొన్నప్ప తదితరులతో కూడిన భారీ నటీనటుల బృందం మెయిన్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుందని నరేష్ తెలిపారు. ముఖ్యంగా వెన్నెల కిషోర్ క్యారెక్టర్ చాలా కొత్తగా, వినోదాత్మకంగా ఉంటుందని చెప్పారు. ట్రైలర్‌లో వైరలైన ఓజీ స్పూఫ్ ఎపిసోడ్ కూడా సినిమాలో కథకు చాలా నేచురల్ గా కనెక్ట్ అవుతుందని, థియేటర్‌లో చూస్తే ఆ సిట్యుయేషన్ స్పూఫ్ లా కాకుండా డిఫరెంట్ గా అర్థమవుతుందని అన్నారు.
ఇటీవల ఆడియన్స్ ఎక్కువగా డార్క్, సీరియస్ జోన్ సినిమాలు చూసారని, ఇప్పుడు మళ్లీ లైట్ హార్టెడ్ కామెడీ ఎంటర్‌టైనర్స్‌కు మంచి ఆదరణ ఉంటుందని నరేష్ అభిప్రాయపడ్డారు. ఇకపై తాను కూడా రెండు కామెడీ సినిమాలు, ఒక సీరియస్ సినిమా అన్నట్లుగా కెరీర్‌ను బ్యాలెన్స్ చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. సుడిగాడు2 పై కూడా ఇంట్రెస్ట్ ఉందని చెప్పిన నరేష్, ప్రస్తుత కాపీరైట్ సిట్యుయేషన్స్ లో స్పూఫ్ సినిమాలు చేయడం గతంతో పోలిస్తే చాలా కష్టంగా మారిందన్నారు. మంచి కథలు వస్తే మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి సిద్ధమని చెప్పిన నరేష్.. రితేష్ రానా, తరుణ్ భాస్కర్ వంటి యంగ్ డైరెక్టర్లతో పనిచేయాలనే ఆసక్తి ఉందని తెలిపారు.
ప్రస్తుతం తాను నటించిన ఆల్కహాల్ సినిమా రిలీజ్ కు రెడీ గా ఉండగా, కనకదుర్గ మూవీ షూటింగ్ కొనసాగుతోందని తెలిపారు. మొత్తానికి, ఇటీవల చేసిన సీరియస్ సినిమాల తర్వాత రంభ ఊర్వశి మేనక పూర్తిగా నవ్వులతో నిండిన లైట్ హార్టెడ్ ఎంటర్‌టైనర్ అని అల్లరి నరేష్ చెబుతున్నారు. రెండున్నర గంటల పాటు ఫ్యామిలీతో కలిసి హాయిగా నవ్వుకునే సినిమాగా నరేష్ ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. మరి రంభ ఊర్వశీ మేనక.. నరేష్ కు ఎలాంటి ఫలితాన్నిస్తారో చూడాలి.