ఆ రోల్.. రామ్ మార్కెట్‌కు ప్లస్ అవుతుందా?
రామ్ పోతినేనికి ఇప్పుడు ఒక మంచి హిట్ అవసరం ఉంది. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత వచ్చిన సినిమాల్లో ఏదీ ఆ స్థాయి ఫలితం ఇవ్వలేదు.
రామ్ పోతినేనికి ఇప్పుడు ఒక మంచి హిట్ అవసరం ఉంది. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత వచ్చిన సినిమాల్లో ఏదీ ఆ స్థాయి ఫలితం ఇవ్వలేదు. ‘స్కంద’, ‘డబుల్ ఇస్మార్ట్’ నిరాశపరిచాయి. గత ఏడాది వచ్చిన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’కు కూడా బాక్సాఫీస్ దగ్గర అనుకున్న ఫలితం రాలేదు. ఇప్పుడు తన 23వ సినిమాకు తానే దర్శకత్వం వహిస్తూ మరో ప్రయత్నం చేస్తున్నాడు. ఇదే సమయంలో రజనీకాంత్ ‘ధర్మన్’లో రామ్‌కు కీలక పాత్ర దొరికింది.
రామ్‌కు తమిళ సినిమా కొత్త కాదు. 2022లో లింగుస్వామి దర్శకత్వంలో ‘ది వారియర్’ను తెలుగు, తమిళ భాషల్లో చేశారు. తమిళ మార్కెట్‌లో హీరోగా అడుగు పెట్టేందుకు అది మంచి అవకాశం అనుకున్నారు. కానీ సినిమా ఫలితం తేడా కొట్టడంతో అక్కడ రామ్‌కు కావాల్సిన బ్రేక్ రాలేదు. ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత మళ్లీ తమిళ సినిమాలోకి వెళ్తున్నాడు. ఈసారి మాత్రం సోలో హీరోగా కాదు. రజనీకాంత్ సినిమాలో ఒక కీలక పాత్రతో కనిపించనున్నాడు.
‘ధర్మన్’లో రామ్ ఏ పాత్ర చేస్తున్నాడనేది మేకర్స్ ఇంకా బయటపెట్టలేదు. రజనీకి అల్లుడిగా, నెగెటివ్ షేడ్స్‌తో కనిపిస్తాడనే వార్తలు ఉన్నాయి. కానీ అవి ఇంకా అఫిషియల్ కాదు. సినిమా టీమ్‌కు దగ్గరగా ఉన్న వర్గాలు మాత్రం రామ్‌ది కీలక పాత్ర అని చెబుతున్నాయి. అంటే కొద్దిసేపు వచ్చిపోయే క్యామియో కాదనే అంచనా పెట్టుకోవచ్చు. దర్శకుడు అశ్వత్ మారిముత్తు ఈ సినిమాను ఫ్యామిలీ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నాడు.
ఇక్కడ ‘కూలీ’ ఉదాహరణ కూడా గుర్తొస్తుంది. రజనీతో పాటు నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్ లాంటి స్టార్లు ఉన్నా అందరికీ ఒకే స్థాయిలో పాత్రలు దక్కలేదు. ముఖ్యంగా ఉపేంద్ర, ఆమిర్ పాత్రలపై రిలీజ్ తర్వాత విమర్శలు వచ్చాయి. పెద్ద స్టార్ సినిమాలో ఉండటం ఒక్కటే మరో హీరోకు ఉపయోగపడదు. అతనికి గుర్తుండిపోయే క్యారెక్టర్ కూడా పడాలి. ‘కూలీ’కి మిక్స్‌డ్ టాక్ వచ్చినా సినిమా మాత్రం భారీ వసూళ్లు సాధించింది.
అశ్వత్ మారిముత్తు దగ్గర రామ్‌కు అదే ఛాన్స్ ఉందేమో చూడాలి. ‘ఓ మై కడవులే’, ‘డ్రాగన్’తో అతను క్యారెక్టర్స్‌ను కథలో కలిపే విధానానికి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు రజనీ సినిమాకు వచ్చినప్పుడు మిగతా నటులను కేవలం స్టార్ వ్యాల్యూకే వాడతాడా, లేక కథలో వాళ్లకు పని ఇస్తాడా అనేది ‘ధర్మన్’లో తెలుస్తుంది. రామ్ పాత్ర నిజంగా రజనీకి ఎదురుగా నడిచే ట్రాక్ అయితే అతనికి తమిళ ప్రేక్షకుల్లో మళ్లీ క్రేజ్ దక్కుతుంది.
‘ధర్మన్’ షూటింగ్ ప్రస్తుతం స్పీడ్ గానే జరుగుతోంది. సిమ్రాన్, రాశీ ఖన్నా కూడా సినిమాలో ఉన్నారు. కమల్ హాసన్ నిర్మిస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. రామ్ తన సొంత సినిమా షూటింగ్ మధ్యలో దీనికి డేట్స్ కేటాయించనున్నాడు. ‘ది వారియర్’తో తమిళంలో మిస్ అయిన అవకాశాన్ని ఈసారి రజనీ సినిమా ద్వారా ఎంతవరకు ఉపయోగించుకుంటాడో చూడాలి.