'సీతా స్వ‌యంవ‌రం'లో శివ‌ధ‌నుస్సు ఎత్తే సీన్.. ఇది రావ‌ణుడికి కాదు నితీష్‌కి ఛాలెంజ్!

అంతేకాకుండా.. మోడ్ర‌న్ డే సినిమాలో విల‌న్‌ పాత్రకు ఇచ్చే విజువల్ ఎలివేషన్ .. భారీ డైలాగ్స్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే ప్రధాన ఆకర్షణలుగా మార‌తాయి.;

Update: 2026-05-09 04:48 GMT

నితీష్ తివారీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న `రామాయణం` చిత్రం ప్రస్తుతం ముంబైలో కీలక షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్‌లో భాగంగా మిథిలా నగరాన్ని ప్ర‌తిబింబించేలా భారీ సెట్లను నిర్మించి సీత స్వయంవరం వంటి కీలక ఘట్టాలను చిత్రీకరిస్తున్నారు. ముఖ్యంగా రావణుడి పాత్రలో నటిస్తున్న కన్నడ స్టార్ యష్ ఈ స్వయంవర సభలోకి ప్రవేశించే సన్నివేశం.. శివధనుస్సును ఎత్తడానికి ప్రయత్నించి విఫలమయ్యే దృశ్యాలను వందలాది మంది జూనియర్ ఆర్టిస్టుల మధ్య అత్యంత వైభవంగా తెరకెక్కిస్తున్నారు. ఈ స‌న్నివేశం కోసం గుర్ గావ్ లో భారీగా కోట‌లు, వీధి ప్రాకారాలు నిర్మించారు.

ఈ భారీ బడ్జెట్ చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీ‌రాముడిగా న‌టిస్తుండ‌గా, సాయి పల్లవి సీత‌గా న‌టిస్తోంది. సన్నీ డియోల్ ఆంజ‌నేయుడిగా న‌టిస్తున్నారు. ఆస్కార్ గ్ర‌హీత‌, మ్యాస్ట్రో ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. నిర్మాత నమిత్ మల్హోత్రా దాదాపు 4000 కోట్ల బ‌డ్జెట్ తో ఈ రెండు భాగాల‌ చిత్రాన్ని విజువల్ వండర్‌గా తీర్చిదిద్దుతున్నారు.

తాజా స‌మాచారం మేర‌కు.. ఏప్రిల్ నుంచి తన వంతు షూటింగ్‌లో పాల్గొంటున్న యష్ రావణుడి పాత్రకు ఉండాల్సిన గాంభీర్యం కోసం చాలా ముందుగా ప్రాక్టీస్ చేసార‌ని తెలుస్తోంది. శివ‌ధ‌నుస్సు ఎత్తే స‌న్నివేశంలో అవ‌మానం భ‌రించే సీన్ లో య‌ష్ ఆహార్యం మ‌రో లెవ‌ల్ లో ఆవిష్క‌రించాల్సి ఉంటుంది. హిస్ట‌రీ ప్ర‌కారం.. ఎన్టీఆర్, ఎస్వీఆర్, కైకాల స‌త్య‌నారాయ‌ణ‌, కృష్ణం రాజు స‌హా దిగ్గ‌జ న‌టులు రావ‌ణుడి పాత్ర‌లో జీవించారు. ఇప్పుడు అంత‌కుమించి య‌ష్ త‌న ఆహార్యాన్ని ప్ర‌ద‌ర్శించాల్సి ఉంటుంది. నితీష్ `రామాయ‌ణం` మొద‌టి భాగం అన్ని పనులను పూర్తి చేసుకుని ఈ ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాలో అత్యంత కీల‌క‌మైన శివ‌ధ‌నుస్సు ఎత్తే సీన్ ని ఎమోష‌న‌ల్ గా పండించాలంటే య‌ష్ నుంచి ఉత్త‌మ‌మైన ఆహార్యాన్ని రాబ‌ట్ట‌డంలో ద‌ర్శ‌కుడు నితీష్ కే ఎక్కువ స‌వాల్ ఎదుర‌వుతుంద‌ని అంతా భావిస్తున్నారు.

పౌరాణికంలో రావ‌ణుడు ఎంత కీల‌కం?

పౌరాణిక చిత్రాలలో కథానాయకుడి ధర్మ నిరతిని వ్యక్తిత్వాన్ని ఎలివేట్ చేయడంలో ప్రతినాయకుడి పాత్ర అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా రావణుడి వంటి పాత్రలు కేవలం విలనిజానికి పరిమితం కాకుండా అపారమైన జ్ఞానం, భక్తి, పరాక్రమం కలిగిన శ‌క్తి సంప‌న్నుడుగా, శంక‌రుని భ‌క్తుడిగా ఉండటం వల్ల ఆ పాత్రకు ఒక ప్రత్యేకమైన గాంభీర్యం ఉంటుంది. కథానాయకుడు (రాముడు) విజయం సాధించినప్పుడు కలిగే తృప్తి కంటే.. అంతటి శక్తివంతుడైన ప్రతినాయకుడిని ఎలా ఎదుర్కొన్నాడు? అనే ఉత్కంఠే ప్రేక్షకులను సినిమాకు ఎక్కువగా కనెక్ట్ చేస్తుంది. ప్రతినాయకుడు ఎంత బలంగా ఉంటే.. అతడిపై సాధించే విజయం అంత గొప్పగా అనిపిస్తుంది.. ఇది సినిమా బాక్సాఫీస్ విజయావకాశాలను నేరుగా ప్రభావితం చేస్తుంది.

అంతేకాకుండా.. మోడ్ర‌న్ డే సినిమాలో విల‌న్‌ పాత్రకు ఇచ్చే విజువల్ ఎలివేషన్ .. భారీ డైలాగ్స్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే ప్రధాన ఆకర్షణలుగా మార‌తాయి. రామాయణం వంటి గాథల్లో రావణుడికి ఉండే వైవిధ్యమైన పార్శ్వాలు నటులకు తమ నటనా కౌశలాన్ని ప్రదర్శించడానికి గొప్ప అవకాశం కల్పిస్తాయి. యష్ వంటి స్టార్ హీరోలు ఇటువంటి పాత్రలు పోషించినప్పుడు వారి స్క్రీన్ ప్రెజెన్స్- బాడీ లాంగ్వేజ్ కథలోని డ్రామాను మరో స్థాయికి తీసుకెళ్తాయి. రామాయ‌ణ క‌థ‌లో శ్రీ‌రాముడి పాత్ర ఆదర్శవంతంగా ఉంటే..రావ‌ణుడి పాత్ర ఉద్వేగభరితంగా - సవాల్‌గా ఉంటుంది. ఈ రెండు పాత్రల మధ్య జరిగే పోరాటమే సినిమా గ్రాండియారిటీతో విజువ‌ల్ ఫెస్టివ‌ల్ గా మార‌డానికి దారి తీస్తుంది.

విజువల్ ఎఫెక్ట్స్- సెట్టింగుల ప్రభావం

భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రాల్లో అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, భారీ సెట్టింగులు ప్రేక్షకుడిని ఒక కొత్త లోకంలోకి తీసుకెళ‌తాయ‌న‌డంలో సందేహం లేదు. పౌరాణిక కథలు అనగానే మన ఊహల్లో ఉండే అద్భుతమైన నగరాలు, మాయాజాలం, దైవిక శక్తులను వెండితెరపై కళ్లకు కట్టినట్లు చూపించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. `రామాయ‌ణం`లో మిథిలా న‌గ‌ర సృష్టి కోసం సెట్లు చాలా ఉప‌క‌రిస్తున్నాయి.

అంతేకాకుండా సాంకేతికత పెరిగిన నేటి కాలంలో ప్రేక్షకులు విజువల్ క్వాలిటీని ఎక్కువ‌గా గ‌మ‌నిస్తున్నారు. హాలీవుడ్ స్థాయి విజువల్స్ ఆశిస్తున్నారు. భారీ సెట్టింగుల‌తో పాటు, వీఎఫ్ఎక్స్ ఇచ్చే విజువ‌ల్ గ్రాండియారిటీ.. థియేట్రిక‌ల్ అనుభ‌వాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లి సాధారణ కథను కూడా ఒక దృశ్య కావ్యంగా మారుస్తుంది.

Tags:    

Similar News