నిర్మాతలపై బుల్లెట్లు: ముంబై అండర్‌వరల్డ్ అరాచకాలపై RGV డీటెయిలింగ్!
ముంబై అండర్ వరల్డ్ - బాలీవుడ్ మధ్య ఉన్న చీకటి సంబంధాల గురించి సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా కొన్ని షాకింగ్ విషయాలను వెల్లడించారు.;
ముంబై అండర్ వరల్డ్ - బాలీవుడ్ మధ్య ఉన్న చీకటి సంబంధాల గురించి సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా కొన్ని షాకింగ్ విషయాలను వెల్లడించారు. 1990వ దశకంలో దావూద్ ఇబ్రహీం వంటి డాన్ల నేతృత్వంలోని మాఫియా సిండికేట్లు చిత్ర పరిశ్రమను ఎలా శాసించేవో ఆయన వివరించారు. కేవలం డబ్బు కోసమే కాకుండా.. పరిశ్రమపై తమ పట్టును.. ఆధిపత్యాన్ని చాటుకోవడానికి మాఫియా గ్యాంగ్స్ సినిమా ప్రముఖులను లక్ష్యంగా చేసుకునేవారని వర్మ పేర్కొన్నారు. క్రైమ్ రైటర్ హుస్సేన్ జైదీతో జరిగిన సంభాషణలో వర్మ ఈ చీకటి కోణాలను విశ్లేషించారు.
ఆ కాలంలో మాఫియా తన శక్తిని నిరూపించుకోవడానికి రాకేష్ రోషన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ వంటి పెద్ద పేర్లను టార్గెట్ చేసేదని ఆర్జీవీ తెలిపారు. ప్రముఖులను భయపెట్టడం ద్వారా మొత్తం పరిశ్రమలో వణుకు పుట్టించడమే వారి ప్రధాన వ్యూహం. ``ఒకరిని చంపి పదిమంది దగ్గర వసూలు చేయాలి`` అనే సూత్రాన్ని గ్యాంగ్ స్టర్స్ అనుసరించేవారని ఆయన చెప్పారు. ఎవరైనా తమ మాట వినకపోతే వారిని ఉదాహరణగా చూపిస్తూ మిగిలిన వారిని లొంగదీసుకోవడమే మాఫియా పనితీరుగా ఉండేదని వర్మ వివరించారు.
ప్రముఖ నిర్మాత గుల్షన్ కుమార్ హత్య వెనుక ఉన్న అసలైన కారణాలను కూడా వర్మ ప్రస్తావించారు. 1997లో జరిగిన ఈ దారుణ హత్య కేవలం డబ్బు కోసమే కాకుండా ఈర్ష్య, అధికార పోరాటాలు.. మాఫియాకు లొంగకపోవడం వల్ల జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. అబు సేలమ్ వంటి వారు తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి గుల్షన్ కుమార్‌ను బలితీసుకున్నారని వర్మ తెలిపారు. ఈ వార్త విన్నప్పుడు చిత్ర పరిశ్రమ మొత్తం ఎంతగా ఒణికిపోయిందో ఆయన గుర్తు చేసుకున్నారు.
మరోవైపు 2000వ సంవత్సరంలో ప్రముఖ నిర్మాత రాకేష్ రోషన్‌పై జరిగిన దాడి వెనుక ఉన్న విస్తుపోయే నిజాలను వర్మ బయటపెట్టారు. `కహో నా ప్యార్ హై` చిత్రం ద్వారా హృతిక్ రోషన్ సెన్సేషనల్ స్టార్‌గా మారిన సమయంలో అతడి డేట్స్ మీద పట్టు సాధించాలని గ్యాంగ్‌స్టర్లు ప్రయత్నించారు. దీనికి రాకేష్ రోషన్ నిరాకరించడంతో తన కార్యాలయం బయటే ఆయనపై కాల్పులు జరిపారు. ఆ దాడిలో ఆయన ప్రాణాలతో బయటపడినా.. ఆ కాలంలో బాలీవుడ్ ఎంతటి భయోత్పాతంలో ఉండేదో ఈ ఘటన నిరూపిస్తుంది.
స్టార్ల కాల్షీట్ల నుండి కాస్టింగ్ వరకు ప్రతి విషయంలోనూ మాఫియా జోక్యం ఉండేదని.. అది కేవలం ఆర్థిక లాభం కోసం కాకుండా నియంత్రణ కోసం జరిగిందని వర్మ నొక్కి చెప్పారు. హృతిక్ వంటి స్టార్లను నేరుగా కలవడం కష్టం కాబట్టి.. బెదిరింపుల ద్వారా నిర్ణయాలను ప్రభావితం చేసేవారని ఆయన అన్నారు. ఆర్జీవీ వెల్లడించిన ఈ వాస్తవాలు అప్పట్లో ముంబై గ్లామర్ ప్రపంచం వెనుక ఉన్న భయంకరమైన నేర సామ్రాజ్యాన్ని మరోసారి కళ్లకు కట్టాయి.