మీరు సీఎం అవ్వాల‌ని కోరుకుంటున్నారు.. యాంక‌ర్ ప్ర‌శ్న‌కు చ‌ర‌ణ్ రిప్ల‌య్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్ర‌స్తుతం రాజ‌కీయాల‌తో సంబంధం లేకుండా సినిమాల‌తో బిజీ బిజీగా ఉన్నారు. ఈ స‌మ‌యంలో ఓ ఇంటర్వ్యూలో యాంకర్ సంధించిన ప్ర‌శ్న అత‌డిని తిక‌మ‌క పెట్టింది.

Update: 2026-05-21 17:00 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్ర‌స్తుతం రాజ‌కీయాల‌తో సంబంధం లేకుండా సినిమాల‌తో బిజీ బిజీగా ఉన్నారు. ఈ స‌మ‌యంలో ఓ ఇంటర్వ్యూలో యాంకర్ సంధించిన ప్ర‌శ్న అత‌డిని తిక‌మ‌క పెట్టింది. మీరు రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తున్నారు? మిమ్మల్ని సీఎం కుర్చీలో చూడాలనేది అభిమానుల కోరిక‌! అని యాంక‌ర్ ప్రశ్నించగా.. చరణ్ ఊహించని విధంగా స్పందించారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన అస్సలు లేదని ఖ‌రాకండిగా చెప్పారు. సినిమా, రాజకీయం అనే రెండు పడవల ప్రయాణం చేయడం తనకు చేతకాదని.. అది చాలా కష్టమైన విషయమని చరణ్ ఈ సందర్భంగా కుండబద్దలు కొట్టారు.

తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి, బాబాయ్ పవన్ కల్యాణ్ రాజకీయాల్లో ఉన్నారని గుర్తు చేసిన చరణ్.. ఆ రంగం తనకు ఏమాత్రం సూట్ కాదని విశ్లేషించారు. ఒకే సమయంలో రెండు విభిన్న రంగాలకు న్యాయం చేయడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. రాజకీయాల వైపు వెళ్లకుండా.. తాను నమ్ముకున్న నటనారంగంలోనే మరింతగా రాణించి, భవిష్యత్తులో నంబర్ వన్ స్థానాన్ని అందుకోవడమే తన ఏకైక లక్ష్యమని మెగా పవర్ స్టార్ స్పష్టం చేశారు. కేవలం సినిమాలపైనే తన పూర్తి శ్రద్ధను నిలపనున్నట్లు ఈ ఇంటర్వ్యూ ద్వారా క్లారిటీ ఇచ్చారు.

ఇక తన తాజా చిత్రం `పెద్ది` షూటింగ్ అనుభవాల గురించి మాట్లాడుతూ చరణ్ పలు సంచలన విషయాలను షేర్ చేసారు. దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం తాను ఎన్నడూ లేనంతగా కఠినమైన శారీరక శ్రమను, ఒత్తిడిని ఎదుర్కొన్నానని వెల్లడించారు. ఈ చిత్రం కోసం పడిన కష్టం తన శరీరంపై ఎంతటి తీవ్ర ప్రభావాన్ని చూపిందంటే.. ప్రస్తుతం నా ముద్దుల కూతురు క్లిన్ కారాను చేతుల్లోకి ఎత్తుకోవాలన్నా కూడా ఒళ్లు నొప్పులు పుడుతున్నాయి! అని రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలు మెగా అభిమానులను ఒకింత కలచివేస్తున్నాయి.

పాత్ర రూపకల్పనలో దర్శకుడు బుచ్చిబాబు పట్టుదల ఈ చిత్రంలో ఏ రేంజ్‌లో ఉందో చరణ్ వివరించారు. కథ డిమాండ్ ప్రకారం.. మొదట క్రికెటర్ లుక్ కోసం శరీరాన్ని బాగా తగ్గించి సన్నబడాలని కోరిన దర్శకుడు.. ఆ తర్వాత సీన్లలో కబడ్డీ ఆటగాడి రూపం కోసం బలిష్ఠంగా తయారుకావాలన్నాడు. అంతటితో ఆగకుండా తదుపరి షెడ్యూల్ నాటికి రెజ్లర్ పాత్రకు తగ్గట్టుగా భారీ కాయంతో మారాలని డిమాండ్ చేయడంతో.. అప్పటికప్పుడు బాడీ షేప్‌ను మార్చుకోవడానికి తాను శారీరకంగా నరకం చూశానని చరణ్ పేర్కొన్నారు. సినిమా అవుట్‌పుట్ అత్యంత సహజంగా రావడం కోసం బుచ్చిబాబు ఎక్కడా రాజీ పడకుండా నటీనటుల నుండి బెస్ట్ రాబడుతున్నారని ప్రశంసించారు.

RRR చిత్రంతో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న చరణ్ తన రేంజ్‌ను మరింత పెంచేలా వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు సమానమైన ఎమోషనల్ కంటెంట్ ఉన్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండటంతో అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని తాకాయి. షూటింగ్ దశలోనే బిజినెస్ పరంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తున్న పెద్ది చరణ్ చూపిస్తున్న అంకితభావం కారణంగానే ఏప్రిల్ 2026 నాటి ఓర్మాక్స్ మోస్ట్ పాపులర్ స్టార్స్ జాబితాలో ఆయనను టాప్ స్థానాల్లో నిలబెట్టిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News