'పెద్ది' టీమ్.. అంతా బుచ్చిపై నమ్మకంతోనేనా?

మెగా పవర్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది సినిమా రిలీజ్ కు సిద్ధమవుతోంది.

Update: 2026-06-01 12:57 GMT

మెగా పవర్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది సినిమా రిలీజ్ కు సిద్ధమవుతోంది. జూన్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఆ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తి పెంచగా.. ఇప్పుడు మూవీ టీమ్ మెంబర్స్ చేస్తున్న కామెంట్స్ చర్చకు దారితీస్తున్నాయి.

సాధారణంగా ఒక సినిమా విడుదలకు ముందు నటీనటులు, టెక్నీషియన్స్ ప్రాజెక్ట్‌ ను ప్రశంసించడం కొత్త విషయం కాదు. అయితే పెద్ది విషయంలో వినిపిస్తున్న కామెంట్స్ మాత్రం కాస్త ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ చిత్రానికి వర్క్ చేసిన పలువురు తమ కెరీర్‌ లోనే బెస్ట్ మూవీగా అభివర్ణిస్తుండడం విశేషం. ప్రమోషన్స్ లో చరణ్ తన మూవీల్లో పెద్దికి ప్రత్యేక స్థానం ఉంటుందని చెప్పారు.

మరోవైపు ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా కూడా తన కెరీర్‌ లో చేసిన వర్క్స్ లో ఇది బెస్ట్ ప్రాజెక్టుల్లో ఒకటిగా పేర్కొన్నారు. అలాగే సీనియర్ నటుడు జగపతిబాబు తన సెకెండ్ ఇన్నింగ్స్‌ లో చేసిన సినిమాల్లో ఇది టాప్ లో నిలుస్తుందని చెప్పడం ఆసక్తికరంగా మారింది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తన కెరీర్‌ లో స్పెషల్ గా నిలిచే చిత్రంగా పెద్దిని అభివర్ణించారు. ఇలాంటి కామెంట్స్ అభిమానుల్లో ఆసక్తి పెంచుతున్నాయి. ఒకే సినిమా గురించి పలు విభాగాలకు చెందిన ప్రముఖులు ఒకే అభిప్రాయం వ్యక్తం చేయడం వెనుక కారణం ఏమిటనే చర్చ సాగుతోంది.

కొందరి అభిప్రాయం ప్రకారం.. దర్శకుడు బుచ్చిబాబు కథను తీర్చిదిద్దిన విధానం, పాత్రలు రూపొందించిన తీరు, సినిమా వరల్డ్ ను క్రియేట్ చేసిన పద్ధతిపైనే నమ్మకం కనిపిస్తోందని అంటున్నారు. ఉప్పెనతో దర్శకుడిగా గుర్తింపు పొందిన బుచ్చిబాబు.. తన రెండో సినిమాగా పెద్దిని తెరకెక్కిస్తున్నారు. మొదటి మూవీతో ఎమోషన్స్ ను స్ట్రాంగ్ గా చూపించిన ఆయన.. ఇప్పుడు మరింత పెద్ద స్థాయిలో కథను చెప్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే సినిమా కోసం వర్క్ చేసిన వారిలో నమ్మకం కనిపిస్తోందని టాక్ వినిపిస్తోంది.

అయితే సినిమా విడుదలకు ముందు వచ్చే ప్రశంసలను కంప్లీట్ రిజల్ట్ గా భావించలేమన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ప్రేక్షకుల తీర్పే చివరికి ఏ సినిమాకైనా అసలు రిజల్ట్ గా నిలుస్తుంది. గతంలో కూడా విడుదలకు ముందు భారీ ప్రశంసలు అందుకున్న కొన్ని చిత్రాలు ఆశించిన ఫలితాలు సాధించలేదు. అదే సమయంలో ఎలాంటి హడావుడి లేకుండా వచ్చిన సినిమాలు పెద్ద విజయాలు నమోదు చేసిన సందర్భాలు ఉన్నాయి.

అయినప్పటికీ పెద్ది విషయంలో ప్రత్యేకంగా కనిపిస్తున్న అంశం ఏమిటంటే.. సినిమా కోసం పనిచేసిన ప్రముఖులు దాదాపు ఒకే విధంగా ప్రశంసలు కురిపించడం. అది కేవలం ప్రమోషన్స్ లో భాగమా? లేక నిజంగానే బుచ్చిబాబు తెరకెక్కించిన కంటెంట్‌ పై ఉన్న నమ్మకమా? అనే ప్రశ్నకు సమాధానం జూన్ 4న థియేటర్లలో ప్రేక్షకుల రెస్పాన్స్ తో తేలనుంది. ప్రస్తుతం మాత్రం మూవీ టీమ్ నుంచి వచ్చిన కామెంట్స్ అభిమానుల్లో అంచనాలు మరింత పెంచుతున్నాయి.

Tags:    

Similar News