'పెద్ది' విడుదల తేదీపై బుచ్చిబాబు క్లారిటీ.. మెగా ఫ్యాన్స్‌కు పండగే
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా.. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం `పెద్ది` గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.;
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా.. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం `పెద్ది` గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా విడుదల తేదీ విషయంలో అభిమానుల్లో నెలకొన్న సందిగ్ధతకు తాజాగా తెరపడింది. ఈ ఆదివారం సాయంత్రం ధనుష్ నటించిన`కర` ప్రీ-రిలీజ్ వేడుకలో పాల్గొన్న పెద్ది దర్శకుడు బుచ్చిబాబు తన సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. జూన్ 25న `పెద్ది` ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుందని ఆయన స్పష్టం చేయడంతో వాయిదాల ఫర్వానికి ముగింపు పడింది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. వేడుకలో బుచ్చిబాబు మాట్లాడుతూ.. తాను నేరుగా సెట్స్ నుంచే ఈ కార్యక్రమానికి విచ్చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం చిత్రంలోని ఒక భారీ ఐటమ్ నంబర్ సాంగ్‌ను తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించారు. ఈ పాట సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని.. షూటింగ్ శరవేగంగా జరుగుతోందని చెప్పడం విశేషం. మరో కొన్ని రోజుల్లోనే షూటింగ్ మొత్తం పూర్తి చేసి.. గుమ్మడికాయ కొట్టేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. మే నెలాఖరుకల్లా పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసి.. ప్రమోషన్స్ ప్రారంభించాలని టీమ్ ప్లాన్ చేస్తోంది.
నిజానికి `పెద్ది` జూన్ 4వ తేదీనే విడుదలవుతుందని గతంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ టెక్నికల్ పనులు ..సాంగ్ షూట్ కారణంగా విడుదల కాస్త ఆలస్యమైంది. ఇప్పుడు స్వయంగా దర్శకుడే జూన్ 25 అని క్లారిటీ ఇవ్వడంతో మెగా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. రామ్ చరణ్ ఈ చిత్రంలో పూర్తి భిన్నమైన లుక్‌లో కనిపించనుండటం.. బుచ్చిబాబు తనదైన శైలిలో స్పోర్ట్స్ డ్రామాగా దీనిని రూపొందించడం సినిమాపై భారీ అంచనాలను పెంచింది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ కూడా త్వరలోనే భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు.
మరోవైపు.. అఖిల్ అక్కినేని కథానాయకుడిగా నటిస్తున్న `లెనిన్` సినిమాకు కూడా `పెద్ది` విడుదల తేదీ ఖరారు కావడంతో లైన్ క్లియర్ అయ్యింది. నిర్మాత నాగవంశీ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను జూన్ 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని యోచిస్తున్నట్టు కథనాలొచ్చాయి. పెద్ది విడుదలైన మరుసటి రోజే లెనిన్ వస్తుందా లేక రిలీజ్ తేదీ మారుతుందా? అన్నది ఇప్పటికి సస్పెన్స్. అఖిల్ తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ చిత్రంపై కూడా సినీ వర్గాల్లో మంచి బజ్ ఉంది.
ఈ వరుస ప్రకటనలతో టాలీవుడ్ వేసవి సీజన్ ముగింపు .. వర్షాకాల ప్రారంభం బాక్సాఫీస్ వద్ద సందడిగా మారనుంది. షూటింగ్ విశేషాలు పరిశీలిస్తే.. బుచ్చిబాబు తన `పెద్ది` చిత్రం కోసం అత్యున్నత సాంకేతిక విలువలను ఉపయోగిస్తున్నారు. రామ్ చరణ్ బాడీ లాంగ్వేజ్ నుంచి బ్యాక్‌డ్రాప్ వరకు ప్రతిదీ కొత్తగా ఉంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. త్వరలోనే చిత్ర ట్రైలర్ - ఆడియో వేడుకలకు సంబంధించిన తేదీలను కూడా ప్రకటించే అవకాశం ఉంది.