మరోసారి చెర్రీ కుంభస్థలాన్ని బద్దలు కొడతారా?
ఇప్పుడు అదే డైలాగ్ ను అభిమానులు రియల్ లైఫ్‌కు కనెక్ట్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ రేంజ్ పూర్తిగా మారిపోయింది.
టాలీవుడ్ లో ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాపైనే భారీ చర్చ నడుస్తోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ గా ఎదిగిన చరణ్.. ఇప్పుడు మరోసారి భారీ హిట్ తో బాక్సాఫీస్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టేందుకు సిద్ధమవుతున్నారన్న టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమాలో వచ్చిన పవర్ ఫుల్ డైలాగ్ ను అభిమానులు ఇప్పుడు మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు.
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ లో అల్లూరి సీతారామరాజుగా నటించిన చరణ్.. కొమురం భీమ్ పాత్రలో నటించిన జూ.ఎన్టీఆర్ తో కలిసి 'భీమ్.. ఈ నక్కల వేట ఎంతసేపు? కుంభస్థలాన్ని బద్దలు కొడదాం పదా!' అంటూ చెప్పే డైలాగ్ ప్రేక్షకుల్లో భారీ ఎమోషన్ క్రియేట్ చేసింది. చిన్న చిన్న దాడులు కాకుండా నేరుగా శత్రువుల ప్రధాన కేంద్రంపైనే దాడి చేయాలని సూచించే ఆ సీన్ సినిమాకే హైలైట్ గా నిలిచింది.
ఇప్పుడు అదే డైలాగ్ ను అభిమానులు రియల్ లైఫ్‌కు కనెక్ట్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఇండియాలో మాత్రమే కాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆయనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. హాలీవుడ్ మీడియా నుంచి ప్రశంసలు రావడం, విదేశీ అభిమానులు పెరగడం వంటి పరిణామాలతో చరణ్ గ్లోబల్ స్టార్ గా నిలిచారు. దీంతో ఆయన అప్ కమింగ్ సినిమాలపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
అయితే ఆర్ఆర్ఆర్ తర్వాత వచ్చిన సినిమాలు మాత్రం అభిమానుల ఆశలు పూర్తిగా అందుకోలేకపోయాయి. ఆచార్య సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించినా సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇక భారీ అంచనాల మధ్య వచ్చిన గేమ్ ఛేంజర్ ఏకంగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది. దీంతో ఇప్పుడు చరణ్ అభిమానుల దృష్టి మొత్తం పెద్దిపైనే పడింది.
దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్న పెద్ది గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాగా రూపుదిద్దుకుంటోంది. ఉప్పెన సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బుచ్చిబాబు.. ఈసారి చరణ్ ను పూర్తి భిన్నమైన పాత్రలో చూపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, చరణ్ లుక్ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచాయి. ముఖ్యంగా రగ్గడ్ మేకోవర్ లో చరణ్ కనిపించడం అభిమానులకు కొత్త అనుభూతిని ఇస్తోంది.
సినిమాను చరణ్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకోవడం, పాత్ర కోసం లుక్ మార్చుకోవడం మాత్రమే కాకుండా.. ప్రమోషన్ల విషయంలో కూడా ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. భారీ స్థాయిలో మార్కెట్ ను టార్గెట్ చేస్తూ పాన్ ఇండియా స్థాయిలో సినిమాను తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఈసారి చెర్రీ నిజంగా కుంభస్థలాన్ని బద్దలు కొడతారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత వచ్చిన నిరాశలను పక్కనపెట్టి.. పెద్దితో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటారేమో అన్న ఆశతో అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరి ఆ సినిమా చరణ్ కెరీర్ లో మరో మైలురాయిగా నిలుస్తుందా? లేదా అన్నది విడుదల తర్వాత తేలనుంది.