శాఖాహారంతో 'పెద్ది' బీస్ట్ లుక్ సాధ్య‌మేనా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి చిత్రం `పెద్ది` కోసం సిద్ధం చేసిన `బీస్ట్ లుక్` ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.;

Update: 2026-03-29 19:30 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి చిత్రం `పెద్ది` కోసం సిద్ధం చేసిన `బీస్ట్ లుక్` ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఒక గ్రామీణ క్రికెటర్ గా టీజ‌ర్, పోస్ట‌ర్ల‌లో క‌నిపించిన చ‌ర‌ణ్ ప‌హిల్వాన్ గా మార‌డం అంద‌ర‌నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అయితే ఇటీవ‌ల బ‌ర్త్ డే సంద‌ర్భంగా విడుద‌లైన కొత్త టీజ‌ర్ లో పెద్ది బీస్ట్ లుక్ ఇంట‌ర్నెట్ లో చ‌ర్చ‌గా మారింది. కుస్తీలు పడుతూ, మట్టి అఖారాలో పహిల్వాన్‌గా చెలరేగిపోయే ఈ రఫ్ అండ్ టఫ్ లుక్ సాధించడం అంత సులభం కాదు. దీనికోసం చరణ్ గత ఎనిమిది నెలలుగా ప్రతిరోజూ తెల్లవారుజామున 5:30 గంటలకే నిద్రలేచి.. అత్యంత కఠినమైన శిక్షణతో పాటు అపారమైన క్రమశిక్షణను అనుస‌రించార‌ని తెలిసింది.

చరణ్ ఈ అద్భుతమైన శరీరాకృతిని కేవ‌లం శాఖాహారం తోనే సాధించాడ‌నేది మ‌రో సెన్సేష‌న్. ఇటీవ‌లి కాలంలో అత‌డు ఏ వేదిక‌పై చూసినా అయ్య‌ప్ప స్వామి మాల ధ‌రించి క‌నిపించారు. అంటే ధీక్ష‌లో ఉండి శాఖాహారం తీసుకుంటూనే ఇది సాధించార‌న్న‌మాట‌. ఇది నిజంగా ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన ఫ‌లితం. అలాగే ఈ వ్యాయామంలో `గ‌ద‌`ను ఎక్కువ‌గా ఉప‌యోగించార‌ని తెలిసింది. ఈ గ‌ద‌ను ముగ్ధార్ అని కూడా పిలుస్తారు. ఇది ఒక బ‌రువైన చెక్క‌. టీజ‌ర్ లో చూపించిన‌ట్టు గ‌ద‌ను తిప్పుతూ అత‌డు పోరాట స‌న్నివేశంలో క‌నిపిస్తార‌ని అర్థ‌మ‌వుతోంది.

సాధారణంగా భారీ కండలు పెంచాలంటే మాంసాహారం తప్పనిసరి అనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. కానీ చరణ్ కేవలం శాఖాహారంతోనే ఈ స్థాయి ఫిజిక్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. రసాయనాలతో కలుషితమైన పౌల్ట్రీ ఫుడ్ లేదా ర‌సాయ‌న‌ మాంసాహారం వంటి విషాన్ని పక్కన పెట్టి.. ప్రకృతి సిద్ధమైన కాయగూరలు, ఆకుకూరలు, పప్పు ధాన్యాలతోనే ఇదంతా సాధ్యమని నిరూపించారు. ఆరోగ్యకరమైన భోజనంతో కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో బాడీని బిల్డ్ చేయవచ్చని చరణ్ చాటిచెప్పారు.

చాలా మంది స్టార్లు వెజిటేరియ‌న్లు:

గతంలో బాలీవుడ్ స్టార్లు సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, వివేక్ ఒబెరాయ్ వంటి వారు కూడా శాఖాహారులుగా ఉంటూనే తమ కండలను పెంచి ఫిట్ నెస్ పై అవగాహన కల్పించారు. ఇప్పుడు చరణ్ కూడా అదే బాటలో పయనిస్తూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. హార్మోన్ ఇంజెక్ష‌న్ ల‌తో నిండిన మాంసాహారం కంటే, స్వచ్ఛమైన శాఖాహారం ఆరోగ్యానికి, శారీరక దృఢత్వానికి ఎంతో మేలు చేస్తుందని నిరూప‌ణ అవుతోంది. క్రమశిక్షణ కలిగిన జీవనశైలి ఉంటే ఏదైనా సాధ్యమని చరణ్ `పెద్ది` లుక్ ద్వారా స్పష్టమవుతోంది.

సినిమాలో చరణ్ పాత్ర తొలుత క్రికెట్ నేపథ్యంతో పరిచయమైనా.. తాజా దృశ్యాలు ఆయన కుస్తీ పడుతున్న శిక్షణను వెల్లడిస్తున్నాయి. ఏప్రిల్ 30న పెద్ది విడుద‌ల కానుంది. ఇప్పటికే ఏఆర్ రెహమాన్ అందించిన పాటలు ప్రపంచవ్యాప్తంగా చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. చరణ్ పడ్డ కష్టం తెర‌పై ప్ర‌తిఫ‌లిస్తోంది. గ‌త ఫెయిల్యూర్ నుంచి బ‌య‌ట‌ప‌డేంత‌గా బాక్సాఫీస్ వద్ద పెద్ద‌ విజయాన్ని నమోదు చేస్తాడ‌ని అభిమానులు ఆశిస్తున్నారు.

Tags:    

Similar News