రజినీతో సినిమా.. కమల్ ఇచ్చిన క్లారిటీ
సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ నాలుగు దశాబ్దాలకు పైగా విరామం తర్వాత కలిసి సినిమా చేయబోతున్నట్లు తొలిసారి సమాచారం వచ్చినపుడు వీళ్లిద్దరి అభిమానులు ఎంతో ఎగ్జైట్ అయ్యారు.;
సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ నాలుగు దశాబ్దాలకు పైగా విరామం తర్వాత కలిసి సినిమా చేయబోతున్నట్లు తొలిసారి సమాచారం వచ్చినపుడు వీళ్లిద్దరి అభిమానులు ఎంతో ఎగ్జైట్ అయ్యారు. కొన్ని నెలల పాటు ఈ ప్రాజెక్టు గురించి అనేక ఊహాగానాలు నడిచాయి. చివరికి కమల్ నిర్మాతగా రజినీ హీరోగా సుందర్ దర్శకత్వంలో సినిమా రాబోతున్నట్లు ఇటీవల ప్రకటన రాగానే అందరూ ఉస్సూరుమన్నారు.
రజినీ, కమల్ కలిసి నటిస్తే చూద్దామనుకుంటే.. ఇదేం ట్విస్ట్ అనుకున్నారు. పైగా ఫాంలో లేని సుందర్ దర్శకుడు అనగానే చాలామంది పెదవి విరిచారు. కానీ కొన్ని రోజులకే సుందర్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి ఇంకో ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో రజినీ, కమల్ మూవీ సంగతి ఏమవుతుందో అన్న అయోమయం నెలకొంది. ఐతే ఇప్పుడు కమల్ హాసన్ లైన్లోకి వచ్చి అభిమానుల్లో ఉత్సాహం నింపే మాట చెప్పాడు.
సుందర్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంపై ఇక మాట్లాడేదేమీ లేదని కమల్ స్పష్టం చేశాడు. తాను ఈ ప్రాజెక్టులో లేనని సుందర్ ప్రకటించేశాడు కాబట్టి.. ఇక ఆయనతో తమ కాంబినేషన్ ఉండదని కమల్ తేల్చి చెప్పాడు. తన చేతిలో ఒక పెద్ద స్టార్ ఉన్నాడని.. ఆ స్టార్‌ను మెప్పించే కథను తయారు చేయడం నిర్మాతగా తన బాధ్యత అని కమల్ తెలిపాడు. మంచి కథ దొరికే వరకు తమ ప్రయత్నం కొనసాగుతుందని కమల్ చెప్పాడు.
మరోవైపు తాను, రజినీ కలిసి నటించే సినిమా గురించి కమల్ మాట్లాడ్డం విశేషం. ఆ ప్రాజెక్టు కోసం కూడా కథ అన్వేషణ జరుగుతోందని ఆయన తెలిపారు. కమల్ నిర్మాగా సుందర్ దర్శకత్వంలో రజినీ సినిమా అనౌన్స్ చేయడంతో ఇద్దరు లెజెండ్స్ కలయిక దీనికే పరిమితం అనుకున్నారు చాలామంది. ఇద్దరూ కలిసి నటించరేమో అనుకున్నారు. కానీ ఆ ప్రాజెక్టు వేరు, ఈ ప్రాజెక్టు వేరు అని కమల్ స్పష్టం చేశారు. మంచి కథలు దొరికితే రెండు సినిమాలూ ముందుకు కదులుతాయని ఆయన చెప్పకనే చెప్పేశారు. ఇక వీళ్లిద్దరినీ మెప్పించడం రచయితలు, దర్శకుల వంతు.