రాజేంద్రుడు.. తంబీలు అంతలా ఫైర్ అవ్వడానికి కారణమేంటి?

తమిళ సినీ అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విమర్శలు చేయడంతో ఆ వివాదం మరింత పెద్దదైంది.;

Update: 2026-03-13 15:33 GMT

టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తమిళ సినీ వర్గాల్లో పెద్ద వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కోలీవుడ్ లెజెండ్ ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) గురించి చేసిన కామెంట్స్ అక్కడి అభిమానులను తీవ్రంగా ఆగ్రహానికి గురి చేశాయి. పెద్ద ఎత్తున ట్రోల్స్ కూడా వచ్చాయి. దీంతో రాజేంద్రప్రసాద్ చివరకు క్షమాపణలు చెప్పారు.

ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో తెలుగు పౌరాణిక చిత్రాల ద్వారా గుర్తింపు పొందిన నటుడు కాంతారావు గురించి మాట్లాడిన రాజేంద్రప్రసాద్, ఆయన గొప్పతనాన్ని వివరించే క్రమంలో ఎంజీఆర్ పేరును ప్రస్తావించారు. కాంతారావును చూసి ఎంజీఆర్ కూడా భయపడేవారంటూ.. ఉ*చ్చ అంటూ వ్యాఖ్యానించారు. దీంతో సోషల్ మీడియాలో ఆయన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

ముఖ్యంగా తమిళ సినీ అభిమానులు, అక్కడి ప్రముఖులు రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. అయితే ఎంజీఆర్ కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తమిళనాడు రాజకీయాల్లో కూడా అపారమైన ప్రజాదరణ పొందిన వ్యక్తి. ఆయనను కోట్లాది అభిమానులు ఇప్పటికీ ఆరాధ్యదైవంగా భావిస్తుంటారు. అందుకే రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలను లైట్ తీసుకోలేదని చెప్పాలి.

ఈ నేపథ్యంలో కోలీవుడ్‌ కు చెందిన పలువురు ప్రముఖులు కూడా స్పందించారు. నటుడు విశాల్.. రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే నటుడు నాజర్ కూడా స్పందిస్తూ, ఎంజీఆర్ వంటి మహానుభావుడు గురించి చౌకబారు పోలికలు చేయడం బాధాకరమని అన్నారు. రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలు ప్రతి తమిళుల మనసును నొప్పించాయని వారు వ్యాఖ్యానించారు.

తమిళ సినీ అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విమర్శలు చేయడంతో ఆ వివాదం మరింత పెద్దదైంది. అదే సమయంలో రాజేంద్రప్రసాద్ గతంలో కోలీవుడ్‌ లో కూడా నేరుగా కొన్ని సినిమాల్లో నటించడం, అలాగే డబ్బింగ్ చిత్రాల ద్వారా తమిళ ప్రేక్షకులకు పరిచయం కావడం కూడా చర్చకు వచ్చింది. అలాంటి వ్యక్తి ఎంజీఆర్ గురించి ఇలా మాట్లాడటం తప్పని పలువురు వ్యాఖ్యానించారు.

దీంతో ఇప్పుడు రాజేంద్రప్రసాద్ చివరకు తమిళ్ లో వీడియో విడుదల చేసి క్షమాపణలు చెప్పారు. తాను ఎంజీఆర్‌ను ఎంతో గౌరవంగా భావిస్తానని, ఆయనపై ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు. కాంతారావును ప్రశంసించే క్రమంలో అనుకోకుండా నోరు జారిందని వివరించారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధపెట్టినట్లయితే క్షమాపణలు కోరుతున్నానని, భవిష్యత్‌ లో ఇలాంటి పరిస్థితులు రాకుండా జాగ్రత్త పడతానని రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఈ వివాదం ప్రస్తుతం కొంతమేర సద్దుమణిగినప్పటికీ, సినీ ప్రముఖుల వ్యాఖ్యలు ఎంత జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని మరోసారి గుర్తు చేసింది.

Tags:    

Similar News