'వారణాసి' తర్వాత 'మహాభారతం'! రాజమౌళి మైండ్‌లో ఏం ఉంది?
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సారథ్యంలోని మోస్ట్ అవైటెడ్ #గ్లోబ్ ట్రాటర్ టైటిల్ గ్లింప్స్ ఎట్టకేలకు లాంచ్ అయింది.;
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సారథ్యంలోని మోస్ట్ అవైటెడ్ #గ్లోబ్ ట్రాటర్ టైటిల్ గ్లింప్స్ ఎట్టకేలకు లాంచ్ అయింది. మహేష్ సినిమాకి `వారణాసి` అనే ఆసక్తికర టైటిల్‌ని అధికారికంగా ప్రకటించారు. అయితే టైటిల్ లాంచ్ కోసం జక్కన్న టీమ్ కొద్దిరోజులుగా రామోజీ ఫిలింసిటీలో భారీ వారణాసి సెట్ వేసి, 130 అడుగుల ఐమ్యాక్స్ స్క్రీన్‌ని ఏర్పాటు చేసి చాలా హంగామాను సృష్టించారు. అయితే చివరి నిమిషంలో టైటిల్ గ్లింప్స్ ని లాంచ్ చేయడానికి సాంకేతిక సమస్యలు పెద్ద ఆటంకంగా మారాయి. ఇది రాజమౌళి సహా మహేష్ అభిమానుల్లో తీవ్ర నిరాశను నింపింది. చివరికి టైటిల్ గ్లింప్స్ విడుదలైంది. ఫ్యాన్స్ నుంచి అద్భుత స్పందన వచ్చింది. నందీశ్వరుడిపై మహేష్ ప్రయాణం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఇదంతా ఒకెత్తు అనుకుంటే, ఈ వేడుకలో నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదు! అంటూ రాజమౌళి అసహనంగా కనిపించడం చర్చకు వచ్చింది. టైటిల్ గ్లింప్స్ ఆలస్యం కావడంతో నిరాశలో అలా అన్నారని అంతా భావిస్తున్నారు. ఇక ఇదే వేదికపై అతడు పూర్తి కాంట్రాస్ట్‌గా రామాయణం, మహాభారతం కథలంటే నాకు చాలా ఇష్టం! అని వ్యాఖ్యానించారు. అంతేకాదు మహాభారత కథను సినిమాగా తీయాలని తన మనసులో దాగి ఉన్న పాత ఆలోచనను మరోసారి బహిర్గతం చేసారు రాజమౌళి.
నిజానికి `బాహుబలి-2` రిలీజ్ సమయంలో తనకు మహాభారత కథను సినిమాలుగా తీయాలనే ఆలోచన ఉందని రాజమౌళి చెప్పారు. కానీ దానికోసం ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుందని కూడా అన్నారు. కానీ ఆ తర్వాత ఆర్.ఆర్.ఆర్ ప్రాజెక్ట్ కోసం రాజమౌళి పని చేసారు. ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ తర్వాత చూస్తుండగానే మరో నాలుగేళ్ల కాలం అలా అలా ముందుకు సాగిపోయింది కానీ `మహాభారతం` గురించి మళ్లీ రాజమౌళి ప్రస్థావించలేదు. కనీసం ఆర్.ఆర్.ఆర్ రిలీజైన తర్వాత అయినా రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ `మహాభారతం`ని పట్టాలెక్కిస్తారని అంతా భావించారు. కానీ ఇంతలోనే ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణకు ఇచ్చిన కమిట్‌మెంట్ ని నెరవేర్చేందుకు మహేష్ తో కలిసి ఎస్.ఎస్.ఎంబి 29 చిత్రాన్ని జక్కన్న ప్రారంభించారు. ఈ సినిమా భారతీయ సినిమా హిస్టరీలో నెవ్వర్ బిఫోర్ అనే రేంజులో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. దీనిని పాన్ వరల్డ్ మార్కెట్ ని ఆకర్షించే దిశగా రాజమౌళి అన్ని జాగ్రత్తలు తీసుకుని రూపొందిస్తున్నారు.
ఇప్పుడు మరోసారి వారణాసి టైటిల్ లాంచ్ వేడుకలో `మహాభారతం`పై సినిమా తీయాలనే తన ఆలోచన గురించి రాజమౌళి ప్రస్తావించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. రామాయణం, మహాభారతం కథలపై తనకు ఉన్న ఆసక్తిని రాజమౌళి మరోసారి బయటపెట్టారు. ఇప్పుడు వారణాసిలో శ్రీరాముడి పాత్రలో మహేష్‌ని చూపించబోతున్నాడు. రామాయణంలో ఒక ముఖ్య ఘట్టాన్ని తీసుకుని ఒక పూర్తి స్థాయి ఎపిసోడ్ ని డిజైన్ చేసానని, అది థియేటర్లలో గూస్ బంప్స్ తెస్తుందని, మహేష్ శ్రీరాముడిగా అద్భుతంగా కుదిరాడని ఆనందం వ్యక్తం చేసారు రాజమౌళి. రామాయణం కల కనీసం ఇలా నెరవేరినా కానీ, భారతం కల నెరవేరలేదు.
అయితే వారణాసితో మరోసారి పాన్ వరల్డ్ లో చర్చగా మారుతున్న రాజమౌళి ఈసారి రెగ్యులర్ సినిమా కాకుండా `మహాభారతం` ఫ్రాంఛైజీని ప్రారంభించాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. ఇది మార్వల్ సినిమాటిక్స్ కంటే డిసి యూనివర్శ్ సినిమాల కంటే అత్యంత భారీగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. ఒకేవేళ ఆయన ఇలాంటి భారీ కాన్వాస్ ఉన్న ప్రాజెక్టును ప్రారంభిస్తే, ఇటు టాలీవుడ్ లో ఉన్న డజను మంది టాప్ హీరోలకు, అటు బాలీవుడ్, కోలీవుడ్ సహా దక్షిణాది భాషల్లోని స్టార్ హీరోలలో చాలా మందికి అవకాశాలు కల్పించగలడు. వీళ్లందరినీ ఒకే సినిమాలో వీక్షించే సౌలభ్యం అభిమానులకు కలుగుతుందని అభిమానులు ఆశపడుతున్నారు. అయితే జక్కన్న మైండ్ లో ఏం ఉందో ఇప్పుడే చెప్పలేం. మహేష్ తో `వారణాసి` చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడని కూడా ఒక గుసగుస ఎలానూ ఉంది. రాజమౌళి ఏం ఆలోచిస్తున్నారో తెలియడానికి ఇంకా వేచి చూడాలి.