'చెంపదెబ్బ కొట్టిన ముగ్గురు హీరోయిన్లు!'.. శివాజీకి ఆర్జీవీ మరో పంచ్
టాలీవుడ్ నటుడు శివాజీ దండోరా ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలతో నెలకొన్న వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది.;
టాలీవుడ్ నటుడు శివాజీ దండోరా ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలతో నెలకొన్న వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. హీరోయిన్ల డ్రెస్సింగ్ పై చేసిన కామెంట్స్ పై తీవ్రస్థాయిలో అనేక మంది సినీ సెలబ్రిటీలు మండిపడుతున్నారు. ఇప్పటికే పలువురు అభిప్రాయాలు కూడా వ్యక్తం చేశారు. అందులో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా ఒకరు.
శివాజీ కామెంట్స్ వచ్చిన తర్వాత రోజే స్పందించిన ఆయన.. మహిళలపై చెత్త అభిప్రాయాలను రుద్దే హక్కు లేదని ఎవరికీ ఫైర్ అయ్యారు. నీవు (శివాజీ) ఎవరు అయినా... ఇంట్లోని మహిళలు మొరటు, చెత్త మనిషిని భరించడానికి సిద్ధంగా ఉంటే, నువ్వు వారిని నైతికత పేరుతో నియంత్రించుకోవాలని రామ్ గోపాల్ వర్మ అభిప్రాయపడ్డారు.
ఆ తర్వాత సింగర్ చిన్మయికు మద్దతిస్తూ మరోసారి ఓ వీడియో ద్వారా పరోక్షంగా మండిపడ్డారు. ఢిల్లీ నిర్భయ కేసులో నిందితుడు మాట్లాడిన వీడియోను, శివాజీ మాట్లాడిన వీడియోతో కంపేర్ చేస్తూ.. ఇద్దరూ ఒకటే అన్నట్లు వీడియోను ఓ నెటిజన్ ఎడిట్ చేశారు. దానిని ఆర్జీవీ రీట్వీట్ చేశారు. ఇది అన్నింటినీ చెబుతుందని రాసుకొచ్చారు.
ఇప్పుడు మరోసారి శివాజీకి ఆర్జీవీ కౌంటర్ ఇచ్చారు. అప్ కమింగ్ మూవీ ది రాజా సాబ్ లోని హీరోయిన్స్ ను సోషల్ మీడియాలో మెచ్చుకుంటూ టార్గెట్ చేశారు. రాజా సాబ్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తుండగా.. నిధి అగర్వాల్ , మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ ఫిమేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు.
అయితే రీసెంట్ గా హైదరాబాద్ లో మేకర్స్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేయగా.. ప్రభాస్ తోపాటు నిధి, మాళవిక, రిద్ధి కూడా అటెండ్ అయ్యారు. ఆ సమయంలో మోడ్రన్ డ్రెస్సుల్లో రెడీ అయ్యి వచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు ఆ విషయాన్ని రామ్ గోపాల్ వర్మ.. రీసెంట్ గా సోషల్ మీడియాలో ప్రస్తావించారు.
"ప్రభాస్ నటించిన రాజా సాబ్ ఈవెంట్ లో శివాజీ తోపాటు అతని విషం చిమ్మే బ్యాచ్ నీతి బోధలను ఏ మాత్రం పట్టించుకోకుండా ముగ్గురు హీరోయిన్లు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ తమకు నచ్చిన దుస్తులనే ధరించారు. ఆ విలన్ లకు గట్టి చెంపపెట్టు కొట్టినందుకు ఆ ముగ్గురు హీరోయిన్లకు హ్యాట్సాఫ్" అంటూ రాసుకొచ్చారు ఆర్జీవీ. అంతే కాదు ముగ్గురు హీరోయిన్లతో ప్రభాస్ సెల్ఫీ దిగుతున్న ఫోటో యాడ్ చేశారు.
నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ లను తన పోస్ట్ లో కూడా ట్యాగ్ చేశారు రామ్ గోపాల్ వర్మ. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆర్జీవీ పోస్ట్ ఫుల్ వైరల్ గా మారింది. ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. దీంతో అనేక మంది సినీ ప్రియులు, నెటిజన్లు.. రెస్పాండ్ అవుతూ కామెంట్లు పెడుతున్నారు.