సమంత భర్త కుటుంబం గురించి మీకెంత తెలుసు?
ది ఫ్యామిలీమ్యాన్, ఫర్జీ, సిటాడెల్- హనీ బన్నీ లాంటి వెబ్ సిరీస్ లతో దర్శకనిర్మాతలు రాజ్ అండ్ డీకే పేరు మార్మోగింది.
ది ఫ్యామిలీమ్యాన్, ఫర్జీ, సిటాడెల్- హనీ బన్నీ లాంటి వెబ్ సిరీస్ లతో దర్శకనిర్మాతలు రాజ్ అండ్ డీకే పేరు మార్మోగింది. ఇక సమంతను పెళ్లాడిన తర్వాత రాజ్ పేరు ప్రత్యేకించి మీడియా హెడ్ లైన్స్ లో హైలైట్ అవుతోంది. అయితే రాజ్ నిడిమోరు కుటుంబం గురించి తెలిసింది ఎంత? అంటే...
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో ఒక సాధారణ తెలుగు కుటుంబంలో జన్మించి, నేడు భారతీయ చలనచిత్ర పరిశ్రమతో పాటు ఓటీటీ రంగాన్ని సైతం శాసిస్తున్న అగ్ర దర్శకుడు, నిర్మాత రాజ్ నిడిమోరు. తిరుపతిలోని ప్రతిష్టాత్మక `ఎస్వీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్`లో కంప్యూటర్ సైన్స్ గ్రూప్‌లో బీటెక్ పూర్తి చేసిన రాజ్, అక్కడే తన క్రియేటివ్ పార్ట్‌నర్ కృష్ణ డి.కె.ను కలుసుకున్నారు. చదువు పూర్తయ్యాక ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా అమెరికాకు వలస వెళ్లారు. అయితే సినిమాపై ఉన్న అమితమైన ప్యాషన్‌తో లక్షల రూపాయల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదిలేసి తిరిగి భారత్‌కు వచ్చి రాజ్ & డికె ద్వయంగా సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు.
అమెరికా నుండి తిరిగొచ్చిన ఈ జోడీ భారతీయ సినిమా మేకింగ్ శైలినే మార్చేసింది. బాలీవుడ్‌లో `స్త్రీ` వంటి కల్ట్ హిట్స్ అందించడంతో పాటు, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో సరికొత్త రికార్డులు సృష్టించిన `ది ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ వంటి బ్లాక్‌బస్టర్ వెబ్ సిరీస్‌లను దేశానికి పరిచయం చేశారు. దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా రాజ్ నిడిమోరు సాధించిన ఈ అద్భుత విజయాల ద్వారా నేడు అతడి నికర ఆస్తి విలువ సుమారు 85 నుండి 89 కోట్ల (దాదాపు 10 మిలియన్ యూఎస్ డాలర్లు) వరకు ఉంటుందని అంచనా. ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ స్థాయి నుండి సినీ ట్రేడ్ వర్గాల్లో తిరుగులేని క్రేజ్ ఉన్న ఫిల్మ్‌మేకర్‌గా అతడు ఎదిగిన తీరు ఎందరికో స్ఫూర్తిదాయకం.
ఇక రాజ్ నిడిమోరు వ్యక్తిగత జీవితానికి వస్తే... అతడు గతంలో క్రియేటివ్ ప్రొఫెషనల్.. అసిస్టెంట్ డైరెక్టర్ శ్యామలి దేను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. అయితే కొన్ని మనస్పర్థల కారణంగా ఈ దంపతులు 2022లో చట్టబద్ధంగా విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత హీరోయిన్ సమంత రూత్ ప్రభు తో రాజ్ నిడిమోరు ప్రేమలో పడ్డారు. వీరిద్దరి పరిచయం కాస్తా పెళ్లి పీటల వరకు వెళ్లడంతో గత ఏడాది డిసెంబర్ 1 న కోయంబత్తూరులోని `ఈషా యోగా సెంటర్`లో కేవలం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక వాతావరణంలో వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది.
రాజ్ నిడిమోరు కుటుంబంలో అతడి సోదరి శీతల్ నిడిమోరుకు ప్రత్యేక స్థానం ఉంది. రాజ్ మాతృమూర్తి పేరు రమ రత్నాకర, తండ్రి పేరు కృష్ణ నిడిమోరు. రమ రత్నాకర్ ఒక కళాశాల ప్రొఫెసర్... అలాగే శీతల్ అనే సోదరి రాజ్ కి ఉన్నారు. ఇక శీతల్ తన అన్నయ్యకు ఎంతో అండగా ఉంటారు. మధ్యతరగతి కుటుంబ విలువల మధ్య తాము పెరిగిన విధానాన్ని, తల్లిదండ్రులతో ఉన్న స్మృతులను శీతల్ తరచూ సాషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. శీతల్ తన భర్త కుటుంబంతో ఉన్న ఫోటోలు కూడా ఇన్ స్టా మాధ్యమంలో వైరల్ అయ్యాయి. ఇటీవల రాజ్ నిడిమోరు సోదరి శీతల్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సమంత గురించి పెట్టిన ఒక ఎమోషనల్ పోస్ట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. తన వదిన సమంతకున్న సున్నితమైన మనసును, మానవత్వాన్ని కొనియాడుతూ శీతల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.
తనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు హీరోయిన్ సమంత ఎంతగానో సపర్యలు చేశారని శీతల్ ఆ పోస్ట్‌లో గుర్తు చేసుకున్నారు. తాను కనీసం మంచం నుంచి అయినా దిగలేని అనారోగ్యంతో ఉన్నప్పుడు సపర్యలు చేయడమే కాకుండా.. రాత్రంతా నిదురపోకుండా తనతో ఉండి ఉదయమే మళ్లీ షూటింగుకు కూడా అటెండయ్యిందని తెలిపారు. తాను సెట్స్ కి వెళ్లగా అక్కడ కూడా తన ఆరోగ్యం ఎలా ఉందో నవ్వుతూ అరా తీసిందని తెలిపింది. తెరపై కనిపించే ఆ నవ్వు వెనక ఎంతో దయార్ధ్రహృదయం ఉందనే విషయం ఎవరికీ తెలీదని కూడా రాజ్ సోదరి వ్యాఖ్యానించారు. ఈ పోస్ట్‌తో సమంత, రాజ్ నిడిమోరుల బంధం ఎంత బలమైనదో నెటిజన్లకు మరోసారి అర్థమైంది.