నిర్మాతపై రాధిక సంచలన వ్యాఖ్యలు

'రక్త చరిత్ర' సినిమాతో నార్త్‌, సౌత్‌ అనే తేడా లేకుండా అన్ని భాషల్లోనూ మంచి గుర్తింపు దక్కించుకున్న హీరోయిన్‌ రాధిక ఆప్టే.;

Update: 2025-08-08 11:43 GMT

'రక్త చరిత్ర' సినిమాతో నార్త్‌, సౌత్‌ అనే తేడా లేకుండా అన్ని భాషల్లోనూ మంచి గుర్తింపు దక్కించుకున్న హీరోయిన్‌ రాధిక ఆప్టే. ఆ సినిమా తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించింది. ముఖ్యంగా బాలకృష్ణతో ఈమె నటించిన లెజెండ్‌, లయన్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింతగా చేరువ అయింది. రాధిక ఆప్టే ఎప్పటికప్పుడు ఫైర్ బ్రాండ్‌ అనిపించుకుంటూ వస్తుంది. ఈమె పోషించే పాత్రలు, మాట్లాడే మాటలు ఇలా ప్రతి ఒక్కటీ రాధిక ఆప్టేను వార్తల్లో నిలుపుతూ ఉన్న విషయం తెల్సిందే. కేవలం సినిమాలు అని కాకుండా బుల్లి తెరపై, ఓటీటీ స్క్రీన్‌లోనూ రాధిక ఆప్టే మెప్పించింది. కోలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తో కలిసి 'కబాలి' సినిమాను ఈమె చేసిన విషయం తెల్సిందే. ఇటీవల పూర్తిగా బాలీవుడ్‌కి పరిమితం అయింది. హాలీవుడ్‌లోనూ ఈమె సినిమాలు చేసింది.

రాధిక ఆప్టే వ్యాఖ్యలు వివాదాస్పదం

ఆ మధ్య సౌత్‌ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేసిన రాధిక ఆప్టే వార్తల్లో నిలిచింది. సౌత్‌ ఇండస్ట్రీకి చెందిన ఒక హీరో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, ఆయన వయసు చాలా పెద్ద అయినా కూడా చిల్లరగా మాట్లాడేవాడు అన్నట్లుగా రాధిక ఆప్టే చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఆ తర్వాత రాధిక ఆప్టే ఆ వ్యాఖ్యలకు వివరణ ఇచ్చింది. తాను ఏ హీరోను ఉద్దేశించి అనలేదని, కొందరి పేర్లను కావాలని ఇందులోకి తీసుకు వస్తున్నారు అంటూ ఆమె చెప్పుకొచ్చింది. తన వ్యాఖ్యలను వక్రీకరించి, అర్థం మార్చి చాలా మంది మీడియాలో కథనాలు అల్లారు అంటూ రాధిక ఆప్టే ఆ వివాదాన్ని సున్నితంగా కొట్టి పారేసేందుకు ప్రయత్నాలు చేసింది.

బేబీ బంప్‌ కనిపించకుండా..!

ఇప్పుడు రాధిక ఆప్టే మరో వివాదాస్పద వ్యాఖ్య చేసింది. గర్భంతో ఉన్నప్పుడు ఒక సినిమా షూటింగ్‌ సమయంలో తాను ఎదుర్కొన్న సమస్యలను గురించి వివరించింది. తాను గర్భవతిని కావడం ఆ సినిమా నిర్మాతకు ఇష్టం లేదు. ఆయన చాలా అసహనం వ్యక్తం చేశాడు. షూటింగ్‌ సమయంలో ఆయన తన అసహనంను నాపై పదే పదే చూపించే వారు. గర్భవతిని అని నేను ప్రకటించిన తర్వాత ఒక సినిమా షూటింగ్‌కు వెళ్లిన సమయంలో ఆ సినిమా దర్శకుడు, నిర్మాత నా బేబీ బంప్ కనిపించకుండా బిగుతు డ్రెస్‌లు వేయించారు. షూటింగ్‌ సగంలో ఉన్నప్పుడు నా ప్రెగ్నెన్సీ విషయాన్ని ప్రకటించడంతో వారు నాపై పలు సార్లు అసహనం వ్యక్తం చేసినట్లుగా మాట్లాడారు అంటూ రాధిక ఆప్టే బాలీవుడ్‌ నిర్మాతలపై విమర్శలు చేసింది.

ఆ బాలీవుడ్‌ నిర్మాత ఎవరు?

గతంలోనూ ఇలా రాధిక ఆప్టే విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే గర్భవతిగా ఉన్న సమయంలో బేబీ బంప్‌ను కనిపించకుండా దాచే ప్రయత్నం చేశారు అంటూ రాధిక ఆప్టే చెప్పడంతో చర్చనీయాంశం అయింది. ఇండస్ట్రీలో ఇలా కూడా చూస్తారా అని చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 1985 లో జన్మించిన రాధిక ఆప్టే చిన్న వయసులోనే ఇండస్ట్రీలో అడుగు పెట్టేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. 2005లో ఆమె నటించిన వాహ్! లైఫ్ హో తో ఐసి సినిమా విడుదలైంది. అప్పటి నుంచి ఆమెకు వరుసగా ఆఫర్లు వచ్చాయి. మెల్ల మెల్లగా ఇండస్ట్రీలో ఆమె స్టార్‌డం దక్కించుకుంది. సౌత్‌ ఇండియా నుంచి వచ్చిన ఆఫర్లను కాదు అనకుండా సినిమాలు చేయడం ద్వారా మరింతగా ఆమె పాపులారిటీని సొంతం చేసుకుంది. సోషల్‌ మీడియాలోనూ రాధిక ఆప్టేకు మంచి ఫాలోయింగ్‌ ఉంది. అందుకే ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి, ఆ నిర్మాత ఎవరా అని అంతా కూడా చర్చించుకుంటున్నారు.

Tags:    

Similar News