రజనీకాంత్ ని అనుకరించి చేతులు కాల్చుకున్న మాధవన్!
పరిశ్రమలో ఇతరులను గుడ్డిగా అనుకరించడం వల్ల వచ్చే నష్టాలను మాధవన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.
మాధవన్ అలియాస్ మ్యాడీ ప్రస్తుతం పోషిస్తోన్న పాత్రలు చూస్తుంటే? ఇతడు ఒకప్పటి లవర్ బోయేనా? అన్న సందేహం రావడం సహజం. ఒకప్పుడు లవర్ బోయ్ గా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన మ్యాడీ ఇప్పుడు వయసుకు తగ్గ పాత్రలు పోషిస్తూ భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ప్రత్యేక నటుడిగా హైలైట్ అవుతున్నారు.
తాజాగా మాధవన్ సినీ ప్రస్థానంలోని ఓ ఆసక్తికర సంఘటన రివీల్ చేసారు. కెరీర్ తొలినాళ్లలో ఒక చిత్ర విజయం కోసం తాను తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల ఎదురైన పరాజయం తన ఆలోచనా విధానాన్ని ఎలా మార్చాయో వివరించారు. పరిశ్రమలో ఇతరులను గుడ్డిగా అనుకరించడం వల్ల వచ్చే నష్టాలను మాధవన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.
మాధవన్ కెరీర్ ప్రారంభంలో ఒక సినిమా షూటింగ్ సమయంలో ఆ చిత్ర దర్శకుడు .. కొందరు పంపిణీదారులు ఆయనకు ఓ సలహా ఇచ్చారుట. బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా భారీ విజయం సాధించాలంటే అప్పటికే సూపర్ స్టార్‌గా వెలుగుతున్న రజనీకాంత్ శైలిని, ఆయన బాడీ లాంగ్వేజ్‌ను అనుకరించాలని ఒత్తిడి తెచ్చారట. రజనీకాంత్ మేనరిజమ్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయని.. కాబట్టి ఆ తరహాలోనే నటిస్తే మాధవన్ కెరీర్‌కు ప్లస్ అవుతుందని నమ్మబలికారట.
ఆ సలహాను నమ్మి మాధవన్ సహజసిద్ధమైన నటనను పక్కనబెట్టి రజనీకాంత్ మార్కు స్టైల్‌ను అనుకరిస్తూ ఆ చిత్రంలో నటించారు. అయితే ఆ సినిమా రిలీజ్ అనంతరం బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. ప్రేక్షకులు మాధవన్‌ను ఆ పాత్రలో అస్సలు అంగీకరించలేకపోయారు. రజనీకాంత్ మేనరిజమ్స్ కేవలం ఆయనకు మాత్రమే సెట్ అవుతాయని.. వేరొకరు చేస్తే అది హాస్యాస్పదంగా మారుతుందని ఈ పరాజయం ద్వారా గ్రహించినట్లు గుర్తు చేసుకున్నారు. దీంతో జీవితంలో గట్టి నిర్ణయం తీసుకున్నారు. హిందీలో `డేటా కా టట్టూ` గా మారకూడదని గట్టిగా నిశ్చయించుకున్నారు.
ఈ పదానికి అర్థం ఏమిటంటే కేవలం అంకెలు, బాక్స్ ఆఫీస్ లెక్కలు, లేదా ఎవరో చెప్పిన ఫార్ములాలను గుడ్డిగా నమ్మి పని చేసే నిర్ణయాత్మక యంత్రం గా మారకపోవడం. పరిశ్రమలో వాణిజ్య సమీకరణాల కోసం ఒరిజినాలిటీని చంపు కోకూడదనేది దీని ముఖ్య ఉద్దేశం. ఆ పరాజయం తర్వాత మాధవన్ ఇంకెప్పుడు ఇతరుల శైలిని అనుకరించే ప్రయత్నం చేయలేదన్నారు. `చెలి`, `రంగ్ దే బసంతి`, `తను వెడ్స్ మను`, `రాకెట్రీ`వంటి చిత్రాల వరకు కేవలం తన సొంత నటనపైనే నమ్మకం ఉంచారు. ఒక నటుడికి థియేటర్లలో గుర్తింపు రావాలంటే వారిలో ప్రత్యేకత ఉండాలే తప్ప మరొక స్టార్ ఇమేజ్‌ను కాపీ కొడితే సక్సెస్ రాదని నిరూపించారు.
సినిమా రంగంలోకి వచ్చే కొత్త తరం నటులకు కూడా మాధవన్ కథ గుణ పాఠం లాంటిది. ఇండస్ట్రీలో ఒకరి విజయాన్ని చూసి అదే ఫార్ములాను అందరూ ఫాలో అవ్వడం సాధారణం. కానీ అది ఎల్లప్పుడూ వర్కవుట్ కాదు. మనకంటూ ప్రత్యేక శైలిని సృష్టించు కున్నప్పుడే పరిశ్రమలో సుదీర్ఘ కాలం మనుగడ సాగించగలం. బాక్స్ ఆఫీస్ నంబర్ల కోసం వ్యక్తిత్వాన్ని మార్చుకో కూడదని మాధవన్ కెరీర్ ప్రయాణం స్పష్టం చేస్తోంది.