నటీనటుల ఫేసియల్ ఫీచర్స్ దొంగిలిస్తే నేరమా? జేమ్స్ కామెరాన్‌పై నటి సంచలన దావా!
హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్ - డిస్నీ సంస్థ ప్రస్తుతం ఒక అనూహ్యమైన చట్టపరమైన చిక్కుల్లో చిక్కుకున్నాయి.;
హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్ - డిస్నీ సంస్థ ప్రస్తుతం ఒక అనూహ్యమైన చట్టపరమైన చిక్కుల్లో చిక్కుకున్నాయి.`అవతార్` వంటి భారీ ఫ్రాంఛైజీలో అత్యంత కీలకమైన `నేతిరి` పాత్ర రూపకల్పన కోసం తన ముఖ పోలికల(ఫేసియల్ ఫీచర్స్)ను దొంగిలించారని నటి క్వోరియంకా కిల్చర్ కాలిఫోర్నియా కోర్టులో దావా వేశారు. 2005లో తాను నటించిన `ది న్యూ వరల్డ్` చిత్రంలోని ఫోటోల నుండి తన బయోమెట్రిక్ ఫీచర్లను సేకరించి.. వాటిని నేతిరి పాత్రకు పునాదిగా వాడారని ఆరోపిస్తున్నారు. ఈ కేసు ఇప్పుడు అంతర్జాతీయ సినిమా పరిశ్రమలో `డిజిటల్ గుర్తింపు చౌర్యం`పై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
ఈ వివాదంలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. జేమ్స్ కామెరాన్ స్వయంగా కిల్చర్ ముఖమే తనకు ప్రేరణ అని అంగీకరించడం. 2010లో ఒక కార్యక్రమంలో ఈ నటికి నేతిరి స్కెచ్‌ను బహుమతిగా ఇస్తూ.. ఆమె అందమే తన తొలి ప్రేరణ అని ఆయన స్వయంగా రాసిచ్చారు. అయితే ఇటీవల `అవతార్: ఫైర్ అండ్ యాష్` ప్రచార చిత్రాల సమయంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో.. కిల్చర్ ముఖం.. ఆమె ఎల్.ఏ టైమ్స్ కవర్ ఫోటోయే నేతిరి పాత్రకు అసలైన మూలమని ఆయన పేర్కొనడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూర్చింది. తన అనుమతి లేకుండా తన ముఖాన్ని ఒక వ్యాపార ప్రక్రియలో భాగంగా వాడుకోవడం తీవ్రమైన నమ్మకద్రోహమని కిల్చర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం మోషన్ క్యాప్చర్ - సీజీఐ సాంకేతికత అద్భుతాలను సృష్టిస్తున్నా.. నటీనటుల అనుమతి లేకుండా వారి ముఖ పోలికలను వాడటం అనేది భవిష్యత్తులో తీవ్రమైన వృత్తిపరమైన చిక్కులకు దారితీస్తుంది. ఒక నటుడికి వారి ముఖం, కంఠస్వరం, హావభావాలే అసలైన ఆస్తి. సాంకేతికతను వాడుకుని వారి ప్రమేయం లేకుండానే డిజిటల్ పాత్రలను సృష్టించడం.. వారి కంఠాన్ని హావభావాల్ని ఉపయోగించుకోవడం వల్ల భవిష్యత్తులో అసలైన నటీనటుల అవసరం లేకుండానే సినిమాలు తీసే ప్రమాదం ఉంది. ఇది నటీనటుల ఉపాధిని దెబ్బతీయడమే కాకుండా.. వారి `డిజిటల్ గుర్తింపు`ను దొంగిలించడం కిందకే వస్తుంది.
తాజా వివాదం పరిశీలిస్తే.. నైతిక -ఆర్థిక కోణాలను కూడా ఈ ఘటన ఎత్తి చూపుతోంది. స్వదేశీయుల పోరాటాలపై సానుభూతి చూపే సినిమా అవతార్ అని చెప్పుకుంటూ.. తెర వెనుక ఒక స్వదేశీ యువతి బయోమెట్రిక్ గుర్తింపును దోచుకోవడం విరుద్ధమైన వైఖరి అని కిల్చర్ తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. బిలియన్ డాలర్ల లాభాలు గడిస్తున్న ఈ ఫ్రాంచైజీలో తన ముఖాన్ని వాడుకున్నందుకు గుర్తింపు గానీ.. పారితోషికం గానీ ఇవ్వకపోవడం శ్రమ దోపిడీ అని లాయర్లు పేర్కొంటున్నారు. అందుకే ఈ సినిమా లాభాల్లో వాటాతో పాటు భారీ నష్టపరిహారాన్ని సదరు నటి కోరుతున్నారు.
జేమ్స్ కామెరాన్ వంటి దిగ్గజాలపై వస్తున్న ఇటువంటి ఆరోపణలు హాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు `డిజిటల్ ఎథిక్స్` పై చర్చ జరగాల్సిన సమయం వచ్చిందని సూచిస్తున్నాయి. సాంకేతికత అనేది సృజనాత్మకతను పెంచడానికి ఒక సాధనంగా ఉండాలి తప్ప... కళాకారుల ఉనికిని కనుమరుగు చేయడానికి మార్గం కాకూడదు. డిజిటల్ యుగంలో `డిజిటల్ ట్విన్` లేదా పోలికల పరిరక్షణ కోసం కఠినమైన అంతర్జాతీయ చట్టాలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే భవిష్యత్తులో కళాకారుల ఆత్మగౌరవానికి.. వారి మేధో సంపత్తికి సరైన రక్షణ లభిస్తుంది. అయితే ఇటీవలి కాలంలో చిరంజీవి, నాగార్జున సహా పలువురు స్టార్లు తమ డిజిటల్ గుర్తింపును కాపాడుకునేందుకు కోర్టుల్ని ఆశ్రయించగా, సానుకూల తీర్పులు వెలువడిన సంగతి తెలిసిందే. సదరు స్టార్లకు సంబంధించిన ఏ ఐడెంటిటీని ఇతరులు ఉపయోగించుకోవడానికి లేదు. ఉపయోగించుకుంటే కోర్టు చిక్కుల్ని ఎదుర్కోవడమే గాక భారీగా పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.