పూరీ- సేతుపతి ప్రాజెక్ట్.. సైలెన్స్ కు కారణమేంటి?
డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం.. టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.;
డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం.. టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఆ సినిమాపై మొదటి నుంచే ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా ఆ ప్రాజెక్ట్ పై నెలకొన్న సైలెన్స్ ఇప్పుడు చర్చకు దారితీస్తోంది.
సినిమాలో విజయ్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా, టబు, దునియా విజయ్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కొన్ని రోజుల క్రితం విజయ్ సేతుపతి పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ను అధికారికంగా ప్రకటించింది. అప్పటివరకు బెగ్గర్ అనే టైటిల్ ప్రచారంలో ఉన్నప్పటికీ, చివరికి స్లమ్ డాగ్.. 33 టెంపుల్ రోడ్ అనే పేరు ఖరారు చేసింది.
ఫస్ట్ లుక్ పోస్టర్ లో విజయ్ సేతుపతి పూర్తిగా భిన్నమైన గెటప్ లో కనిపించారు. బిచ్చగాడి వేషధారణలో, కళ్ళజోడు ధరించి, చేతిలో రక్తంతో తడిసిన కత్తి పట్టుకుని ఉన్న ఆయన లుక్ ఆకట్టుకుంది. బ్యాక్ గ్రౌండ్ లో చెల్లాచెదురుగా ఉన్న డబ్బు కట్టలు, పోస్టర్ కు మరింత ఇంటెన్స్ ఫీలింగ్ తీసుకొచ్చాయి. 'మురికివాడల నుంచి ఎవరూ ఆపలేని తుఫాను వస్తుంది' అనే క్యాప్షన్ కూడా షేర్ చేయడంతో సినిమాలో హీరో పాత్ర ఎంత రఫ్ గా ఉంటుందో అర్థమవుతోంది.
అయితే సినిమాను పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై పూరీ జగన్నాథ్, చార్మి కౌర్ కలిసి నిర్మిస్తున్నారు. జేబీ మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై జేబీ నారాయణరావు కూడా సహనిర్మాతగా ఉన్నారు. యానిమల్ ఫేమ్ మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఆ సినిమా విడుదల కానుంది.
ఇప్పటికే మూవీ షూటింగ్ గత ఏడాది జూలైలో ప్రారంభమై కేవలం ఐదు నెలల్లో పూర్తి అయినట్లు సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగిసినట్టు టాక్ వినిపిస్తోంది. అయితే అంత స్పీడ్ గా పనులు పూర్తయినా, చిత్ర యూనిట్ నుంచి వరుస అప్డేట్స్ లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ముఖ్యంగా విడుదల తేదీపై ఎలాంటి క్లారిటీ లేకపోవడం, ప్రమోషన్స్ ప్రారంభించకపోవడం అభిమానుల్లో సందేహాలు రేకెత్తిస్తోంది.
ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఎందుకు మౌనం పాటిస్తుందనే దానిపై ఇండస్ట్రీలో వివిధ రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొందరి అభిప్రాయం ప్రకారం... తమిళనాడు ఎన్నికల తర్వాత ప్రమోషన్స్ ప్రారంభించే ఆలోచనలో ఉన్నారట. మరికొందరు మాత్రం డిస్ట్రిబ్యూషన్, బిజినెస్ డీల్స్ పూర్తయ్యాకే ముందుకు రావాలని ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నారు. ఏదేమైనా చిత్ర యూనిట్ త్వరలో స్పష్టత ఇస్తుందా? లేక మరికొంత కాలం సైలెన్స్ కొనసాగుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. మరేం జరుగుతుందో అంతా వేచి చూడాలి.