ప్రియాంక యాక్టింగ్.. జక్కన్న ఏమన్నారో చూశారా?
హాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా లేటెస్ట్ గా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ది బ్లఫ్ మూవీ మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.;
హాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా లేటెస్ట్ గా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ది బ్లఫ్ మూవీ మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదలైన ఆ సినిమా ప్రేక్షకులను అలరిస్తుండగా.. ప్రియాంక యాక్టింగ్ పై సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి రెస్పాండ్ అయ్యారు.
సినిమాలో ప్రియాంక ఎమోషన్స్, యాక్షన్ ఈక్వల్ గా చూపిస్తూ ఆకట్టుకుందని రాజమౌళి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. వెంటవెంటనే ఎక్స్ప్రెషన్స్ మార్చాల్సిన సీన్స్ లో ఆమె యాక్టింగ్ ఎంతో నేచురల్ గా ఉందని అన్నారు. అలాంటి పాత్రలను నమ్మకంగా చేసే హీరోయిన్స్ లో ప్రియాంక ముందుంటారని ప్రశంసలు కురిపించారు. ది బ్లఫ్ మూవీ ఆమె టాలెంట్ కు బెస్ట్ ఎగ్జాంపుల్ అంటూ కొనియాడారు.
ముఖ్యంగా బ్లఫ్ మూవీలో యాక్షన్ సీక్వెన్స్ లు చాలా బాగున్నాయని, సినిమాను పూర్తిగా ఆస్వాదించానని కూడా వెల్లడించారు. అయితే ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో ప్రియాంక యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. జక్కన్న దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న అడ్వెంచర్ డ్రామా వారణాసిలో ప్రియాంక కీలక పాత్ర పోషిస్తున్నారు.
సినిమాలో మందాకిని అనే పవర్ ఫుల్ రోల్ లో కనిపించనుండగా.. కొన్ని రోజుల క్రితం ఆమె ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ అందుకుంది. ప్రస్తుతం ఆ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాత కేఎల్ నారాయణ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. కథను ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ అందించారు.
వారణాసి మూవీకి ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎం ఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్, భారీ యాక్షన్ సీన్స్, ఇంటర్నేషనల్ రేంజ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో సినిమాతో ఐమ్యాక్స్ అనుభూతిని ఇచ్చేలా రూపొందిస్తున్నారు మేకర్స్. ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో సినిమాను 2027 ఏప్రిల్ 7న విడుదల చేయాలని ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు.
అయితే ఇప్పటికే సినిమాపై ఆడియన్స్ తో పాటు అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ది బ్లఫ్ మూవీతో అందరినీ ఆకట్టుకున్న.. తన యాక్టింగ్ టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్న ప్రియాంకకు రాజమౌళి వంటి దిగ్గజ దర్శకుడి ప్రశంసలు రావడం విశేషం. మరి ఆమె వారణాసిలో తన యాక్టింగ్ తో ఎంతలా మెప్పిస్తారో తెలియాలంటే ఇంకా కొన్ని నెలలు వెయిట్ చేయాల్సిందే.