ప్రశాంత్ వర్మ అసలు ఏం చేస్తున్నాడు?

జై హనుమాన్‌ విషయంలో దర్శకుడు ప్రశాంత్‌ వర్మ నుంచి క్లారిటీ రాకపోవడంతో అసలేం జరుగుతుందో అర్థం కావడం లేదని ఇండస్ట్రీ వర్గాల వారు సైతం కొందరు చర్చించుకోవడం కనిపించింది.

Update: 2026-07-11 07:21 GMT

ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు నాలుగు. ఆ నాలుగు సినిమాల్లో హను-మాన్‌ సినిమా బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. పెద్ద సినిమాలు పోటీగా ఉన్నప్పటికీ ఆ సినిమా సాధించిన విజయం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ సినిమాతో దర్శకుడిగా ప్రశాంత్‌ వర్మ ఒక్కసారిగా పాన్ ఇండియా రేంజ్‌లో టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారి పోయాడు. ఏకంగా బాలీవుడ్‌ స్టార్స్ సైతం ఈయన దర్శకత్వంలో నటించేందుకు ఆసక్తి కనబర్చారు. అంతే కాకుండా ప్రభాస్ వంటి బిగ్గెస్ట్‌ సూపర్ స్టార్‌ సైతం ఈయనతో వర్క్‌ చేయడం కోసం ఆసక్తి కనబర్చిన విషయం తెల్సిందే. అయితే ప్రశాంత్‌ వర్మ మాత్రం సరైన ప్లానింగ్‌ లేక పోవడం వల్లనో లేదా మరేదైనా కారణమో కానీ ఇప్పటి వరకు తన కొత్త సినిమాను విడుదల చేయలేక పోయాడు. ప్రశాంత్‌ వర్మ అసలేం చేస్తున్నాడు అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు.

ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో రిషబ్‌ శెట్టి 'జై హనుమాన్‌' మూవీ...

హనుమాన్‌ సినిమా విడుదలైన సమయంలోనే సీక్వెల్‌ ను రూపొందిస్తాను అంటూ దర్శకుడు ప్రశాంత్‌ వర్మ అధికారికంగా ప్రకటించాడు. అన్నట్లుగానే 'జై హనుమాన్‌' అనే టైటిల్‌తో సీక్వెల్‌ను ప్రారంభించాడు. కన్నడ స్టార్‌ రిషబ్‌ శెట్టి ప్రధాన పాత్రలో సీక్వెల్‌ షూటింగ్‌ ప్రారంభం అయింది. అన్ని అనుకున్నట్లుగా జరిగి ఉంటే సినిమాను గత ఏడాదిలోనే విడుదల చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు సినిమా విడుదలపై స్పష్టత లేదు. రిషబ్‌ శెట్టి ఈ సినిమాలో ఆంజనేయుడి పాత్రలో కనిపించబోతున్నాడు. మొదటి పార్ట్‌లో కనిపించిన తేజ సజ్జా ఈ సినిమాలో చిన్న పాత్రలో కనిపించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. సినిమా ప్రకటించినప్పటి నుంచి అంచనాలు పెరుగుతూ వచ్చాయి. తీరా సినిమా విడుదల కాకపోవడంతో ప్రేక్షకులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంత్‌ వర్మపై నమ్మకంతో సినిమా కోసం ఎదురు చూసిన వారికి నిరాశే మిగిలింది.

హనుమాన్‌ కి సీక్వెల్‌గా జై హనుమాన్‌..

జై హనుమాన్‌ విషయంలో దర్శకుడు ప్రశాంత్‌ వర్మ నుంచి క్లారిటీ రాకపోవడంతో అసలేం జరుగుతుందో అర్థం కావడం లేదని ఇండస్ట్రీ వర్గాల వారు సైతం కొందరు చర్చించుకోవడం కనిపించింది. ప్రశాంత్‌ వర్మ ఒకే సారి మూడు నాలుగు ప్రాజెక్ట్‌లపై వర్క్‌ చేస్తున్న కారణంగా ఇబ్బందులు పడుతున్నాడు. ఇప్పటికే ప్రశాంత్ వర్మ చుట్టూ వివాదాలు చుట్టుముట్టిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో జై హనుమాన్‌ ఆలస్యం అవుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గత ఏడాది విడుదల అవుతుందని భావించిన జై హనుమాన్‌ ఈ ఏడాదిలో అయినా విడుదల అయ్యేనా అని అనుమానం వ్యక్తం చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. రిషబ్‌ శెట్టి ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఎంత కష్టపడ్డా సినిమా విషయంలో క్లారిటీ లేకపోవడంతో ప్రేక్షకుల్లో సినిమాపై బజ్‌ తగ్గుతుంది అనేది విశ్లేషకుల మాట.

ప్రభాస్ హీరోగా ప్రశాంత్‌ వర్మ మూవీ...

ఒకవైపు దర్శకుడిగా సినిమాలు చేస్తూనే మరో వైపు ప్రశాంత్‌ వర్మ తన యూనివర్శ్‌లో సినిమాలను నిర్మించడం, తన కథలతో ఇతర దర్శకులతో సినిమాలు చేయించడం చేస్తున్నాడు. ఆ కారనం వల్ల జై హనుమాన్‌ ఆలస్యం అవుతూ ఉండవచ్చు అనేది కొందరి మాట. ప్రశాంత్‌ వర్మ స్క్రిప్ట్‌ అందించిన మహాకాళి అనే మూవీ మేకింగ్‌ దశలో ఉంది. మొదటి లేడీ సూపర్‌ హీరో మూవీ అంటూ ప్రశాంత్‌ వర్మ ప్రచారం చేశాడు. ఆ సినిమా మేకింగ్‌ ఎంత వరకు వచ్చిందో క్లారిటీ లేదు. ఇక ప్రశాంత్‌ వర్మ మొదలు పెట్టిన మరో మూవీ అధీర విషయంలోనూ స్పష్టత లేదు. ప్రభాస్‌తో ఒక సినిమాను చేసేందుకు కమిట్ అయ్యాడు. అందుకోసం కథ రెడీ అయిందా అనేది తెలియదు. మొత్తానికి ప్రశాంత్‌ వర్మ చాలా ప్రాజెక్ట్‌లు చేతిలో పెట్టుకున్నాడు కానీ ఏ ఒక్కటి పూర్తి చేయడం లేదు. దాంతో అసలు ప్రశాంత్‌ వర్మ ఏం చేస్తున్నాడంటూ సోషల్‌ మీడియాలో కొందరు ప్రశ్నిస్తున్నారు.

Tags:    

Similar News