'రాజాసాబ్‌' ఓటీటీ డిటైల్స్... ఇది మహా దారుణం

ప్రభాస్, మారుతి కాంబోలో సంక్రాంతి కానుకగా వచ్చిన 'రాజాసాబ్‌' తీవ్రంగా నిరాశ పరిచింది.;

Update: 2026-01-24 10:00 GMT

ప్రభాస్, మారుతి కాంబోలో సంక్రాంతి కానుకగా వచ్చిన 'రాజాసాబ్‌' తీవ్రంగా నిరాశ పరిచింది. బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుని, పాన్‌ ఇండియా రేంజ్‌లో రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందని ఆశించిన అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో నిర్మాణం జరిగిన ఈ సినిమా నిర్మాతకు తీవ్ర నష్టాలను మిగిల్చినట్లుగా తెలుస్తోంది. థియేట్రికల్‌ బిజినెస్‌ తక్కువ ఉన్నా ఓటీటీ ద్వారా భారీ మొత్తం వస్తుందనే నమ్మకంతో నిర్మాత మోతాదును మించి ఖర్చు చేయడం జరిగింది. ఇప్పుడు ఆ మొత్తంలో కనీసం సగం కూడా వెనక్కి వచ్చినట్లు కనిపించడం లేదని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ ఇప్పటికే నిర్మాతను ఆదుకునేందుకు తనవంతు సాయం చేస్తానంటూ హామీ ఇచ్చాడని తెలుస్తోంది.

రాజాసాబ్‌ ఓటీటీ డిటైల్స్‌...

ఈ సమయంలో రాజాసాబ్‌ సినిమా ఓటీటీ బిజినెస్ గురించి షాకింగ్‌ వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ వంటి పాన్‌ ఇండియా స్టార్‌ నటించిన ఈ సినిమాను జియో హాట్‌ స్టార్‌ వారు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. కేవలం రూ.80 కోట్లు చెల్లించేందుకు సదరు ఓటీటీ వారు ముందుకు వచ్చారని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో ఓటీటీ బిజినెస్‌ దారుణంగా పడి పోయింది. గత రెండు మూడు నెలలుగా ఓటీటీ మార్కెట్‌ డౌన్‌ అంటూ వస్తున్న వార్తలు నిజమే అని రాజాసాబ్‌ ఓటీటీ బిజినెస్‌ లెక్కలు చూస్తే అర్థం అవుతుంది. ప్రభాస్ గత చిత్రాలు కల్కి, సలార్‌ తో పోల్చితే సగంలో సగం కూడా రాజాసాబ్‌ ఓటీటీ బిజినెస్‌ చేయలేక పోయింది. ఇది కేవలం రాజాసాబ్‌ యొక్క పరిస్థితి మాత్రమే కాకుండా మొత్తం అన్ని సినిమాలు ఇదే పరిస్థితిని ఓటీటీ పరంగా ఎదుర్కొంటున్నాయి అనేది ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

ప్రభాస్ ఇతర సినిమాల ఓటీటీ బిజినెస్‌..

ప్రభాస్ వంటి పాన్‌ ఇండియా స్టార్‌ సినిమా కనుక అన్ని భాషల వారు చూసేందుకు ఓటీటీ ని ఆశ్రయిస్తారు. అయినా కూడా కేవలం రూ.80 కోట్లు ఏంటి మహా దారుణం కాకుంటే అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సినిమా థియేట్రికల్‌ రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత జియో హాట్‌ స్టార్‌లో అన్ని భాషల్లోనూ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే థియేట్రికల్‌ రన్‌ క్లోజ్ అయినట్లే అని తెలుస్తోంది. చిరంజీవి మన శంకర వరప్రసాద్‌ గారు, ఇతర సంక్రాంతి సినిమాల ముందు రాజాసాబ్‌ సినిమా తేలిపోయిందని రివ్యూలు వచ్చాయి. అయినా కూడా ప్రభాస్ కి ఉన్న క్రేజ్‌ తో సినిమా దాదాపుగా రూ.300 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ లేదా అమెజాన్‌ వంటి పెద్ద ఓటీటీలు తీసుకుని ఉంటే మరింత భారీ మొత్తాన్ని నిర్మాత అందుకునే అవకాశం ఉండేది కదా అని కొందరు మాట్లాడుకుంటున్నారు.

ఓటీటీ మార్కెట్‌ పై విశ్లేషణ

తెలుగు సినిమాలను మాత్రమే కాకుండా, ఇతర భాషల సినిమాలను కొనుగోలు చేసే విషయంలో ఓటీటీలు ఒకటికి రెండు మూడు సార్లు ఆలోచించి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. హీరో క్రేజ్‌, స్టార్‌డంను నమ్ముకుని ఓటీటీలు ఇంతకు ముందు వందల కోట్ల పెట్టుబడిని సినిమాలపై పెట్టేందుకు ముందుకు వచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది. సినిమాలకు ఓటీటీలు పెద్ద మొత్తంలో ఇచ్చేందుకు నిరాకరిస్తున్న నేపథ్యంలో బడ్జెట్‌ తగ్గుతుంది, అంతే కాకుండా హీరోల పారితోషికాలు తగ్గుతాయి. ఇక పై నిర్మాతలు ఎక్కువగా థియేట్రికల్‌ రెవిన్యూ పై ఆధారపడాల్సి ఉంటుంది. ఓటీటీ మార్కెట్‌ మరింతగా తగ్గితే సినిమాల యొక్క మేకింగ్‌ కాస్ట్‌ మరింతగా తగ్గిస్తారని విశ్లేషకులు చెబుతున్నారు. మళ్లీ ఓటీటీ మార్కెట్‌ పుంజుకుంటుందా అంటే కచ్చితంగా చెప్పలేమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News