'ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్' ఎందుకు ఆల‌స్య‌మైందంటే?

సాంకేతిక కారణాలు , నటీనటుల డేట్స్ సర్దుబాటు కూడా కొంత జాప్యానికి కారణమయ్యాయని హరీష్ వివరించారు.;

Update: 2026-03-16 04:33 GMT

హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగిన`ఉస్తాద్ భగత్ సింగ్` ప్రీ-రిలీజ్ వేడుకలో దర్శకుడు హరీష్ శంకర్ ప్రసంగం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఎందుకు ఆలస్యమైందనే విషయంలో హరీష్ శంకర్ ఎంతో స్పష్టత ఇచ్చారు. ఈ సినిమా కేవలం ఒక కమర్షియల్ ప్రాజెక్ట్ మాత్రమే కాదని పవన్ కళ్యాణ్ గారి రాజకీయ బాధ్యతలు .. సినిమా నాణ్యత కోసం చేసిన‌ ఒక గొప్ప ప్రయాణమని ఆయన వివరించారు.

సినిమా ఆలస్యానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారి రాజకీయ నిబద్ధత అని హరీష్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్న పవన్ కళ్యాణ్ ప్రజల ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యత ఇచ్చారు. పగలు 12 గంటల పాటు నిరంతరాయంగా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్నా సినిమా పట్ల ఉన్న గౌరవంతో రాత్రి 2 గంటల వరకు షూటింగ్‌లో పాల్గొనేవారని హరీష్ భావోద్వేగంతో గుర్తు చేసుకున్నారు. ప్రజా సేవ కోసం ఆయన పడుతున్న తపన చూసి తాము కూడా సినిమాను వాయిదా వేయడానికే మొగ్గు చూపామని చెప్పారు.

సినిమా నిర్మాణం ఆలస్యమైనా.. ఆ సమయాన్ని స్క్రిప్ట్‌ను మరింత పవర్‌ఫుల్‌గా మార్చడానికి ఉపయోగించుకున్నట్లు దర్శకుడు తెలిపారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ప్రతి సన్నివేశాన్ని మలిచామని, ముఖ్యంగా `ఎత్తరా కాలర్` వంటి పాటల కోసం నిర్మించిన భారీ సెట్లు సమయం తీసుకున్నా, అవుట్‌పుట్ మాత్రం అద్భుతంగా వచ్చిందని ధీమా వ్యక్తం చేశారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఎంతో ఓపికతో తమకు అండగా నిలిచారని ఆయన కొనియాడారు.

హరీష్ శంకర్ తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. తాను ఒకానొక దశలో `డీప్ క్రైసిస్ లో .. డీప్ లోఫేజ్ లో ఉన్నప్పుడు.. పవన్ కళ్యాణ్ తనను నమ్మి ఈ బాధ్యతను అప్పగించారని చెప్పారు. ఆ నమ్మకమే తనను మళ్ళీ శక్తివంతంగా మార్చిందని ఆ కసితోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించానని తెలిపారు. సినిమా ఆలస్యమవ్వడం ఒక రకంగా మంచికే జరిగిందని పవన్ రాజకీయ విజయం తర్వాత ఇప్పుడు వస్తున్న ఈ సినిమాకు సరైన సమయం అని ఆయన అభిప్రాయపడ్డారు.

సాంకేతిక కారణాలు , నటీనటుల డేట్స్ సర్దుబాటు కూడా కొంత జాప్యానికి కారణమయ్యాయని హరీష్ వివరించారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ .. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్ల కొంత సమయం పట్టిందని, కానీ ఇప్పుడు లభిస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆ నిరీక్షణకు ఫలితం దక్కినట్లు అనిపిస్తోందని అన్నారు. హీరోయిన్లు శ్రీలీల , రాశీ ఖన్నా కూడా పవన్ షెడ్యూల్‌కు అనుగుణంగా ఎంతో సహకరించారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

చివరగా `ఉస్తాద్ భగత్ సింగ్` చిత్రం ఎందుకు లేట్ అవుతుందో అని విమర్శించిన వారికి థియేటర్లో పవర్ స్టార్ మాస్ మానియా చూశాక గట్టి సమాధానం దొరుకుతుందని హ‌రీష్ సవాల్ విసిరారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సరికొత్త చరిత్రను సృష్టిస్తుందని, పవన్ కళ్యాణ్ విశ్వరూపాన్ని అభిమానులు త్వరలోనే వెండితెరపై చూస్తారని చెబుతూ తన ప్రసంగాన్ని ముగించారు. ఉస్తాద్ భ‌గత్ సింగ్ చిత్రం మార్చి 19న థియేట‌ర్ల‌లోకి విడుద‌ల కానుంది.

Tags:    

Similar News