కోకాపేటలో ప్రభాస్ డ్రీమ్ హౌస్.. 300 కోట్ల బడ్జెట్‌తో భారీ మాన్షన్!
పాన్-ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ తన కలల ఇంటిని సాకారం చేసుకునే పనిలో సీరియస్‌గా నిమగ్నమయ్యారు.
పాన్-ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ తన కలల ఇంటిని సాకారం చేసుకునే పనిలో సీరియస్‌గా నిమగ్నమయ్యారు. దాదాపు రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లోని కోకాపేట్ ఓఆర్ఆర్ జంక్షన్ సమీపంలో ఎకరం రూ.75 కోట్ల చొప్పున భారీ ధర వెచ్చించి కొన్ని ఎకరాల భూమిని ఆయన కొనుగోలు చేశారు. ఇప్పుడు అదే స్థలంలో ఒక అత్యంత విలాసవంతమైన భారీ ప్యాలెస్ లాంటి ఇంటి నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు అత్యంత సమీపంలో ఇది ఉంది. ప్రభాస్ వ్యక్తిగత అభిరుచికి అనుగుణంగా అంతర్జాతీయ స్థాయి ఆర్కిటెక్ట్‌లు, ఇంటీరియర్ డిజైనర్ల పర్యవేక్షణలో ఈ మాన్షన్ రూపుదిద్దుకుంటోందని సమాచారం. కేవలం భూమి కొనుగోలుకే వందల కోట్లు ఖర్చు చేయగా.. ఈ ఇంటి నిర్మాణం కోసం కనీసంగా రూ.300 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించారనే గుసగుసలు ఇప్పుడు టాలీవుడ్‌లో వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి సొంత ఇల్లు ఆ ఏరియాకే ల్యాండ్‌మార్క్‌గా విరాజిల్లుతోంది. ముంబైలో అమితాబ్ బచ్చన్ -జల్సా, షారూఖ్ ఖాన్ -మన్నత్ తరహాలోనే చిరంజీవి నివాసం కూడా సందర్శకులకు, టూరిస్టులకు ఒక స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. అదే జూబ్లీహిల్స్ పరిసరాల్లోనే నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా ఒక కొత్త ఇంటిని నిర్మించుకుంటున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం ఇదే ప్రాంతంలో తన సొంత స్థలంలో అత్యంత విలాసవంతమైన గృహాన్ని నిర్మిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. మన స్టార్ హీరోల ఇళ్లన్నీ ఇలా ఒకే లోకాలిటీలో ప్రత్యేక ఆకర్షణలుగా మారుతుండటం గమనార్హం.
ప్రస్తుతం జూబ్లీహిల్స్ నుండి కేవలం 40 నిమిషాల ప్రయాణ దూరంలో ఉన్న కోకాపేటలో ప్రభాస్ తన ఇంటిని నిర్మిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ పూర్తవడానికి దాదాపు ఏడాదిన్నర సమయం పట్టవచ్చని తెలుస్తోంది. అయితే ఈ భారీ ఇంటి నిర్మాణ వార్త బయటకు వచ్చిన వెంటనే ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా సందడి చేయడం మొదలుపెట్టారు. ``ఇదిగో డార్లింగ్.. ఈ ఇల్లు నిర్మాణం పూర్తయిన వెంటనే పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్ అయిపోవాలి`` అంటూ మురిపెంగా కామెంట్లు పెడుతూ తమ హీరోకు అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ఉన్న ప్రభాస్ పెళ్లి ముచ్చట ఎప్పుడు వస్తుందా? అని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు ఈ కొత్త ఇల్లు ఒక గట్టి ఆశను రేకెత్తించింది.
ఇక ప్రభాస్‌కు ఇండస్ట్రీ వ్యవహారాలతో పాటు రాయదుర్గంలో ఒక సొంత అతిథి గృహం కూడా ఉంది. గతంలో ఉన్న కొన్ని భూ వివాదాలను చట్టబద్ధంగా పరిష్కరించుకున్న తర్వాత ప్రభాస్ ఆ స్థలంలో ప్రత్యేక శ్రద్ధతో ఒక సొంత తోట-ఫార్మ్‌హౌస్ తరహాలో అభివృద్ధి చేసుకున్నారు. ప్రస్తుతానికి టాలీవుడ్ అగ్ర హీరోలైన అల్లు అర్జున్, మహేష్ బాబు, రామ్ చరణ్ వంటి వారంతా ఇంచుమించు జూబ్లీహిల్స్, ఫిలింనగర్ పరిసర ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. వీరందరికీ మరీ కూతవేటు దూరంలో కాకపోయినా..ఐటీ కారిడార్‌కు వేగంగా అందుబాటులో ఉండేలా కోకాపేట రేంజ్‌లో ప్రభాస్ తన కొత్త సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం ఇంకా అందుబాటులోకి రావాల్సి ఉంది.