ప్రభాస్ 'ఫౌజీ'.. మళ్లీ ఇదేం ట్విస్ట్?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ఫౌజీకి సంబంధించిన తాజా వార్తలు.. చర్చనీయాంశంగా మారాయి.;
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ఫౌజీకి సంబంధించిన తాజా వార్తలు.. చర్చనీయాంశంగా మారాయి. నిజానికి ఆ సినిమా ప్రకటించినప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా సీతారామంతో క్లాసిక్ ప్రేమ కథను అందించిన హను.. ఈసారి పీరియడ్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతుండటంతో హైప్ మరింత పెరిగింది.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఆ చిత్రం ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం, షూటింగ్ దాదాపు 80 శాతం పూర్తయినట్లు తెలుస్తోంది. ఇంకా మూడు కీలక యాక్షన్ సీన్స్, కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు మిగిలి ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలకు రంగం సిద్ధమవుతోందన్న వార్త ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ నెలాఖరులో తొలి పాట విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
ఫౌజీ చిత్రానికి సంగీతం అందిస్తున్న విశాల్ చంద్రశేఖర్ పై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. సీతారామం మూవీకి గాను ఆయన చేసిన వర్క్ ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. అందుకే ఫౌజీ ఆల్బమ్ కూడా అదే స్థాయిలో ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఫౌజీ కథ 1940ల కాలం నాటి నేపథ్యంలో సాగుతుంది. బ్రిటిష్ పాలన సమయంలో ఆజాద్ హింద్ ఫౌజ్ నేపథ్యంగా ఒక సైనికుడి జీవన ప్రయాణాన్ని చిత్రంలో చూపించబోతున్నారు.
ఇందులో ప్రభాస్ ఓ ధైర్యవంతుడైన సైనికుడిగా కనిపించనుండగా, ఆయన పాత్రలోని ఎమోషన్స్, దేశభక్తి అంశాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చెబుతున్నారు. సినిమాలో హీరోయిన్ గా సోషల్ మీడియా స్టార్ ఇమాన్వి ఇస్మాయిల్ టాలీవుడ్ కు పరిచయం అవుతుండగా, సీనియర్ నటులు మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సుమారు రూ.400 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఇప్పటివరకు వచ్చిన టాక్ ప్రకారం, ఫౌజీ సినిమా ఈ ఏడాది దసరా సీజన్ లేదా చివర్లో విడుదల అవుతుందని భావించారు. కానీ తాజాగా వినిపిస్తున్న వార్తలు మాత్రం మరో ట్విస్ట్ ఇచ్చాయి. షూటింగ్ ఇంకా మిగిలి ఉండటంతో పాటు, భారీ స్థాయి పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ పై ఎక్కువ దృష్టి పెట్టడంతో విడుదల ఆలస్యం కావచ్చని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
దీంతో ఫౌజీ 2026లో రాకపోవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆ వార్తలపై ప్రభాస్ అభిమానులు నమ్మకం వ్యక్తం చేయడం లేదు. షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ప్యారలల్ గా జరుగుతున్నాయని, రిలీజ్ లో ఆలస్యం ఉండదని వారు అంటున్నారు. ఏదేమైనా ఫౌజీ విడుదల తేదీపై క్లారిటీ లేకపోయినా.. సినిమా మీద ఉన్న ఆసక్తి మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆ ట్విస్ట్ లకు ఫుల్ స్టాప్ పడదనే చెప్పాలి.