ట్రెండీ టాక్: 2026లో ఘనమైన ఓపెనర్ ఎవరు?
500 కోట్లు అంతకుమించి వసూలు చేసే సత్తా ఈ జనవరిలో ఏ సినిమాకి ఉంది? అన్నదే ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది.;
బాలీవుడ్ కి ఏడాది ముగింపు ఉత్సాహం నింపింది. 2025 డిసెంబర్ లో రణ్ వీర్ `దురంధర్` విజయం హిందీ చిత్రసీమలో ఉత్సాహం పెంచింది. పాన్ ఇండియన్ ట్రెండ్ లో టైర్ 2 నగరాల్లోను హిందీ సినిమాలను తెలుగు ప్రజలు ఆదరిస్తుండటం ఆసక్తిని కలిగిస్తోంది. తీవ్రవాదం, దేశభక్తి నేపథ్యంలో నిజకథతో రూపొందించిన `దురంధర్` గురించి ఇటీవల తెలుగు యువతలోను ఎక్కువగా చర్చ సాగుతోంది. కంటెంట్ ఎంపిక సరైనది అయితే, కచ్ఛితంగా బ్లాక్ బస్టర్ సాధ్యమేనని దురంధర్ నిరూపిస్తోంది. సినిమాల రిలీజ్ లకు డిసెంబర్ ప్రారంభం ఎప్పుడూ అనుకూలం కాదు. కానీ దురంధర్ ఈ నెలలోనే విడుదలై కేవలం మంచి కంటెంట్ కారణంగా ఇంత పెద్ద విజయం అందుకుందని ట్రేడ్ విశ్లేషిస్తోంది.
గతంలోను ఇదే డిసెంబర్ లో విడుదలైన యానిమల్, పుష్ప 2 చిత్రాలు సంచలన విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు సీజన్, అన్ సీజన్ అనే రూల్స్ వర్తించవని ఈ సినిమాలు నిరూపించాయి. యానిమల్, పుష్ప 2, దురంధర్ చిత్రాలు.. వాటిలో నటించిన హీరోల కెరీర్ బెస్ట్ హిట్స్ గా నిలిచాయి.
అయితే ఏడాది ముగింపును దురంధర్ తన ఖాతాలో వేసుకోగా, ఇతర సినీపరిశ్రమల నుంచి అంతగా ఆడిన సినిమాలేవీ లేవు. ఈ డిసెంబర్ లో విడుదలైన చిత్రాలలో టాలీవుడ్ నుంచిరామ్ కథానాయకుడిగా నటించిన `ఆంధ్రా కింగ్ తాలూకా` మంచి సమీక్షలతో ఉత్సాహం నింపింది. ఇతర సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్లినవే. అయితే దురంధర్ స్థాయి విజయాలేవీ భారతీయ సినీపరిశ్రమల్లో రాలేదు.
అందుకే జనవరిలో ఘనమైన ఓపెనింగును అందించే సినిమా ఏది? అన్న చర్చ మొదలైంది. దురంధర్ స్థాయి విజయం అందుకునే సినిమా ఏదైనా సంక్రాంతి బరిలో వస్తోందా? అన్న ఆసక్తికర చర్చ సాగుతోంది. జనవరి తెలుగు సినిమాలకు కలిసొచ్చే సీజన్. సంక్రాంతి పండుగకు వారం పొడవునా సెలవులు టాలీవుడ్ బాక్సాఫీస్ కి కలిసొస్తుంది. ఈ సంక్రాంతి సీజన్ లో వస్తున్న క్రేజీ సినిమా `రాజా సాబ్` మరో `దురంధర్` రేంజులో విజయం సాధిస్తుందా? అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ బరిలో దిగుతున్నాడు గనుక ఘనమైన ఆరంగేట్రాన్ని ఇస్తాడని అంతా ఊహిస్తున్నారు. ప్రభాస్ ఈసారి రెగ్యులర్ యాక్షన్ సినిమాలకు భిన్నంగా హారర్ థ్రిల్లర్ తో అభిమానుల ముందుకు వస్తున్నాడు. 9 జనవరి 2026న విడుదలవుతున్న రాజా సాబ్ విన్యాసాలు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజులో ఉండనున్నాయో వేచి చూడాలి. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి అద్భుత స్పందన వచ్చింది.
ఈ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న `మన శంకర వరప్రసాద్ గారు` సంక్రాంతి బరిలోనే విడుదల కానుంది. రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి కూడా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. అయితే సైరాతో పాన్ ఇండియాలో పరిచయమైన చిరంజీవి ఇప్పుడు అనీల్ రావిపూడి దర్శకత్వంలోని కామెడీ ఎంటర్ టైనర్ తో ఏ స్థాయి విజయం అందుకుంటారో వేచి చూడాలి. అపజయమెరుగని దర్శకుడిగా అనీల్ రావిపూడి వరుస విజయాలను అందిస్తున్నాడు. అందువల్ల చిరుతో అనీల్ కాంబినేషన్ మూవీపై భారీ అంచనాలేర్పడ్డాయి. ఈ చిత్రంలో చిరంజీవి- వెంకటేష్ రేర్ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద భారీ మ్యాజిక్ చేయడానికి సహకరిస్తుందని కూడా ట్రేడ్ అంచనా వేస్తోంది.
ఇక ఈ జనవరిలో అత్యంత క్రేజీగా పాన్ ఇండియాలో విడుదలవుతున్న మరో సినిమా `జననాయకుడు`. దళపతి విజయ్ నటనారంగాన్ని విడిచిపెట్టి పూర్తిగా రాజకీయాల్లోకి వెళుతున్న క్రమంలో `జననాయగన్` చివరి సినిమా కాబోతోంది! అంటూ ప్రచారం సాగుతోంది. తమిళ తంబీలకు ఇది ఎమోషనల్ మూవ్ మెంట్ కాబోతోంది. అందుకే ఈ సంక్రాంతి బరిలో విజయ్ రికార్డులు సాధించడం సాధ్యమేనని అంచనా వేస్తున్నారు. సంక్రాంతి కానుకగా జననాయగన్ చిత్రాన్ని 9జనవరి 2026న విడుదల చేస్తున్నారు. అఖండ తరహా కాన్సెప్టుతో రూపొందించిన ఈ సినిమా విజయ్ ఫ్యాన్స్ లో పూనకాలు పుట్టిస్తుందని అంచనా వేస్తున్నారు. దళపతి విజయ్ నటించిన ఇటీవలి సినిమాలు 250-300 కోట్ల మధ్య వసూలు చేస్తున్నాయి. దీనిని బట్టి జననాయకుడు సంక్రాంతి బరిలో అత్యంత భారీ వసూళ్లను సాధించే చిత్రాలలో ఒకటిగా నిలుస్తుందని భావిస్తున్నారు.
500 కోట్లు అంతకుమించి వసూలు చేసే సత్తా ఈ జనవరిలో ఏ సినిమాకి ఉంది? అన్నదే ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది. సంక్రాంతి బరిలో టాలీవుడ్ లో మూడు పెద్ద సినిమాలు నువ్వా నేనా? అంటూ పోటీపడనుండడం అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. సంక్రాంతి సీజన్ ముగిశాక ఈ ఏడాదిలో మునుముందు భారీ చిత్రాల ట్రీట్ ఉంది. ప్రభాస్ - హను కాంబినేషన్ లోని ఫౌజీ, అల్లు అర్జున్-అట్లీ మూవీ, ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ పాన్ మూవీ ఇండియాలో సంచలనం సృష్టించే చిత్రాల జాబితాలో ఉన్నాయి. కానీ అంతకుముందే ఈ జనవరిలో ఘనమైన ఓపెనింగ్ చేసే సినిమా ఏది? అన్నది ఉత్కంఠను పెంచుతోంది.