ప్రభాస్ సపోర్ట్ ను ఆల్ఫా క్యాష్ చేసుకుంటుందా?
డార్లింగ్ ప్రభాస్ మరోసారి తన ప్రత్యేకమైన స్వభావాన్ని చాటుకున్నారు. తన సినిమాల ప్రచారానికే పరిమితం కాకుండా, ఇండస్ట్రీలోని ఇతర నటీనటుల సినిమాలకు కూడా బహిరంగంగా మద్దతు తెలపడం ఆయనకు కొత్త కాదు.
డార్లింగ్ ప్రభాస్ మరోసారి తన ప్రత్యేకమైన స్వభావాన్ని చాటుకున్నారు. తన సినిమాల ప్రచారానికే పరిమితం కాకుండా, ఇండస్ట్రీలోని ఇతర నటీనటుల సినిమాలకు కూడా బహిరంగంగా మద్దతు తెలపడం ఆయనకు కొత్త కాదు. తాజాగా ఆలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఆల్ఫా ట్రైలర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేయడంతో ప్రభాస్ పోస్ట్ ఒక్కసారిగా సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మామూలుగా చూస్తే ప్రభాస్ చేసిన పోస్ట్ ఒక కో యాక్టర్ గా తెలిపిన విష్ మాత్రమే. కానీ ఈ పోస్ట్ చేసిన టైమ్ కారణంగా దీనికి మరో అర్థం కూడా వెతకడం ప్రారంభించారు నెటిజన్లు. గత కొంతకాలంగా కల్కి 2898AD సీక్వెల్‌లో ఆలియా భట్ కనిపించబోతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆమె ఇప్పటికే షూటింగ్‌లో కూడా పాల్గొన్నట్లు సోషల్ మీడియాలో పలు కథనాలు వినిపిస్తున్నప్పటికీ, మేకర్స్ నుంచి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. అలాంటి టైమ్ లో ప్రభాస్ చేసిన ఈ పోస్ట్ ఆ రూమర్స్‌కు మరింత ఊతమిచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ పోస్ట్‌కు ఆలియా భట్ కూడా వెంటనే రియాక్ట్ అవడం మరో ఆసక్తికర అంశంగా మారింది. ఆమె ప్రభాస్ కు థ్యాంక్స్ చెప్తూ ఇచ్చిన రిప్లై సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఇద్దరూ త్వరలో ఒకే ప్రాజెక్ట్‌లో కనిపించబోతున్నారనే ఊహాగానాలు మరింత బలపడ్డాయి. అయితే ఇవన్నీ ప్రస్తుతం అభిమానుల అంచనాలు, సోషల్ మీడియా చర్చల వరకే పరిమితమని, అధికారిక ప్రకటన వచ్చే వరకు వాటిని కచ్ఛితమని చెప్పలేమని గమనించాలి.
ఇదిలా ఉంటే ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్ ను డార్లింగ్ అనే పేరుకు తగ్గట్టుగా ఎలా వ్యవహరిస్తారో ఈ సంఘటనతో మరోసారి స్పష్టమైందని అంటున్నారు. స్టార్ హీరోగా తనకంటూ భారీ మార్కెట్ ఉన్నప్పటికీ, ఇతర హీరోలు, హీరోయిన్లు లేదా కొత్త సినిమాలకు బహిరంగంగా మద్దతు ఇవ్వడంలో ఆయన ఎప్పుడూ వెనుకడుగు వేయరు. ఇలాంటి చర్యలు ఇండస్ట్రీలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పెంచడమే కాకుండా, అభిమానుల్లో కూడా సానుకూల స్పందనను తీసుకువస్తున్నాయి.
ఇక ఆల్ఫా విషయానికి వస్తే, ఇప్పటికే ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ లభించింది. దానికి తోడు ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ నుంచి వచ్చిన సోషల్ మీడియా సపోర్ట్ సినిమాపై మరింత బజ్ ను పెంచింది. ఇది నేరుగా బాక్సాఫీస్ కలెక్షన్లను ప్రభావితం చేస్తుందా అనే విషయం రిలీజ్ తర్వాతే తేలనుంది. అయితే రిలీజ్‌కు ముందు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంలో ఇలాంటి మద్దతు కీలక పాత్ర పోషిస్తుందనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ముఖ్యంగా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైన టైమ్ లో ఇలాంటి హైప్ సినిమాకు ఎక్స్‌ట్రా ప్రమోషన్ గా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ప్రభాస్ వల్ల సోషల్ మీడియాలో ఆల్ఫా పై పెరిగిన హైప్ ను ఆలియా బాక్సాఫీస్ సక్సెస్ గా మార్చుకోగలదా లేదా అనేది చూడాలి.