చరణ్ 'పెద్ది'.. కన్ఫ్యూజన్ కు ఎండ్ కార్డ్ పడేదెప్పుడు?
అయితే ఆ విషయంపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో అభిమానుల్లో సందేహాలు మరింత పెరుగుతున్నాయి.;
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం పెద్ది రోజురోజుకూ అంచనాలను పెంచుకుంటోంది. దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న ఆ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ఇప్పటికే టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. విడుదలైన గ్లింప్స్, ఫస్ట్ లుక్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమాపై మంచి హైప్ నెలకొంది.
అయితే ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన అంశం చర్చకు దారి తీస్తోంది. అదే స్పెషల్ సాంగ్. రామ్ చరణ్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కు ఎప్పుడూ ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. గతంలో రంగస్థలం సినిమాలో పూజా హెగ్డే చేసిన జిల్ జిల్ జిగేలు రాణి పాట ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. అదే తరహాలో పెద్దిలో కూడా ఓ మాస్ స్పెషల్ సాంగ్ ఉండబోతుందనే ప్రచారం మొదటి నుంచే ఉంది.
ఇప్పుడు ఆ పాటలో చరణ్ సరసన ఎవరు డ్యాన్స్ చేస్తారన్నది ప్రశ్నగా మారింది. అయితే అందుకు ముందు మృణాల్ ఠాకూర్, మానస వారణాసి పేర్లు వినిపించగా.. ఇప్పుడు సంయుక్త మీనన్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఇటీవల అఖండ 2: తాండవంలో ఆమె చేసిన జాజికాయ జాజికాయ పాటకు మంచి స్పందన రావడంతో, అదే ఎనర్జీతో చరణ్‌తో కలిసి స్టేజ్ షేక్ చేయనుందని తెలుస్తోంది.
అయితే ఆ విషయంపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో అభిమానుల్లో సందేహాలు మరింత పెరుగుతున్నాయి. సోషల్ మీడియాలోనూ ఎవరా హీరోయిన్?, ఎందుకు ఇంత ఆలస్యం? అంటూ నెటిజన్లు ప్రశ్నలు వేస్తున్నారు. హైప్ పెంచడానికే ఇలా సస్పెన్స్ కొనసాగిస్తున్నారా? లేక ఇంకా ఫైనల్ కాలేదా? అన్న చర్చలు జరుగుతున్నాయి.
ఇక పెద్ది స్పెషల్ సాంగ్ చిత్రీకరణ ఆలస్యం అవుతుండటం కూడా మరో చర్చనీయాంశంగా మారింది. షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకున్నప్పటికీ, పాట మాత్రం ఇంకా పూర్తి కాలేదని వార్తలు రావడం గమనార్హం. దీంతో అభిమానులు మాత్రం ఏదో ఒక క్లారిటీ ఇవ్వండి అంటూ కోరుతున్నారు. ఆ కన్ఫ్యూజన్ కు పుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందో చూడాలి.
సినిమా విషయానికి వస్తే, చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. శివ రాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు మంచి స్పందన అందుకోవడంతో ఆల్బమ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఆ సినిమా, స్పెషల్ సాంగ్ షూట్ ప్రారంభం తర్వాత మరింత వేగం అందుకునే అవకాశముంది. అయితే ఆ పాటలో డ్యాన్స్ చేసే హీరోయిన్ ఎవరు అన్నది అధికారికంగా ప్రకటించే వరకు కన్ఫ్యూజన్ మాత్రం కొనసాగనున్నట్లు కనిపిస్తోంది.