‘హరిహర వీరమల్లు’.. ఇది ఆఖరి ఆయుధం!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు: పార్ట్ 1 - స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్’ సినిమా విడుదలకు అయిద్దమవుతున్న విషయం తెలిసిందే.;

Update: 2025-06-02 06:47 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు: పార్ట్ 1 - స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్’ సినిమా విడుదలకు అయిద్దమవుతున్న విషయం తెలిసిందే. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ డైరెక్షన్‌లో, ఎ. దయాకర్ రావు నిర్మాణంలో రూపొందుతున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా జూన్ 12న పాన్ ఇండియా రేంజ్ లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా, బాబీ డియోల్ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో నర్గీస్ ఫాక్రీ, నోరా ఫతేహి, సత్యరాజ్ వంటి నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్య నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ 2020లో ప్రారంభమైనప్పటి నుంచి అనేక ఆటంకాలను ఎదుర్కొంది. కోవిడ్ మహమ్మారి, పవన్ కళ్యాణ్ రాజకీయ కట్టుబాట్లు, డైరెక్టర్ మార్పు వంటి కారణాలతో ఈ చిత్రం విడుదల ఆలస్యమైంది.

ఇప్పటికే ‘మాట వినాలి’, ‘కొల్లగొట్టినాదిరో’, ‘అసుర హననం’, ‘తారా తారా’ సాంగ్స్ విడుదలైనప్పటికీ, ఈ సినిమా బజ్‌ను అంతగా పెంచలేకపోయాయి. ఎంఎమ్ కీరవాణి సంగీతం అందించిన ఈ సాంగ్స్ ఆడియన్స్‌ను ఆకర్షించినప్పటికీ, కంటెంట్ గురించి చర్చలు జరిగే స్థాయిలో హైప్ రాలేదు.

ఇక ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ జూన్ 5న విడుదల కానుందని తెలుస్తోంది. ఇది వీరమల్లు బజ్ కి ఆఖరి ఆయుధం అని చెప్పవచ్చు. ఇంతవరకు సినిమా బజ్‌ను పెంచడంలో విఫలమైన టీమ్, ఈ ట్రైలర్‌తో అయినా అభిమానులను ఆకర్షించి, కంటెంట్ గురించి మాట్లాడుకునేలా చేయాలని భావిస్తోంది. ఈ ట్రైలర్‌లో 17వ శతాబ్దపు మొఘల్ నేపథ్యం, యాక్షన్ సీక్వెన్స్‌లు, ఆధ్యాత్మిక ఎలిమెంట్స్‌ను హైలైట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.

ఈ సినిమా కథ వీరమల్లు అనే ఒక డాకు జీవితం చుట్టూ తిరుగుతుంది, ఆయన మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, కోహినూర్ వజ్రాన్ని దొంగిలించే ప్రయత్నంలో ఉంటాడట. బాబీ డియోల్ మొఘల్ చక్రవర్తిగా, నిధి అగర్వాల్ పంచమి పాత్రలో నటిస్తున్నారు. ఈ కథలో ధర్మం కోసం పోరాటం, ఆధ్యాత్మిక ఎలిమెంట్స్ కీలకంగా ఉంటాయని టీమ్ సూచనలు ఇచ్చింది. ట్రైలర్ ఈ అంశాలను ఎలా చూపిస్తుందనేది ఆసక్తి రేకెత్తిస్తోంది.

పవన్ కళ్యాణ్ క్రేజ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచినప్పటికీ, కంటెంట్ గురించి చర్చలు జరిగే స్థాయిలో బజ్ రాకపోవడం టీమ్‌కు సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో ట్రైలర్ ఆడియన్స్‌ను ఆకర్షించి, సినిమా కథను హైలైట్ చేసేలా ఉంటే, బజ్‌ను రెట్టింపు చేయడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్‌ను సాధించే అవకాశం ఉంటుంది. చూడాలి మరి.ఏం జరుగుతుందో.

Tags:    

Similar News