ఆస్పత్రిలో గబ్బర్ సింగ్ రమేష్.. హరీష్ శంకర్ తో డాక్టర్లు ఏమన్నారంటే?
టాలీవుడ్ సినీ ప్రియులకు గబ్బర్ సింగ్ రమేష్ గా సుపరిచితుడైన యాక్టర్ రమేష్ ప్రస్తుతం హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
టాలీవుడ్ సినీ ప్రియులకు గబ్బర్ సింగ్ రమేష్ గా సుపరిచితుడైన యాక్టర్ రమేష్ ప్రస్తుతం హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు సడెన్ గా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ఆయనను ఐసీయూలో చేర్చి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. రమేష్ ఆరోగ్య పరిస్థితి గురించి సమాచారం అందుకున్న దర్శకుడు హరీష్ శంకర్, హీరో పవన్ కళ్యాణ్ టీమ్ మెంబెర్స్ అపోలో ఆస్పత్రికి వెళ్లి వైద్యులను కలిశారు.
రమేష్ కు అందుతున్న వైద్య సేవలు, ఆయన ఆరోగ్య పరిస్థితిపై వారు ఆరా తీసినట్లు సమాచారం. వైద్యులు కూడా అన్ని వివరాలు చెప్పినట్లు తెలుస్తోంది. అపోలో న్యూరాలజీ విభాగానికి చెందిన డాక్టర్లు ప్రస్తుతం రమేష్ కు చికిత్స అందిస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ప్రస్తుతం పరిస్థితి అత్యంత కీలకంగా ఉందని వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపినట్లు సమాచారం. ముఖ్యంగా వచ్చే 24 నుంచి 48 గంటలు చాలా ముఖ్యమని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది.
రమేష్ సినీ ప్రయాణంలో గబ్బర్ సింగ్ ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. 2012లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఆ సినిమాలో విలన్ గ్యాంగ్ లో ఒకరిగా నటించిన రమేష్, తనదైన కామెడీ టైమింగ్, ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ముఖ్యంగా అంత్యాక్షరి ఎపిసోడ్ లో ఆయన నటన ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఆ ఒక్క సన్నివేశంతోనే ఆయనకు గబ్బర్ సింగ్ రమేష్ అనే పేరు స్థిరపడిపోయింది. అనంతరం పలు చిత్రాల్లో నటించిన ఆయన, హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఉస్తాద్ భగత్ సింగ్ లోనూ కనిపించారు. చిన్న పాత్రలైనా వాటికి తనదైన ముద్ర వేయడం రమేష్ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
రమేష్ అస్వస్థత వార్త బయటకు రావడంతో గబ్బర్ సింగ్ సినిమాలో నటించిన పలువురు జూనియర్ ఆర్టిస్టులు, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. పలువురు ఆయన కుటుంబ సభ్యులను ఫోన్ ద్వారా సంప్రదించి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
సినీ పరిశ్రమలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న రమేష్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం అపోలో డాక్టర్స్ టీమ్ నిరంతరం పర్యవేక్షణలో ఆయన చికిత్స కొనసాగుతోంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు అధికారికంగా వెలువడాల్సి ఉంది. గబ్బర్ సింగ్ తో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న ఆ నటుడు మరోసారి ఆరోగ్యంగా తిరిగి సిల్వర్ స్క్రీన్ పై కనిపించాలని సినీ ప్రియులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.