ఆ వొత్తడి వల్లే తమిళ హీరో వెనక్కి తగ్గాడా?
2025 సంక్రాంతికి తెలుగు నుంచి విడుదలైన ఒకే ఒక్క మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అనిపించుకుని బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది.;
సంక్రాంతి సమరం అంటే మన తెలుగు సినిమాలు రంగంలోకి దిగడం ఆనవాయితీగా వస్తోంది. స్టార్ హీరోల నుంచి చిన్న మీడియం రేంజ్ హీరోల వరకు సంక్రాంతి బరిలోకి దిగాలని, సక్సెస్‌ని సొంతం చేసుకోవాలని భఢావిస్తుంటారు. స్టార్స్ అయితే కచ్చితంగా తమ సినిమా సంక్రాంతి రేసులో ఉండాలని ప్లాన్ చేస్తుంటారు. ఈ రేసులో ఒక్కో సారి కొంత మంది బ్లాక్ బస్టర్లని దక్కించుకుంటుంటే మరి కొంత మంది మాత్రం భారీ డిజాస్టర్లని ఎదుర్కొన్న సందర్భాలున్నాయి.
అయినా సరే సంక్రాంతి సీజన్‌లో బరిలో నిలవాలని ప్రతీ ఒక్కరూ ఆశ పడుతుంటారు. 2025 సంక్రాంతికి తెలుగు నుంచి విడుదలైన ఒకే ఒక్క మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అనిపించుకుని బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. దీంతో 2026 సంక్రాంతికి ఏకంగా ఐదు తెలుగు సినిమాలు పోటీపడుతున్నాయి. `ది రాజా సాబ్`తో ప్రభాస్, చిరంజీవి `మన శంకరవరప్రసాద్`తో బరిలోకి దిగుతుంటే రవితేజ `భర్త మహాశయులకు విజ్ఞప్తి`, శర్వానంద్ `నారీ నారీ నడుమ మురారి`, నవీన్ పొలిశెట్టి `అనగనగ ఒకరాజు` మూవీతో పోటీకి దిగుతున్నారు.
ఈ సినిమాలతో సంక్రాంతికి థియేటర్లు ఫుల్ కాబోతున్నాయి. ప్రధానంగా `ది రాజా సాబ్`, మన శంకర వరప్రసాద్ సినిమాలకు థియేటర్లు కేటాయిస్తున్నారు. మిగతా వాటిని రవితేజ `భర్త మహాశయులకు విజ్ఞప్తి`, శర్వానంద్ `నారీ నారీ నడుమ మురారి`, నవీన్ పొలిశెట్టి `అనగనగ ఒకరాజు` సరిపెట్టుకోబోతున్నాయి. వీటితో పాటు తమిళ డబ్బింగ్ సినిమాలు విజయ్ `జన నాయకుడు`, శివకార్తికేయన్ `పరాశక్తి` సంక్రాంతి బరిలోకి దిగుతున్నాయి. విజయ్ `జన నాయకుడు`కు థియేటర్లు లభించినా శివకార్తికేయన్ `పరాశక్తి`కి థియేటర్లు లభించడం కష్టంగా మారింది.
జనవరి 14న తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే తెలుగు సినిమాలు రిలీజ్ అవుతుండటం, తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల సమస్య తలెత్తే అవకాశం ఉండటంతో `పరాశక్తి` టీమ్‌పై ఒత్తిడి మొదలైంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ తమ నిర్ణయాన్ని మార్చుకున్నారట. 14న రిలీజ్ చేయాలనుకున్న ఈ మూవీని నాలుగు రోజులు ముందుగానే అంటే జనవరి 10నే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట. దీంతో ఈ సినిమా కొంత వరకు థియేటర్లు లభించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
`ఆకాశమే హద్దురా` మూవీతో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న సుధా కొంగర ఈ మూవీని రూపొందించారు. శ్రీలీల హీరోయిన్‌గా నటించగా, జయం రవి, అధర్వ, రానా దగ్గుబాటి, బాసిల్ జోసెఫ్ నటిస్తున్నారు. 1960 టైమ్‌లో తమిళనాట జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీని రూపొందించారు.