హీరోల సినిమాల మధ్య గ్యాప్ -మేకోవర్స్!

ఒకప్పుడు అగ్ర హీరోలు ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు విడుదల చేసి బాక్సాఫీస్ వద్ద సందడి చేసేవారు.

Update: 2026-06-10 17:30 GMT

ఒకప్పుడు అగ్ర హీరోలు ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు విడుదల చేసి బాక్సాఫీస్ వద్ద సందడి చేసేవారు. కానీ, ప్రస్తుత డిజిటల్ , పాన్-ఇండియా కాలంలో ఆ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు టాలీవుడ్ అగ్ర నటులు ఒక సినిమా పూర్తి చేసిన తర్వాత మరో సినిమా ప్రారంభించడానికి నెలల తరబడి, కొన్నిసార్లు ఏళ్లపాటు సమయం తీసుకుంటున్నారు. ఈ సుదీర్ఘ విరామం కేవలం విశ్రాంతి కోసం తీసుకుంటున్నది కాదు. కథల ఎంపికలో చూపిస్తున్న అప్రమత్తత, తదుపరి చిత్రాల కోసం తమను తాము సరికొత్తగా ఆవిష్కరించుకోవడానికి (మేకోవర్) వారు చేస్తున్న వ్యూహాత్మక ప్రయాణంగా క‌నిపిస్తోంది.

ఈ గ్యాప్‌కు అత్యంత ప్రధానమైన కారణం పాత్రల డిమాండ్ .. వాటికి తగ్గ అద్భుతమైన శారీరక మార్పులు. దర్శకులు సృష్టించే విభిన్నమైన ప్రపంచాల్లోకి హీరోలు పరకాయ ప్రవేశం చేయాల్సి వస్తోంది. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న గ్లోబల్ అడ్వెంచర్ చిత్రం `వారణాసి` కోసం సూపర్ స్టార్ మహేష్ తన లుక్‌ను పూర్తిగా మార్చేశారు. జుట్టు పెంచి, జర్మనీలోని బ్లాక్ ఫారెస్ట్‌లో కఠినమైన ట్రెకింగ్ శిక్షణ తీసుకుని `రుద్ర` పాత్ర కోసం రగ్గడ్ అవతార్‌ను సిద్ధం చేసుకున్నారు. అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న `స్పిరిట్` సినిమా కోసం రెబెల్ స్టార్ ప్రభాస్ ఇంటెన్స్, యాంగ్రీ పోలీస్ ఆఫీసర్ పాత్రకు తగ్గట్టుగా రా అండ్ రస్టిక్ బాడీ లాంగ్వేజ్‌ను, మేకోవర్‌ను సాధించడానికి ప్రత్యేక సమయాన్ని కేటాయించారు.

మరోవైపు శారీరక , మానసిక అలసట, అలాగే ఆరోగ్య కారణాల వల్ల కూడా హీరోలు విరామం తీసుకోవడం అనివార్య మవుతోంది. నేటి భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రాలలో స్టంట్స్, విఎఫ్ఎక్స్ షెడ్యూల్స్ నటీనటులపై తీవ్రమైన శారీరక ఒత్తిడిని కలిగిస్తున్నాయి. `పుష్ప 2`, `దేవర` , `పెద్ది` వంటి చిత్రాల కోసం రాత్రింబవళ్లు హై-ఇంటెన్సిటీ ఫైట్ సీక్వెన్సుల్లో పాల్గొనడం వల్ల హీరోలు తరచూ గాయాల బారిన ప‌డ్డారు. ఈ గాయాల నుండి కోలుకోవడానికి, తమ శరీరానికి తగినంత విశ్రాంతిని ఇచ్చి మళ్లీ ఫిట్‌నెస్‌ను సాధించడానికి హీరోలకు కనీసం కొన్ని నెలల విరామం అవసరమవుతోంది. కెమెరా ముందుకు రావడమే కాకుండా, శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవడం కూడా ఇక్కడ ముఖ్యం.

దీనికి తోడు వందల కోట్ల వ్యాపారంతో ముడిపడి ఉన్న పాన్-ఇండియా ప్రాజెక్టులకు పక్కా స్క్రిప్ట్ వర్క్ , ప్రీ-ప్రొడక్షన్ అత్యంత కీలకం. కథ పూర్తిగా లాక్ అవ్వకుండా అన్ని ఏరియాల మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా విజువల్స్ ప్లాన్ చేయకుండా హీరోలు సెట్స్ పైకి వెళ్లడానికి ఆసక్తి చూపించడం లేదు. ఒక సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత దర్శకుడు తదుపరి స్క్రిప్ట్ తుది మెరుగులు దిద్దే వరకు ,విఎఫ్ఎక్స్ టీమ్స్ ప్రీ-విజువలైజేషన్ పూర్తి చేసే వరకు హీరోలు వేచి చూడక తప్పడం లేదు. ఈ రకమైన వ్యూహాత్మక ఆలస్యం సినిమా క్వాలిటీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి మేకర్స్‌కు ఎంతగానో సహాయపడుతోంది.

అయితే సినిమాల మధ్య వస్తున్న ఈ భారీ గ్యాప్ చిత్ర పరిశ్రమలోని ట్రేడ్ వర్గాలపై ..అభిమానులపై భిన్నమైన ప్రభావాన్ని చూపుతోంది. తమ అభిమాన హీరోను వెండితెరపై చూసి చాలా కాలం అవ్వడంతో అభిమానుల్లో నిరాశ వ్యక్తమవుతుంది. మరోవైపు ఆ సినిమాపై ఉండే క్యూరియాసిటీ, అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. డిస్ట్రిబ్యూటర్లు ,థియేటర్ల యాజమాన్యాలు కూడా ఈ గ్యాప్ వల్ల కొంత ఇబ్బంది పడుతున్నప్పటికీ సినిమా స‌క్సెస్ అన్నింటిని మ‌రిపిస్తుంద‌న్న‌ది కాద‌న‌లేని నిజం.

Tags:    

Similar News