పాన్ ఇండియా మోజులో హీరోయిన్ల కెరీర్ గమ్యం లేని ప్రయాణమా?

భారీ ప్రాజెక్టుల కోసం సుదీర్ఘకాలం కేటాయించడం తో కెరీర్‌లో వేగంగా చేయాల్సిన ఇతర సినిమాలను వదులుకోవాల్సి వస్తోంది.

Update: 2026-07-14 12:30 GMT

ప్రస్తుతం పాన్ ఇండియా అనే పదం మంత్రంలా మారిపోయింది. భారీ బడ్జెట్, భారీ తారాగణం, పాన్ ఇండియా విడుదల అనేది ఇప్పుడు ప్రతి స్టార్ హీరో ప్రాజెక్టుకు ప్రామాణికంగా మారింది. అయితే ఈ పాన్ ఇండియా వ్యామోహం హీరోయిన్ల కెరీర్ గ్రాఫ్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. గతంలో ప్రాంతీయ భాషల్లో స్టార్ హీరోయిన్లుగా వెలుగొందిన నటీమణులు పాన్ ఇండియా ప్రాజెక్టుల వేటలో పడి సొంత మార్కెట్‌ను కోల్పోతున్నారది ట్రేడ్ వర్గాల అభిప్రాయం. ఒకే సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవాలనే ఆశ వారిని సందిగ్ధంలో పడేస్తోంది.

భారీ ప్రాజెక్టుల కోసం సుదీర్ఘకాలం కేటాయించడం తో కెరీర్‌లో వేగంగా చేయాల్సిన ఇతర సినిమాలను వదులుకోవాల్సి వస్తోంది. పాన్ ఇండియా చిత్రాలు షూటింగ్ ఆలస్యం కావడం, ప్రమోషన్ల కోసం నెలల తరబడి సమయం కేటాయించడం వంటి అంశాలు కెరీర్ వేగాన్ని తగ్గిస్తున్నాయి. ఒకప్పుడు ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేసిన వారు ఇప్పుడు ఒకే ప్రాజెక్టుపై ఏడాదో రెండేళ్లో కేటాయించ‌డం వల్ల ప్రేక్షకుల దృష్టిలో క్రేజ్ తగ్గుతోందనేది వాస్తవం.

ఇంకొంత మంది భామ‌లు తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఉన్నప్పుడు వరుసగా బాలీవుడ్ ప్రాజెక్టులు చేసి అక్కడ ఆశించిన ఫలితాలు రాక ఇటు టాలీవుడ్ అవకాశాలను కూడా కోల్పోయిన పరిస్థితిని చూశాం. సౌత్, నార్త్ సినిమాలను బ్యాలెన్స్ చేయలేక సతమతమవుతున్న హీరోయిన్లు, చివరికి రెండు చోట్లా లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పాన్ ఇండియా హీరోయిన్ అనిపించుకోవాలనే కీర్తి నటిని అగ్రస్థానంలో నిలబెట్టే కంటే అస్థిరత వైపు నెట్టే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.

ఈ సమస్యకు ప్రధాన కారణం కంటెంట్ కంటే ఇమేజ్ కు ప్రాధాన్యత ఇవ్వడం. ప్రాంతీయ చిత్రాల్లో హీరోయిన్లకు దొరికే ప్రాధాన్యత, పాన్ ఇండియా సినిమాల్లో ఉండటం లేదు. అక్కడ కథానాయిక పాత్రలు చాలావరకు హీరోను గ్లోరిఫై చేసేలా పరిమితమవుతున్నాయి. ఈ పరిమితుల వల్ల నటీమణుల ప్రతిభకు గుర్తింపు దక్కడం లేదు. ఫలితంగా భారీ ప్రాజెక్టుల ద్వారా వచ్చే గుర్తింపు కంటే ప్రాంతీయ చిత్రాల్లో నటించడం ద్వారా వచ్చే సక్సెస్ కెరీర్‌కు మరింత స్థిరత్వాన్ని ఇస్తుందని నటీమణులు గుర్తిస్తున్నారు.

నిజానికి పాన్ ఇండియా ప్రాజెక్టులు హీరోయిన్‌కు అదనపు ఆకర్షణ మాత్రమే కావాలి. కానీ అదే ప్రధాన లక్ష్యం కాకూడదు. ఎవరైతే ప్రాంతీయ భాషల ప్రాధాన్యతను మర్చిపోకుండా అప్పుడప్పుడు భారీ చిత్రాలకు ప్రాధాన్యత ఇస్తారో? వారు మాత్రమే కెరీర్‌లో నిలదొక్కుకోగలరు. స్టార్డమ్ కోసం ఆశపడి సొంత మార్కెట్‌ను వదులుకోవడం అనేది కెరీర్ పరంగా ఎంతో నష్టదాయకం. ఈ విషయాన్ని ఇప్పుడిప్పుడే చాలా మంది నటీమణులు గ్రహిస్తున్నట్లు సమాచారం. అందుకే వారంతా మళ్ళీ ప్రాంతీయ చిత్రాలపై దృష్టి సారించేందుకు మొగ్గు చూపుతున్నారు.

చివ‌రిగా పాన్ ఇండియా ఇమేజ్ అనే ఆకర్షణీయమైన వలయం హీరోయిన్ల కెరీర్లను తప్పుదారి పట్టిస్తోంది. వైవిధ్యమైన పాత్రలు, బలమైన కథలున్న చిన్న సినిమాలను వదులుకుని పాన్ ఇండియా అని పేరున్న భారీ సినిమాల వెంట పడటం వల్ల జరిగే నష్టం కంటే కెరీర్ బ్యాలెన్స్ చేయడం ఎంతో ముఖ్యం. పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే? పాన్ ఇండియా స్టార్‌డమ్ మాత్రమే కాదు. ఆ పాత్రకు ఉన్న లోతు కూడా ముఖ్యమే. ఈ మార్పును గుర్తించిన హీరోయిన్లు మాత్రమే దీర్ఘకాలంలో కెరీర్‌ను విజయవంతంగా కొనసాగించగలరు.

Tags:    

Similar News