ఓటీటీలు, థియేటర్లు రెండూ కాదు.. సీట్ ఎడ్జ్‌పై కూచోబెట్టే ట్యాలెంట్‌తోనే చిక్కు!
ఇటీవలి కాలంలో విడుదలైన చిత్రాలలో ప్రజలు ఆసక్తిగా చర్చించుకున్న తెలుగు సినిమాలు వెతికితే ఒకటి రెండు కూడా కనిపించవు.
గడిచిన కొన్నేళ్లుగా సినిమా పరిశ్రమలో ఓటీటీల రాకతో అంతా మారిపోయిందని.. దీనివల్ల థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య ఘోరంగా తగ్గిపోయిందని చిత్ర పరిశ్రమ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే నాణేనికి మరో వైపు కూడా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవైపు బహిరంగంగా ఓటీటీలను విమర్శిస్తూనే.. మరోవైపు మన నిర్మాతలు తమ చిత్రాల డిజిటల్ రైట్స్ కోసం అవే సంస్థల చుట్టూ తిరుగుతున్నారు. సినిమా సక్సెస్ అయి థియేటర్ల ద్వారా వచ్చే కలెక్షన్ల కంటే... ముందే వచ్చే ఓటీటీ ప్యాకేజీ వ్యాపారమే తమను ఆదుకుంటుందనేది స్పష్టమవుతోంది. అయితే ఈ క్రమంలో ఓటీటీ సంస్థలు తీసుకొచ్చిన సరికొత్త మార్కెట్ విధానం ఇప్పుడు సంచలనంగా మారింది.
నష్టాల బారిన పడకుండా ఉండేందుకు ఓటీటీ కంపెనీలు ఒక `మధ్యేమార్గ ధరల విధానాన్ని` (రిస్క్ అండ్ రివార్డ్ ఫార్ములా) అమల్లోకి తెచ్చాయి. ఏదైనా సినిమా థియేటర్లలో అద్భుతంగా ఆడి, ఓటీటీలోనూ ఎక్కువ వ్యూస్‌తో దూసుకుపోతే.. ఆ చిత్రానికి ముందే కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మంచి ప్యాకేజీని, అదనపు బోనస్‌లను గౌరవప్రదంగా అందిస్తున్నాయి. అలా కాకుండా థియేటర్లు- ఓటీటీ.. రెండు చోట్లా ఆదరణ దక్కించుకోలేకపోతే ముందస్తు అగ్రిమెంట్ ధరలో ఏకంగా 30 శాతం వరకు కోత విధిస్తున్నాయి. ఈ నిబంధనలకు అంగీకరించడం తప్ప నిర్మాతలకు మరో గత్యంతరం లేకుండా పోతోంది.
ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే.. అసలు సమస్య ఓటీటీలు లేదా థియేటర్లు కాదని, మన సినిమాల్లోని ``కంటెంట్ & క్రియేటివిటీ లోపమే``నని అర్థమవుతోంది. ప్రేక్షకులను ఇళ్ల నుండి కదిలించి థియేటర్ల వరకు రప్పించే అంతటి గొప్ప కథలను అందించే మొనగాడు ఎవరనేదే ఇప్పుడు వెతకాల్సి ఉంది. జనం సినిమా చూడటానికి రావాలంటే కనీసం ఫస్ట్ లుక్ పోస్టర్, ట్రైలర్ తో అయినా జనంలో ఉత్కంఠను, కుతూహలాన్ని రేకెత్తించే ప్రతిభ టీమ్‌లో ఉండాలి. అంతటి సత్తా లేకుండా.. థియేటర్లకు రండి అంటూ కేవలం ప్రేక్షకులపై ఒత్తిడి తెస్తే వారు ఖచ్చితంగా రారు.
ఇటీవలి కాలంలో విడుదలైన చిత్రాలలో ప్రజలు ఆసక్తిగా చర్చించుకున్న తెలుగు సినిమాలు వెతికితే ఒకటి రెండు కూడా కనిపించవు. అదే సమయంలో ఎక్కడో అమెరికాలో ఎలాంటి అంచనాలు లేకుండా అనామక నటీనటులతో కేవలం రూ. 7 కోట్ల స్వల్ప బడ్జెట్‌తో రూపొందిన `అబ్సెషన్` అనే హాలీవుడ్ సినిమాను భారతదేశంలో ఇక్కడి ప్రేక్షకులు ఆదరిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. భారతదేశం నుంచి ఈ సినిమా 100కోట్లు కొల్లగొట్టే సినిమాల జాబితాలో నిలుస్తోంది. చాలా స్ట్రెయిట్ తెలుగు సినిమాల కంటే ఈ హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ చిత్రంపైనే ప్రజలకు ఆసక్తి ఎక్కువగా ఉందంటే.. సినిమాలో దమ్ముంటే అది భాష, ప్రాంతీయ హద్దులను దాటి ఆదరణ పొందుతుందని స్పష్టమవుతోంది.
`అబ్సెషన్` వంటి చిత్రాలను థియేటర్లలో వీక్షించిన వాళ్లే తిరిగి ఓటీటీల్లోనూ చూడటానికి ఎగబడతారు. దీనివల్ల ఆయా సినిమాలు రెండు ప్లాట్‌ఫార్మ్‌లలోనూ `డబుల్ ధమాకా` విజయాలను సాధిస్తున్నాయి. ప్రస్తుత తరుణంలో సినిమా ఇండస్ట్రీకి ఇలాంటి ప్రతిభావంతులైన ఫిల్మ్‌మేకర్స్ ఎంతైనా అవసరం. ఏదో ఒక కథను చుట్టేసి ప్రేక్షకుల నెత్తిన రుద్దేయాలనుకునే నాశిరకం సినిమాలకు ఇప్పుడు ఎక్కడా ఆదరణ దక్కడం లేదు. అలాంటి చిత్రాలను జనం థియేటర్లలోనూ చూడరు.. ఓటీటీల్లోనూ వీక్షించరు. ఫలితంగా అవి రెంటికీ చెడ్డ రేవడిలా మిగిలిపోతాయి. కాబట్టి అసలు సమస్య ఓటీటీల్లోనే లేదు.. ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌పై కూర్చోబెట్టే ప్రతిభలోనే ఉంది.