కంట్రోల్ తప్పుతున్న కుర్ర డైరెక్టర్లు!
క్రియేటివ్ ఫ్రీడమ్ ఉండటం మంచిదే అయినా, గ్రౌండ్ రియాలిటీని మర్చిపోవడం వల్ల కంటెంట్ దెబ్బతింటోందనే కామెంట్స్ వస్తున్నాయి.
టాలీవుడ్ లో ఒక డెబ్యూ డైరెక్టర్ మొదటి సినిమాతోనే సాలిడ్ హిట్ కొడితే చాలు.. ఒక్క రాత్రిలోనే అతని ఇమేజ్ స్కై లెవెల్ కు వెళ్లిపోతుంది. ఇండస్ట్రీ మొత్తం ఆ కొత్త టాలెంట్ చుట్టూ తిరగడం సహజమే. అయితే ఆ సక్సెస్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ కాస్తా ఓవర్ కాన్ఫిడెన్స్ గా మారినప్పుడు అసలు సమస్య మొదలవుతోంది. ముఖ్యంగా రెండో ప్రాజెక్ట్ కి వచ్చేసరికి కొందరు యువ దర్శకులు చూపిస్తున్న ఆటిట్యూడ్ ఇప్పుడు ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
వాస్తవానికి మొదటి సినిమా చేసేటప్పుడు నిర్మాతలు, హీరోలు ఇచ్చే సలహాలు చాలా సందర్భాల్లో హెల్ప్ అవుతుంటాయి. వారి అనుభవం వల్ల అనవసరమైన ఖర్చులు తగ్గడంతో పాటు స్క్రిప్ట్ లోని లోపాలు కూడా సర్దుబాటు అవుతాయి. కానీ ఆ సమయంలో తమ విజన్ ను అడ్డుకుంటున్నారని భావించే కొందరు కుర్ర దర్శకులు, ఎలాగోలా రాజీపడి పని పూర్తి చేస్తారు. తీరా ఆ చిత్రం హిట్ అవ్వగానే, ఆ క్రెడిట్ మొత్తం తమ ఒక్కరిదే అన్నట్లుగా ఫీల్ అవుతుంటారు.
ఇక ఆ 'హిట్ పవర్' తో రెండో సినిమా మొదలుపెట్టేసరికి మొత్తం సీన్ రివర్స్ అవుతోంది. తమ మాటే శాసనం అన్నట్లుగా వ్యవహరిస్తూ నిర్మాతలు, హీరోలను పూర్తిగా తమ కంట్రోల్ లోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా అనుభవంతో చిన్న కరెక్షన్ చెప్పినా అస్సలు ఒప్పుకోకపోవడం, ఈగోలకు పోయి సెట్స్ లో గొడవలు పడటం ఎక్కువైంది. మార్కెట్ లో క్రేజ్ ఉండటంతో నిర్మాతలు కూడా ఏమీ అనలేక వాళ్లు అడిగినంత బడ్జెట్ ఇస్తూ సైలెంట్ గా భరిస్తున్నారు.
క్రియేటివ్ ఫ్రీడమ్ ఉండటం మంచిదే అయినా, గ్రౌండ్ రియాలిటీని మర్చిపోవడం వల్ల కంటెంట్ దెబ్బతింటోందనే కామెంట్స్ వస్తున్నాయి. మొదటి సినిమాకు ఉన్న శ్రద్ధ రెండో ప్రాజెక్ట్ లో మిస్ అవుతోంది. ఎడిటింగ్ టేబుల్ దగ్గర కత్తెరకు పని చెప్పకపోవడం, కథలో డెప్త్ కంటే లేనిపోని స్టైలింగ్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల సెకండ్ మూవీ విమర్శల బారిన పడుతున్నారు. సరైన చెక్ అండ్ బ్యాలెన్స్ లేకపోవడమే ఇక్కడ బలహీనతగా మారుతోంది.
తీరా రిలీజ్ రోజు బాక్సాఫీస్ దగ్గర బొమ్మ తేడా కొట్టినప్పుడు కానీ అసలు నిజం బయటపడటం లేదు. రెండో సినిమా ఫలితం బెడిసికొట్టగానే ఆ నెగెటివిటీ డైరెక్టర్ మీదే పడుతోంది. అప్పటివరకు నెత్తిన పెట్టుకున్న మార్కెట్ కూడా ఒక్క ఫ్లాప్ తో పక్కన పెట్టేస్తుంది. భారీ బడ్జెట్లు పెట్టి నిర్మాతలు నష్టపోతుంటే, హీరోల కెరీర్ గ్రాఫ్ కు బ్రేకులు పడుతున్నాయి. మాట వినని మొండితనం చివరకు ప్రాజెక్ట్ ను ఎలా ముంచుతుందో రీసెంట్ గా కొన్ని ఫలితాలు ప్రూవ్ చేశాయి.
ఇండస్ట్రీలో లాంగ్ రన్ ఉండాలంటే కేవలం ఒక హిట్ సరిపోదు, ఇతరులతో కలిసి పనిచేసే తత్వం కూడా అంతే ముఖ్యం. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నుంచి రాజమౌళి వరకు అందరూ నిర్మాతల శ్రేయస్సును చూసుకుంటూ ఎదిగినవారే. ఆ విచక్షణ లేకుండా రెండో సినిమాకే ఆకాశంలో విహరిస్తే కింద పడటం ఖాయమనే కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పటికైనా మన కుర్ర మేకర్స్ ఈ వాస్తవాన్ని గుర్తించి, అనవసరమైన ఈగోలను పక్కనపెట్టి ప్రయాణం చేస్తారో లేదో చూడాలి.