ఒక్క నిర్ణయంతో మారనున్న నెల్సన్ కెరీర్! ముందెవ‌రు?

ప్రస్తుతం అందరి దృష్టి ఎన్టీఆర్ ఫ్యూచ‌ర్ ప్లానింగ్ పైనే ఉంది. డ్రాగన్ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఏ ప్రాజెక్ట్‌ను ముందుగా ప్రారంభిస్తారనే విషయంపై ఇంకా అఫీషియ‌ల్ గా ఎలాంటి క్లారిటీ లేదు.

Update: 2026-06-11 06:33 GMT

డైరెక్ట‌ర్ నెల్సన్ దిలీప్‌కుమార్ ప్రస్తుతం జైలర్ 2 పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ, అత‌ని నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏమిటనే అంశం దక్షిణాది సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా ఒకవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో సినిమా చేసే అవకాశం ఉండగా, మరోవైపు సూపర్ స్టార్ రజనీకాంత్, లోక‌నాయ‌కుడు కమల్ హాసన్‌లను ఒకే తెరపైకి తీసుకురావాలనే ప్రతిష్టాత్మక మల్టీస్టారర్ ప్రాజెక్ట్ కూడా నెల్సన్ ముందున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం అందరి దృష్టి ఎన్టీఆర్ ఫ్యూచ‌ర్ ప్లానింగ్ పైనే ఉంది. డ్రాగన్ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఏ ప్రాజెక్ట్‌ను ముందుగా ప్రారంభిస్తారనే విషయంపై ఇంకా అఫీషియ‌ల్ గా ఎలాంటి క్లారిటీ లేదు. అయితే ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, డైరెక్ట‌ర్ త్రివిక్రమ్‌తో చేయాల్సిన ప్రాజెక్ట్‌కు ఎన్టీఆర్ ప్రాధాన్యత ఇవ్వవచ్చనే చర్చ నడుస్తోంది. అదే జరిగితే నెల్సన్‌తో అనుకున్న సినిమా మరింత ఆలస్య‌మ‌య్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సిట్యుయేష‌న్ నెల్సన్‌కు కూడా ఒక కీలక మలుపుగా మారింది. ఒకవైపు తెలుగు మార్కెట్‌లో ఎన్టీఆర్‌తో పాన్ ఇండియా స్థాయి సినిమా తెరకెక్కించే అవకాశం, మరోవైపు తమిళ సినీ చరిత్రలోనే అత్యంత క్రేజీ కాంబినేషన్లలో ఒకటిగా చెప్పబడుతున్న రజనీకాంత్- కమల్ హాసన్ మల్టీస్టారర్‌ను డైరెక్ట్ చేసే అవకాశం ఆయన ముందున్నాయి. ఈ రెండు ప్రాజెక్టుల్లో ఏదో ఒకదాన్ని ముందుగా ఎంచుకోవాల్సిన పరిస్థితి నెల్సన్‌కు ఎదురవుతోంది.

సినీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, రజనీకాంత్ మరియు కమల్ హాసన్ కలిసి నటించే సినిమా వాస్తవ రూపం దాల్చితే అది కోలీవుడ్‌కే కాకుండా భారతీయ సినీ రంగానికే ఒక ప్రత్యేక ఈవెంట్‌గా మారే అవకాశం ఉంది. అలాంటి అవకాశాన్ని వదులుకోవడం ఏ డైరెక్ట‌ర్ అయినా అంత ఈజీ కాదు. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్‌కు పాన్ ఇండియా స్థాయిలో భారీ మార్కెట్, అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రత్యేక గుర్తింపు వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ దృష్టిలో మాత్రం ఈ పరిణామాలు కొంత ఆందోళన కలిగించే అంశాలుగా మారుతున్నాయి. ఇప్పటికే డ్రాగన్ కోసం సమయం కేటాయించిన ఎన్టీఆర్, ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమాను ప్రారంభిస్తే నెల్సన్ ప్రాజెక్ట్ షెడ్యూల్ మరింత వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. ఇదే సమయంలో నెల్సన్ కూడా రజనీ- కమల్ మల్టీస్టారర్‌ను ముందుగా పూర్తి చేయాలని నిర్ణయిస్తే, ఎన్టీఆర్- నెల్సన్ కాంబినేషన్ ప్రేక్షకుల ముందుకు రావడానికి మరికొన్ని సంవత్సరాలు పట్టే పరిస్థితి ఏర్పడవచ్చు.

వీట‌న్నింటినీ బ‌ట్టి చూసుకుంటే ఎన్టీఆర్- నెల్సన్ సినిమా 2028లోనే సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ రెండు భారీ ప్రాజెక్టులు ఒకేసారి నెల్సన్ ముందుకు రావడం వల్ల షెడ్యూలింగ్ పరంగా సంక్లిష్ట పరిస్థితి ఏర్పడిన విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు జైలర్2 ఫలితం కూడా ఈ నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశముంది. ఆ సినిమా అంచనాలకు తగ్గట్టుగా భారీ విజయాన్ని అందుకుంటే నెల్సన్ మార్కెట్ విలువ మరింత పెరిగే అవకాశ‌ముంది. అప్పుడు ఆయన ఎంచుకునే త‌ర్వాతి ప్రాజెక్ట్‌పై కూడా స్టార్ హీరోలు, నిర్మాతలు మరింత ఆసక్తి చూపే పరిస్థితి ఉంటుంది. ఈ సస్పెన్స్‌కు ముగింపు పలకాల్సింది మాత్రం నెల్సన్ మరియు ఎన్టీఆర్ తీసుకునే ఆఖ‌రి నిర్ణ‌య‌మే అవుతుంది.

Tags:    

Similar News