హైదరాబాద్‌.. ఫహాద్‌కు మాత్రం ఇల్లులా..

‘బెత్లెహెం కుడుంబ యూనిట్’ తెలుగు రిలీజ్ ఈవెంట్‌లో నివిన్ పాలీ, ఫహాద్ ఫాజిల్ తమ హైదరాబాద్ కనెక్షన్ గురించి మాట్లాడారు.

Update: 2026-09-02 04:35 GMT

‘బెత్లెహెం కుడుంబ యూనిట్’ తెలుగు రిలీజ్ ఈవెంట్‌లో నివిన్ పాలీ, ఫహాద్ ఫాజిల్ తమ హైదరాబాద్ కనెక్షన్ గురించి మాట్లాడారు. నివిన్‌కు ఒక సినిమా కోసం హైదరాబాద్‌లో పాల్గొన్న మొదటి ఈవెంట్ ఇదేనట. ఇంతకుముందు ఫిల్మ్ ఫేర్, సైమా లాంటి అవార్డు వేడుకలకు వచ్చానని, కానీ తన సినిమా ఈవెంట్ కోసం రావడం ఇదే తొలిసారి అని చెప్పారు. పైగా తెలుగులో విడుదలవుతున్న తన మొదటి సినిమా కూడా ఇదేనని, అందుకే ఈ రోజు తనకు స్పెషల్ అని అన్నారు.

‘బెత్లెహెం కుడుంబ యూనిట్’ గురించి మాట్లాడుతూ ఇదొక సింపుల్ ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ అని నివిన్ చెప్పారు. మలయాళంలో సినిమా బాగా ఆడుతోందని, తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నానన్నారు. తనకు ఇంగ్లీష్‌లో ఎక్కువ మాట్లాడటం రాదని చెప్పి స్పీచ్ ఆపేస్తానంటూ నవ్వించారు. తర్వాత మలయాళంలో మాట్లాడి, అక్కడున్న మలయాళ ప్రేక్షకులను పలకరించారు. ఇప్పటికే మలయాళంలో చూసిన వాళ్లు తెలుగు వెర్షన్‌ను కూడా చూడాలని కోరారు.

యాంకర్ “పార్టీ లేదా ఫహాద్?” అని అడిగినప్పుడు నివిన్ మరోసారి ఫన్నీగా స్పందించారు. ఈరోజు ఫహాద్ ఇవ్వబోయే పార్టీకి మీడియా వాళ్లందరినీ కూడా ఆహ్వానిస్తున్నానని అన్నారు. చివర్లో ఒక డైలాగ్ చెప్పమని అడగ్గా “యాక్టింగ్, సింపుల్ యాక్టింగ్.. ఆరెంజ్ మ్యాంగో బత్తాయి” అని ఓ డైలాగ్ చెప్పారు. వెంటనే “ఇప్పుడు నా మీద కచ్చితంగా ట్రోల్స్ వేస్తారు చూడండి” అంటూ తనే నవ్వేశారు.

ఫహాద్ ఫాజిల్ స్పీచ్ మాత్రం చాలా సరదాగా సాగింది. ఈ మధ్య తాను హైదరాబాద్‌కు చాలా తరచుగా వస్తున్నానని చెప్పారు. ఇప్పుడు ఈ నగరం తనకు ఒక ఇల్లులా మారిపోయిందన్నారు. ఇక్కడ ఎంతోమంది మంచి వ్యక్తులను కలిశానని, మంచి స్నేహితులు దొరికారని చెప్పారు. హైదరాబాద్‌లో అద్భుతమైన ఫుడ్ కూడా తిన్నానని తన అనుభవాన్ని పంచుకున్నారు.

అదే సమయంలో తన తర్వాతి తెలుగు సినిమా గురించి కూడా ఫహాద్ స్టేజ్ మీదే గుర్తు చేశారు. అక్టోబర్ 2న ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ విడుదలవుతోందని చెప్పారు. ఆ సినిమా సమయంలో మళ్లీ కలుద్దామని ప్రేక్షకులకు తెలిపారు. శశాంక్ యేలేటి దర్శకత్వంలో వస్తున్న ఈ ఫాంటసీ ఎంటర్‌టైనర్‌లో ఫహాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆర్కా మీడియా వర్క్స్, ఎస్.ఎస్. కార్తికేయ షోయింగ్ బిజినెస్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇక ‘బెత్లెహెం కుడుంబ యూనిట్’ తెలుగు వెర్షన్ సెప్టెంబర్ 4న థియేటర్లలోకి రానుంది. మలయాళంలో ఆగస్టు 21న విడుదలైన ఈ సినిమాలో నివిన్ పాలీ, మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటించారు. గిరీష్ ఏడీ దర్శకత్వం వహించారు.

Tags:    

Similar News