టాలీవుడ్ 'ఏటీఎమ్'కి తాళం పడింది.. ఇకపై ఆ ఆటలు సాగవు!
థియేటర్లో జనం రాకపోయినా, డిజిటల్ రైట్స్ రూపంలో పెట్టిన పెట్టుబడి వచ్చేస్తుంది అనే ధైర్యం వారిలో నిర్లక్ష్యాన్ని పెంచింది. కానీ, ఇప్పుడు ఆ ఫ్రీ పాస్ కాలం చెల్లిపోయింది.;
గత కొన్నేళ్లుగా మన నిర్మాతలు ఒక భ్రమలో బతికారు. సినిమా ఎలా ఉన్నా పర్లేదు, ఓటీటీ అనే "ఏటీఎమ్" ఉంది కదా, అందులోంచి డబ్బులు డ్రా చేసుకోవచ్చు అనుకున్నారు. థియేటర్లో జనం రాకపోయినా, డిజిటల్ రైట్స్ రూపంలో పెట్టిన పెట్టుబడి వచ్చేస్తుంది అనే ధైర్యం వారిలో నిర్లక్ష్యాన్ని పెంచింది. కానీ, ఇప్పుడు ఆ ఫ్రీ పాస్ కాలం చెల్లిపోయింది. దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్ తీసుకున్న తాజా నిర్ణయం, టాలీవుడ్ లోని స్టార్ డమ్ వ్యవస్థకు గట్టి షాక్ ఇచ్చింది.
ఇన్నాళ్లూ మన దగ్గర బిజినెస్ ఎలా జరిగేది? హీరో ఎవరు? కాంబినేషన్ ఏంటి? అనే దాన్ని బట్టే రేట్లు ఉండేవి. కంటెంట్ సెకండరీ. కానీ నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు ఆ పాత ఫార్ములాని చెత్తబుట్టలో పడేసింది. హైదరాబాద్ లో ఆఫీస్ పెట్టింది మన స్టార్ల సినిమాలను గుడ్డిగా కొనడానికి కాదు, మన నేల మీద ఉన్న లోకల్ టాలెంట్ తో అద్భుతమైన ఒరిజినల్ కంటెంట్ సృష్టించడానికి. అంటే, వందల కోట్లు పెట్టి స్టార్ సినిమా కొనే బదులు, పది కోట్లతో అద్భుతమైన వెబ్ సిరీస్ లు, చిన్న సినిమాలు తీయడమే వాళ్ళ కొత్త ఎజెండా.
ఈ మార్పు ఎందుకు వచ్చిందంటే.. మన వాళ్ళు అమ్మిన చాలా పెద్ద సినిమాలు ఓటీటీలో అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. వ్యూవర్షిప్ రాలేదు. దీంతో ఓటీటీ సంస్థలు రియలైజ్ అయ్యాయి. స్టార్ ఇమేజ్ కేవలం పోస్టర్ కి పనికొస్తుంది తప్ప, స్ట్రీమింగ్ కి కాదని గ్రహించాయి. అందుకే ఇప్పుడు మందు కథ చెప్పండి, నచ్చితేనే కొంటాం.. అని కండిషన్ పెడుతున్నాయి. లేదంటే సినిమా రిలీజ్ అయ్యాక, ఆడియన్స్ ఇచ్చే రివ్యూలను బట్టి రేటు ఫిక్స్ చేస్తామని తెగేసి చెబుతున్నాయి.
దీనివల్ల జరగబోయే అతిపెద్ద మార్పు ఏంటంటే.. హీరోల పారితోషికాల పతనం. ఇన్నాళ్లూ ఓటీటీ నుంచి వచ్చే డబ్బుని చూసుకుని హీరోలు తమ రెమ్యునరేషన్ ను ఇష్టారాజ్యంగా పెంచేశారు. ఇప్పుడు ఆ ఆదాయం ఆగిపోతే, కచ్చితంగా బడ్జెట్ తగ్గించాల్సిందే. ఇకపై నిర్మాత బతకాలంటే సినిమా థియేటర్లో ఆడాల్సిందే. థియేటర్లో ఆడాలంటే కథలో దమ్ముండాల్సిందే.
ఇప్పటికే ఈటీవీ విన్ లాంటి ప్లాట్‌ఫామ్స్ లోకల్ కంటెంట్ తో మ్యాజిక్ చేస్తున్నాయి. చిన్న బడ్జెట్ తో తీసిన 'లిటిల్ హార్ట్స్' లాంటివి పెద్ద విజయాలు సాధిస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్ కూడా అదే బాటలో నడిస్తే, కొత్త దర్శకులకు, రచయితలకు స్వర్ణయుగం వచ్చినట్లే. ప్యాకేజింగ్ స్టార్ల కంటే, ప్యాషన్ ఉన్న మేకర్స్ కే ఇకపై డిమాండ్ ఉంటుంది. ఏదేమైనా సినిమా ఇండస్ట్రీకి ఇది ఒక కరెక్షన్ టైమ్. ఓటీటీలు గుడ్డిగా డబ్బులు ఇస్తున్నంత కాలం నాణ్యత పడిపోయింది. ఇప్పుడు అవి స్ట్రిక్ట్ అయ్యాయి కాబట్టి, మళ్ళీ క్వాలిటీ సినిమా రోజులు వస్తాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.