బాలయ్య కోసం హిందీ బ్యూటీ.. మరిన్ని ఛాన్సులు పక్కానా?
తాజాగా ఆ సినిమాకు సంబంధించిన స్పెషల్ సాంగ్ వార్త ఇప్పుడు నందమూరి అభిమానుల్లో మరింత హైప్ పెంచుతోంది.;
నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ NBK111పై ఇప్పటికే ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వీర సింహారెడ్డి తర్వాత ఆ ఇద్దరి కాంబో మళ్లీ రిపీట్ అవుతుండటంతో ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఆ సినిమాకు సంబంధించిన స్పెషల్ సాంగ్ వార్త ఇప్పుడు నందమూరి అభిమానుల్లో మరింత హైప్ పెంచుతోంది.
చిత్రంలో ఓ మాస్ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీని తీసుకున్నట్లు సమాచారం. రాక్ స్టార్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నర్గీస్, ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీలో కూడా కనిపించారు. ఇప్పుడు బాలయ్య సరసన ఐటెం సాంగ్ చేయడానికి సిద్ధమవడం ఆసక్తికరంగా మారింది. సమాచారం ప్రకారం, ఆ స్పెషల్ సాంగ్ షూటింగ్ ను హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్ లో మే 8 నుంచి ప్రారంభించనున్నారట.
బాలయ్య మాస్ స్టెప్పులు, నర్గీస్ ఫక్రీ గ్లామర్ కలిస్తే ఆ పాట థియేటర్లలో అభిమానులకు పూనకాలు తెప్పించడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా బాలకృష్ణ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కు ఎప్పుడూ ప్రత్యేకమైన క్రేజ్ ఉండటంతో ఆ పాటపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దర్శకుడు గోపీచంద్ మలినేని గతంలో వీరసింహారెడ్డిలో కూడా ప్రత్యేక పాటను గ్రాండ్ గా తెరకెక్కించి ఆకట్టుకున్నారు.
ఈసారి మరింత స్టైలిష్ గా, మాస్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ సాంగ్ ను డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సంగీత దర్శకుడు తమన్ పాటకు హై ఎనర్జీ బీట్ సిద్ధం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక హీరోయిన్ విషయంలో కూడా పలు మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. మొదట ఆ చిత్రంలో హీరోయిన్ గా నయనతారను అధికారికంగా ప్రకటించారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ కు మంచి స్పందన వచ్చింది.
అయితే డేట్స్ సమస్యలు, రెమ్యునరేషన్, ప్రమోషన్స్ కు సంబంధించిన కొన్ని అంశాల కారణంగా ఆమె ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు, దీంతో మేకర్స్ వెంటనే టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ను ఫైనల్ చేసినట్లు సమాచారం. గతంలో బాలయ్యతో కలిసి భగవంత్ కేసరిలో నటించిన కాజల్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఆ జోడీని మళ్లీ రిపీట్ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో బాలయ్య, కాజల్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ కొనసాగుతున్నట్లు సమాచారం.
ఇక సినిమా విషయానికొస్తే.. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట్ సతీష్ కిలారు భారీ బడ్జెట్ తో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యాక్షన్, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్ తో రూపొందుతున్న ఆ సినిమా వచ్చే ఏడాది భారీ స్థాయిలో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక నర్గీస్ ఫక్రీ.. బాలయ్య మూవీలోని స్పెషల్ సాంగ్ తర్వాత టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు అందుకుంటుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.