100 రోజులు ఆడిన మొదటి సినిమా ఈ హీరోదే..అక్కడే ఆ ట్రెండ్ మొదలైందా?
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస హిట్లతో దూసుకుపోతున్నారు.
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. రీసెంట్‌గా ‘అఖండ 2’తో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారాయన. అయితే బాలయ్య కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచిన ఒక సినిమా, సౌత్ ఇండియాలోనే సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. టాలీవుడ్ చరిత్రలోనే ఏకంగా 100 కేంద్రాలలో 100 రోజులు ఆడిన మొదటి సినిమాగా రికార్డు సృష్టించింది. ఆ సినిమా వెనుక ఉన్న క్రేజీ విశేషాలు మీకోసం..
చరిత్ర సృష్టించిన ‘నరసింహ నాయుడు’:
2001 సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన ‘నరసింహ నాయుడు’ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. అప్పట్లో కేవలం 6 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, ఏకంగా 25 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. ఇక తెలుగు సినిమా హిస్టరీలో 25 కోట్ల క్లబ్‌లో చేరిన మొదటి సినిమా ఇదే కావడం విశేషం. అంతేకాదు, సౌత్ ఇండియాలోనే 100 కేంద్రాలలో విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకున్న తొలి చిత్రంగా ఇండస్ట్రీ హిట్ కొట్టింది.
కంటి చూపుతో చంపేస్తా.. డైలాగ్ సీక్రెట్:
ఈ సినిమాకు పరుచూరి గోపాలకృష్ణ రాసిన డైలాగులు థియేటర్లలో ఈలలు వేయించాయి. షూటింగ్ చివర్లో ఒక డైలాగ్ సీన్‌ను మరింత పవర్‌ఫుల్‌గా మార్చడానికి, ఆయన లెజెండ్రీ నటుడు ఎన్టీ రామారావు గారిని ఊహించుకుని ఒక లైన్ రాశారు. అదే.. “కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా” అనే పవర్‌ఫుల్ డైలాగ్. ఈ డైలాగ్ విన్న వెంటనే కథా రచయిత చిన్నికృష్ణ, ఈ సినిమా 200 రోజులు కాదు ఏకంగా 300 రోజులు ఆడుతుందని అప్పుడే జోస్యం చెప్పారు.
ఎడిటింగ్‌లో మారిన ఇంటర్వెల్ సీన్:
ఈ సినిమా ఎడిటింగ్ సమయంలో మేకర్స్‌కు ఒక పెద్ద టాస్క్ ఎదురైంది. మొత్తం ఫుటేజ్ చూసుకుంటే ఏకంగా 17,000 అడుగుల లెంగ్త్ వచ్చింది. దీంతో నిడివిని తగ్గించడం కోసం మొదటి సగంలో చాలా సీన్లను కత్తిరించాల్సి వచ్చింది. నిజానికి మొదట 30 టాటా సుమోలతో వచ్చే రైల్వే స్టేషన్ ఫైట్ సీన్‌ను ఇంటర్వెల్‌గా అనుకున్నారు. కానీ సీన్లు కట్ అవ్వడంతో, చివరికి బాలకృష్ణ-సిమ్రాన్ పెళ్లి సీన్‌ను ఇంటర్వెల్ పాయింట్‌గా లాక్ చేశారు.
బాలయ్య నమ్మకం.. తొలి నంది అవార్డు:
సినిమా రిలీజ్‌కు రెండు వారాల ముందే బాలకృష్ణ ఎంతో కాన్ఫిడెంట్‌గా వరుస ఇంటర్వ్యూలు ఇచ్చారు. “ఎప్పుడెప్పుడు జనవరి 11 వస్తుందా, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అని అందరు అంటారా అని వెయిట్ చేస్తున్నా” అని ఆయన నమ్మకంగా చెప్పారు. ఆయన నమ్మినట్టే.. అదే రోజు పోటీగా వచ్చిన మృగరాజు, దేవి పుత్రుడు సినిమాలను వెనక్కి నెట్టి నరసింహ నాయుడు సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. ఈ సినిమాలో అద్భుత నటనకు గానూ బాలకృష్ణకు కెరీర్‌లో మొదటిసారి ‘ఉత్తమ నటుడు’గా నంది అవార్డు కూడా దక్కింది.
అప్పట్లో 100 సెంటర్లలో 100 రోజులు ఆడడం అనేది ఒక అసాధ్యమైన రికార్డ్. అలాంటి హిస్టారికల్ ట్రెండ్‌ను బాలకృష్ణ ‘నరసింహ నాయుడు’ సినిమాతోనే మొదలుపెట్టారు. ఇక అప్పట్లో క్రియేట్ చేసిన ఆ మాస్ మేనియానే, నేటికీ బాలయ్యను బాక్సాఫీస్ దగ్గర అన్‌స్టాపబుల్ కింగ్‌గా నిలబెట్టిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు!