నాగవంశీ మళ్లీ రిస్క్ చేయనున్నారా?
జులై 10న అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన లెనిన్ విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు అశోక్ గల్లా లీడ్ రోల్ లో రూపొందుతున్న వీసా జులై 31న ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్సులు కనిపిస్తున్నాయి.
సినిమా నిర్మాణంలో కంటెంట్ ఎంత ముఖ్యమో.. రిలీజ్ ప్లానింగ్ కూడా అంతే కీలకం. ముఖ్యంగా ఒకే బ్యానర్ నుంచి తక్కువ గ్యాప్ లో రెండు సినిమాలు వస్తే.. వాటి మధ్య పోటీ, ప్రమోషన్లు, థియేటర్ల డిస్ట్రిబ్యూషన్ వంటి అంశాలు చర్చకు వస్తాయి. ఇప్పుడు సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ అలాంటి సాహసానికే సిద్ధమవుతున్నారని టాక్ వినిపిస్తోంది.
జులై 10న అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన లెనిన్ విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు అశోక్ గల్లా లీడ్ రోల్ లో రూపొందుతున్న వీసా జులై 31న ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్సులు కనిపిస్తున్నాయి. అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ.. ఆ రెండు సినిమాలు ఒకే నెలలో విడుదలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అదే జరిగితే సితారకు ఇది మరో ఆసక్తికరమైన పరీక్షగా మారనుంది. అయితే ఆ రెండు సినిమాలకూ ప్రత్యేకత ఉంది.
అఖిల్ కు లెనిన్ చాలా కీలకం. వరుస ఫ్లాపుల తర్వాత ఆ చిత్రంపై ఆయన భారీ ఆశలు పెట్టుకున్నారు. రాయలసీమ నేపథ్యంలో యాక్షన్, ఎమోషన్, ప్రేమకథతో పాటు పీరియాడిక్ ఎలిమెంట్స్ కలిపి రూపొందించిన ఆ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. మరోవైపు అశోక్ గల్లా వీసా.. అమెరికాలో చదువుకునే భారతీయ విద్యార్థుల జీవితాలు, ప్రేమ, ఎమోషన్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఆ చిత్రం యువతను లక్ష్యంగా చేసుకుని రూపొందింది.
దీంతో రెండు సినిమాలను ఒకే నెలలో విడుదల చేయడం నాగవంశీది ధైర్యమైన నిర్ణయమే. ఒక సినిమా ప్రమోషన్లు జోరుగా సాగుతుండగా మరో సినిమా ప్రచారం మొదలవుతుంది. ఒకటి ఆశించిన స్థాయిలో ఆడకపోతే మరో సినిమాపైనా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అదే సమయంలో రెండు సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తే మాత్రం నిర్మాతకు డబుల్ సక్సెస్ దక్కినట్లే. అయితే నాగవంశీకి ఇలాంటి పరిస్థితులు పూర్తిగా కొత్తవి కావు.
గతంలో కూడా తక్కువ గ్యాప్ లో సినిమాలను విడుదల చేసిన అనుభవం ఆయనకు ఉంది. 2022లో రెండు వారాల గ్యాప్ లో వచ్చిన డీజే టిల్లు, భీమ్లా నాయక్ మంచి ఫలితాలను అందుకున్నాయి. అలాగే 2023 అక్టోబర్ లో కూడా వరుసగా విడుదలైన చిత్రాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. అందుకే రిలీజ్ ప్లానింగ్ విషయంలో ఆయనకు లెక్కలు వేరేగా ఉంటాయని ఇండస్ట్రీలో చెప్పుకుంటుంటారు.
అయితే ఈసారి పరిస్థితులు కొంత భిన్నంగా ఉన్నాయి. ఆ రెండు సినిమాలు కూడా కొత్త ఊపు కోసం ఎదురుచూస్తున్న యువ హీరోలవి. అందుకే ఒక్కో సినిమా రిజల్ట్ హీరోల ఫ్యూచర్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ఒకే నెలలో రెండు సినిమాలు విడుదల చేయాలనే ధైర్యానికి బాక్సాఫీస్ కూడా తోడైతే ఆ ప్లాన్ సక్సెస్ అయినట్లవుతుంది. ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే. నాగవంశీ రిలీజ్ ప్లాన్ ఈసారి సక్సెస్ అవుతుందా? లేక ఒకే నెలలో రెండు సినిమాలు విడుదల చేయడం రిస్క్ గా మారుతుందా? అనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే వేచి చూడాలి.