గోల్డెన్ స్పూన్- డైమండ్ స్పూన్ ఇండస్ట్రీలో పని చేయవు.. నిర్మాత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

టాలీవుడ్‌లో నెపోటిజం (వారసత్వం) అనే అంశంపై ఎప్పుడూ ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది.

Update: 2026-07-07 04:36 GMT

టాలీవుడ్‌లో నెపోటిజం (వారసత్వం) అనే అంశంపై ఎప్పుడూ ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ అధినేత, ప్రముఖ నిర్మాత వై. రవిశంకర్ ఈ విషయంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. `రాజా ది రాజా` సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో సినిమా హీరో `రిత్విక్`ను ఉద్దేశించి ర‌విశంక‌ర్ మాట్లాడిన మాటలు, ఇండస్ట్రీలోని ప్రాక్టికల్ పరిస్థితులను కళ్లకు కట్టేలా ఉన్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

మైత్రి రవిశంకర్ మాట్లాడుతూ.. బ్యాక్‌గ్రౌండ్ ఉంటే ఇండస్ట్రీలో రాణించడం సులువు అనే అపోహను పూర్తిగా కొట్టిపారేశారు. అందరూ గోల్డెన్ స్పూన్, గోల్డెన్ స్పూన్ తో పుట్టార‌ని అనుకుంటారు. రిత్విక్, డోంట్ గెట్ క్యారీడ్ అవే. గోల్డెన్ స్పూన్, డైమండ్ స్పూన్ ఇక్కడ ఇండస్ట్రీలో ఏమీ పని చేయవు! అంటూ ర‌విశంక‌ర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా పరిశ్రమలో ఎంతటి ధనికులైనా లేదా సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా.. కేవలం ప్రతిభ మాత్రమే ఒక నటుడిని ఇక్కడ నిలబెడుతుందని ఆయన రిత్విక్‌కు స్పష్టం చేశారు.

నటుడిగా ఎదగడానికి మనలో ఎలాంటి కసి ఉండాలో చెబుతూ రవిశంకర్ ఒక అద్భుతమైన సలహా ఇచ్చారు. ``అదంతా డాడీ అలా చెప్పి.. అదంతా అక్కకి ఇచ్చేశారు.. మాకేం లేదు అనుకో నువ్వు. అప్పుడు చాలా కసి వస్తుంది..నువ్వు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతావు`` అని పేర్కొన్నారు. అంటే.. మనకు వెనక ఏ ఆసరా లేదు, మనల్ని మనం నిరూపించుకోవాలి అనే తపన ఉన్నప్పుడే నటుడిగా అద్భుతమైన విజయాలు సాధించవచ్చని ఆయన స్ఫూర్తిదాయకంగా వివరించారు. అదే సమయంలో అక్క అండ‌ ఉందంటే ఎలా ఎద‌గాలో నీకు తెలుసు..! అంటూ వారి మధ్య ఉన్న కుటుంబ బంధాన్ని గుర్తుచేస్తూ సరదాగా వ్యాఖ్యానం ముగించారు.

వాస్తవానికి ఈ రోజుల్లో అక్కినేని వంశం నుంచి వచ్చినా.. మెగా కుటుంబం నుంచి వచ్చినా.. నందమూరి వంశం నుంచి వచ్చినా ఇండస్ట్రీలో సక్సెస్ దక్కాలంటే ఎంతగా శ్రమించాల్సి ఉంటుందో మనం చూస్తూనే ఉన్నాం. అటు బాలీవుడ్ లోనూ ఖాన్ ల నటవారసులు సైతం ఎదగడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నటనా సామర్థ్యం అనేది ఒక వరం.. అది అందరికీ వచ్చేది కాదు.. కేవలం కొందరికే కుదిరేది అని కాలం నిరూపిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో నవతరం నటుడు రిత్విక్ కూడా తనను తాను నిరూపించుకునేందుకు చాలా శ్రమించాల్సి ఉంటుంది.

అయితే ఈ ప్రయాణంలో రిత్విక్ సోదరి నిహారిక ఎప్పుడూ అతడికి అండగా నిలబడటం విశేషం. ఈ ట్రైలర్ లాంచ్ వేడుకలో యాక్టర్ రిత్విక్ కాస్త ఎమోషనల్ అయినప్పుడు నిహారిక అతడికి సపోర్ట్‌గా నిలిచింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు సైతం ``ప్రతి బ్రదర్ కి ఇలాంటి ఒక సిస్టర్ ఉండాలి`` అంటూ కామెంట్లు పెడుతున్నారు. అక్క అండగా ఉండటం రిత్విక్ అదృష్టమని.. నిర్మాత రవిశంకర్ ఇచ్చిన హితబోధతో రిత్విక్ తన కెరీర్‌లో కసితో ముందుకు సాగుతాడని ఆశిద్దాం. రాజా ది రాజా ట్రైల‌ర్ లో రిత్విక్ ఎన‌ర్జీ ఆక‌ట్టుకుంది. సినిమా విజ‌యం సాధించాలని ఆకాంక్షిద్దాం.

Tags:    

Similar News