మైత్రీ వేగాన్ని తట్టుకోవడం కష్టమే..!
ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ చేతిలో పలు సినిమాలున్నాయి. ఇంకా చెప్పాలంటే టాలీవుడ్ లోని స్టార్ హీరోలతో పలు సినిమాలను మైత్రీ నిర్మాతలు లైన్ లో పెట్టారు.;
టాలీవుడ్ లోని అగ్ర నిర్మాణ సంస్థల్లో మైత్రీ మూవీ మేకర్స్ ఒకటి. శ్రీమంతుడు సినిమాతో మొదలైన ఈ బ్యానర్ జర్నీ ఆ తర్వాత వరుస పెట్టి విజయాలను అందుకుంది. గొప్ప గొప్ప సినిమాలను తీస్తూ తమ బ్యానర్ స్థాయిని పెంచుకుంటూ వెళ్తోంది మైత్రీ మూవీ మేకర్స్. ఈ బ్యానర్ లో ఫ్లాపు సినిమాలు వచ్చినా బ్యానర్ కు ఉన్న సక్సెస్ రేటు మాత్రం చాలా ఎక్కువ.
మైత్రీ బ్యానర్ లో ప్రభాస్ తో ఫౌజీ
ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ చేతిలో పలు సినిమాలున్నాయి. ఇంకా చెప్పాలంటే టాలీవుడ్ లోని స్టార్ హీరోలతో పలు సినిమాలను మైత్రీ నిర్మాతలు లైన్ లో పెట్టారు. అందులో ఒకటి ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ. ఈ కథ 1940 బ్యాక్ డ్రాప్ లో ఉండనుంది. సీతారామం సినిమా తర్వాత హను క్రేజ్ విపరీతంగా పెరిగిపోవడంతో పాటూ ఆ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తుండటంతో ఫౌజీపై అందరికీ భారీ అంచనాలున్నాయి.
ఫౌజీ 50% షూటింగ్ పూర్తి
ఈ నేపథ్యంలో ఎప్పుడెప్పుడు ఫౌజి వస్తుందా అని అందరూ ఎంతో వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఫౌజీ షూటింగ్ దాదాపు 50% పూర్తైందని, ప్రభాస్ కు సంబంధించిన మరో 30 రోజుల షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉందని, అది అయిపోతే ఆ తర్వాత ప్రభాస్ లేకుండా మిగిలిన వారితో ఇంకొంత భాగం షూటింగ్ ఉంటుందని తెలుస్తోంది. అంటే ఎంతలేదన్నా ఈ ఇయర్ ఎండింగ్ కు ఫౌజీ సినిమా ఓ కొలిక్కి వచ్చేస్తుందని అర్థమవుతుంది.
స్టార్ హీరోలతో జోరు
పెండింగ్ ఉన్న ఆ 30 రోజుల షూటింగ్ లోనే ప్రభాస్ పై ఓ భారీ యాక్షన్ సీన్ కూడా ఉందని, ఆ యాక్షన్ సీక్వెన్స్ సినిమా మొత్తానికే హైలైట్ కానుందని తెలుస్తోంది. ఓ వైపు ఫౌజీ షూటింగ్ ను సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లా ముందుకు తీసుకెళ్తున్న మైత్రీ మూవీ మేకర్స్ మరోవైపు ఎన్టీఆర్- నీల్ సినిమాను, ఇంకో వైపు పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్‌సింగ్ షూటింగ్ ను కూడా అదే వేగంతో పూర్తి చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే వచ్చే ఏడాది ఈ మూడు సినిమాలతో మైత్రీ రికార్డుల మోత మామూలుగా ఉండేలా లేదు.