రామ్ చరణ్‌తో గోల్డెన్ ఛాన్స్ అలా మిస్ చేసుకున్న నిర్మాత
తెలుగు చిత్రసీమలో కొత్త ప్రతిభను ప్రోత్సహించడంలో ఎం.ఎస్. రాజు ముందంజలో ఉంటారు. సుమంత్‌ను `ప్రేమకథ` చిత్రంతో హీరోగా పరిచయం చేసిన ఘనత ఆయనదే.
తెలుగు చిత్రసీమలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను వెండితెరకు పరిచయం చేసే గోల్డెన్ ఛాన్స్ దశాబ్ధాల క్రితం ప్రముఖ నిర్మాత వైజయంతీ మూవీస్ అశ్విని దత్‌కు దక్కిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవితో `జగదేకవీరుడు అతిలోకసుందరి` వంటి ఇండస్ట్రీ హిట్ సహా పలు బ్లాక్‌బస్టర్లను అందించిన ఈ బ్యానర్, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో `చిరుత` సినిమాతో చరణ్‌ను ఘనంగా ఇండస్ట్రీకి పరిచయం చేసింది. అయితే ఈ సంచలన డెబ్యూ ప్రాజెక్ట్ సీనియర్ ప్రొడ్యూసర్ ఎం.ఎస్. రాజుకు దక్కినా.. దానిని కథ- స్క్రిప్టు లేకపోవడం వల్ల అందుకోలేకపోయారు.
రామ్ చరణ్‌ను ఇండస్ట్రీకి లాంచ్ చేసే విషయంపై చిరంజీవి స్వయంగా ఎం.ఎస్. రాజును అడిగారని... కానీ సరైన కథ లేకపోవడంతో ఆ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందని ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ``అప్పట్లో చిరంజీవి గారే స్వయంగా నన్ను అడిగి చరణ్ ని నువ్వు ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది` అని చెప్పారు. కానీ ఆ సమయానికి నా దగ్గర సరిపడా కథ లేదు. ఏదో ఒక కథను బలవంతంగా వండి వార్చడం నా పాలసీ కాదు.. సహజంగా కథ పుట్టినప్పుడే సినిమా చేయడం నా పద్ధతి! అని ఎం.ఎస్. రాజు స్పష్టం చేశారు.
ఆ సమయంలో తీసుకున్న ఆ నిర్ణయం సరియైనదా లేక తప్పా అనేది ఇప్పటికీ తనకు తెలియదని.. అయితే ఆ కారణం వల్లే ఒక గొప్ప అవకాశాన్ని మిస్ అయ్యానని ఎం.ఎస్. రాజు అభిప్రాయపడ్డారు. కేవలం రామ్ చరణ్‌నే కాకుండా.. ఆ తర్వాత చిరంజీవితో కూడా ఒక సినిమా చేయాలని అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదని తెలిపారు. తను మంచి మేకర్ అనే నమ్మకంతోనే మెగాస్టార్ అంతటి ఆఫర్ ఇచ్చారని.. అంతేకానీ కేవలం ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనే కారణంతో సినిమాలు చేయలేమని ఆయన పేర్కొన్నారు.
తెలుగు చిత్రసీమలో కొత్త ప్రతిభను ప్రోత్సహించడంలో ఎం.ఎస్. రాజు ముందంజలో ఉంటారు. సుమంత్‌ను `ప్రేమకథ` చిత్రంతో హీరోగా పరిచయం చేసిన ఘనత ఆయనదే. అలాగే ప్రభాస్‌ను `వర్షం`తో, సిద్ధార్థ్‌ను `నువ్వొస్తానంటే నేనొద్దంటానా`తో టాలీవుడ్‌లో స్టార్స్‌గా నిలబెట్టింది కూడా ఆయన సినిమాలే. దర్శకుడిగా మారి `తూనీగ తూనీగ` సినిమా ద్వారా తన కుమారుడు సుమంత్ అశ్విన్‌ను హీరోగా పరిచయం చేశారు.
హీరోలతో పాటు పలువురు కథానాయికలు, నటీనటులకు కూడా ఎం.ఎస్. రాజు లైఫ్ ఇచ్చారు. `నువ్వొస్తానంటే నేనొద్దంటానా` చిత్రంతో త్రిషను టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా మార్చడమే కాకుండా, `మనసంతా నువ్వే` చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసిన హన్సికను `దేశముదురు` కంటే ముందే గుర్తించిన టాలెంట్ ఆయనది. అలాగే `డర్టీ హరి`, `30 రోజుల్లో ప్రేమించడం ఎలా` వంటి సినిమాల ద్వారా నూతన నటీనటులు, సాంకేతిక నిపుణులకు వరుస అవకాశాలు కల్పించి టాలెంట్ హంటర్‌గా పేరు తెచ్చుకున్నారు. నేటి జనరేషన్ స్టార్లు, సాంకేతిక నిపుణులను పరిచయం చేస్తూ ఇప్పటికీ ఆయన సినిమాలు నిర్మిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు.