ఫ్యాషన్‌కే కొత్త డెఫినిషన్.. మెట్ గాలాలో రక్తనాళాల డ్రెస్‌తో వైరల్ అయిన డిజైనర్

ఫ్యాషన్ ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మక వేదికగా గుర్తింపు పొందిన మెట్ గాలా మరోసారి ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకుంది.;

Update: 2026-05-07 07:47 GMT

ఫ్యాషన్ ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మక వేదికగా గుర్తింపు పొందిన మెట్ గాలా మరోసారి ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకుంది. ప్రతి ఏడాది మే నెలలో ది మెట్రోపాలిట‌న్ మ్యూజియమ్ ఆఫ్ ఆర్ట్, న్యూయార్క్ లో నిర్వహించే ఈ భారీ ఫ్యాషన్ ఈవెంట్ ఈసారి కూడా గ్లామర్, కళాత్మకత, వినూత్న ఆలోచనల సమ్మేళనంగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ డిజైనర్లు, మోడల్స్, హాలీవుడ్ సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, ఫ్యాషన్ ఐకాన్లు పాల్గొన్న ఈ వేడుకలో కొంద‌రు ఇండియ‌న్స్ కూడా పాల్గొన్నారు.

ఈ ఏడాది మెట్ గాలా థీమ్ కాస్ట్యూమ్ ఆర్ట్ కావడంతో ప్రతి సెలబ్రిటీ తనదైన కాన్సెప్ట్‌తో రెడ్ కార్పెట్‌పై అడుగుపెట్టారు. అయితే ఈసారి మెట్ గాలాలో అందరి దృష్టినీ పూర్తిగా తనవైపు తిప్పుకున్నది డిజైనర్ ఎడా సాన్సెల్ ఉస్తున్ రూపొందించిన వినూత్న క్రియేషన్. సాధారణ ఫ్యాషన్ డ్రెస్‌లకు పూర్తి భిన్నంగా, మానవ శరీరంలోని రక్తనాళ వ్యవస్థను ప్రత్యక్షంగా కనిపించేలా రూపొందించిన ఫ్యూచరిస్టిక్ డిజైన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శరీరంపై రక్తనాళాలు, నరాల నిర్మాణం కళాత్మకంగా ప్రవహిస్తున్నట్టుగా కనిపించే ఈ కాన్సెప్ట్ ఫ్యాషన్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఫ్యాషన్ అంటే కేవలం బ‌ట్ట‌లే కాదు, అది శరీరాన్నే జీవించే కళాఖండంగా మార్చే ప్రక్రియ అనే భావనను ఈ డిజైన్ ప్రతిబింబించిందని ఫ్యాషన్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ క్రియేషన్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఎడా సాన్సెల్ ఉస్తున్, ''మెట్ గాలా2026 నా సృష్టి, మానవ రక్తనాళ వ్యవస్థ నుంచి ప్రేర‌ణ‌ పొందాను, శరీరంపైనే కళను సజీవంగా మలిచే ప్రయత్నం ఇది'' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఆమె రూపొందించిన కాస్ట్యూమ్ ఆర్ట్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియ‌లో విప‌రీతంగా వైర‌ల్ అవుతుంది. ఆ కాస్ట్యూమ్ వీడియోలకు లక్షల సంఖ్యలో వ్యూస్, కామెంట్లు వస్తుండగా, కొందరు దీన్ని ఫ్యూచ‌ర్ ఫ్యాష‌న్ గా అభివర్ణిస్తున్నారు. మరికొందరు ఫ్యాషన్, బయాలజీ, ఆర్ట్ మేళవింపుగా ప్రశంసిస్తున్నారు. మొత్తానికి మెట్ గాలా 2026 మరోసారి ఫ్యాషన్ ప్రపంచంలో సృజనాత్మకతకు హద్దులు లేవని నిరూపించింది.

కాగా మెట్‌గాలా 2026లో భారతదేశానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మేఘా కృష్ణారెడ్డి సతీమణి సుధా రెడ్డి, రిలయన్స్ ఇండస్ట్రీస్ వారసురాలు ఇషా అంబానీ, జైపూర్ రాజవంశానికి చెందిన గౌర‌వి కుమారి తమ అద్భుతమైన ఫ్యాషన్ సెన్స్‌తో అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించారు. సంప్రదాయం, ఆధునికత కలిసిన వారి దుస్తులు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయ్యాయి. వీరితో పాటు మోడల్ లారెన్ వాస్స‌ర్, ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్ అరియానా ఫిలిప్ కూడా తమ ప్రత్యేక స్టైలింగ్‌తో ఆకట్టుకున్నారు.



Tags:    

Similar News