48 ఏజ్‌లో నాన్న మరణించినపుడు నాపై పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెచ్చారు!
| తండ్రిని 20 ఏళ్ల వయసులోనే కోల్పోయానని హీరోయిన్ మీనాక్షి చౌదరి భావోద్వేగంతో వెల్లడించారు. ఆ సమయంలో తల్లి అండగా నిలవడంతో డాక్టర్ చదువు పూర్తి చేసి, మిస్ ఇండియా, నటన వైపు అడుగులు వేసినట్లు తెలిపారు. సమాజం అంచనాల కంటే మనకు నచ్చిన దారిలో వెళ్లాలని తండ్రి మరణం తనకు నేర్పిందన్నారు. ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి నటించిన ‘వృషకర్మ’ డిసెంబర్ 4న విడుదల కానుంది.
అందాల కథానాయిక మీనాక్షి చౌదరి తన జీవితంలో ఎదుర్కొన్న కీలక మలుపులు.. తండ్రిని కోల్పోయినప్పటి క్లిష్ట పరిస్థితుల గురించి భావోద్వేగంతో మాట్లాడిన మాటలు హృదయాలను కదిలిస్తున్నాయి. తండ్రి మరణించినప్పుడు తన వయసు కేవలం 20 ఏళ్లు మాత్రమేనని.. కుటుంబంలో ఆయనే ఏకైక సంపాదనాపరుడు కావడంతో ఆర్థిక వ్యవహారాలు.. బ్యాంక్ పనులు.. కాలేజీ ఫీజులు ఇవన్నీ ఆయనే చూసుకునేవారని మీనాక్షి తెలిపారు. అప్పటివరకు ఆ విషయాల గురించి పెద్దగా ఆలోచించని తనకు తండ్రి దూరమైన క్షణంలో ఇకముందు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఎదురైందని గుర్తుచేసుకున్నారు.
తండ్రి లేకపోవడంతో ఇక పెళ్లి చేసేయాలని బంధువుల నుంచి ఒత్తిళ్లు ..రకరకాల మాటలు వినిపించినా తన తల్లి మాత్రం ఎంతో ధైర్యంగా అండగా నిలిచారని మీనాక్షి వివరించారు. తన జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ మీనాక్షికే ఇవ్వాలని తల్లి గట్టిగా చెప్పారని పేర్కొన్నారు. ఆ తర్వాత డాక్టర్ చదువు పూర్తి చేసినా.. మిస్ ఇండియా పోటీలకు వెళ్లాలని.. ఆపై నటనా రంగంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు ఎందుకిలాంటి నిర్ణయాలు తీసుకుంటోందంటూ చాలామంది ప్రశ్నించారని తెలిపారు.
కేవలం 48 ఏళ్ల వయసులోనే తండ్రి దూరం కావడం తనకు జీవితంపై ఒక పెద్ద పాఠాన్ని నేర్పిందని మీనాక్షి తెలిపారు. మనలో ఎవరు ఎంతకాలం జీవిస్తారనే దానికి ఎలాంటి గ్యారంటీ లేదని.. జీవితంలో చివరి రోజు ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదని నిర్వేదంగా మాట్లాడారు. ఇతరులు కోరుకున్నట్లు లేదా సమాజం వేసే లేబుల్స్ కోసం మనల్ని మనం పరిమితం చేసుకోకుండా.. మనకు నచ్చిన దారిలో ముందుకు వెళ్లడమే అసలైన విషయమని ఆ ఘటన ద్వారా తనకు అర్థమైందని తెలిపారు.
కష్టకాలంలో తన తల్లి ఇచ్చిన నమ్మకం.. బంధువుల మాటలకు లొంగకుండా తనదైన మార్గాన్ని ఎంచుకునే ధైర్యమే మీనాక్షి చౌదరిని ఈ స్థాయికి చేర్చాయి. ఇతరుల అంచనాల కోసం కాకుండా మన ఇష్టాలకు విలువ ఇవ్వాలనే తన మాటలు.. భవిష్యత్తుపై స్పష్టత కోసం తపించే ఎంతోమంది యువతకు ఒక స్ఫూర్తిదాయక పాఠంగా నిలుస్తున్నాయి.
దర్శకుడు కార్తీక్ దండు `వృషకర్మ`లో మీనాక్షి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో నటించారు. నాగచైతన్యతో మీనాక్షి కెమిస్ట్రీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమా కథను దర్శకుడు రెండు రోజుల పాటు సుదీర్ఘంగా నేరేషన్ ఇచ్చారని.. తొలి రోజు ఫస్ట్ హాఫ్‌లో నాలుగు గంటలు.. రెండో రోజు సెకండ్ హాఫ్ నాలుగు గంటల చొప్పున కథ చెప్పినా.. ఒక్క క్షణం కూడా అలసట అనిపించలేదని ఈ వీడియోలో తెలిపారు. తలుపు చప్పుడు (డోర్ క్రీక్ సౌండ్) వంటి అత్యంత చిన్న డీటెయిలింగ్ ని కూడా నేరేషన్‌లోనే ఎంతో స్పష్టంగా వివరిస్తూ చెప్పిన తీరు.. తాను ఏం చేస్తున్నారనే దానిపై దర్శకుడికి ఉన్న అపారమైన స్పష్టత తనలో మరింత ఉత్సాహాన్ని నింపాయని వెల్లడించారు.
చై-మీనాక్షి నటించిన వృషకర్మ డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీగా విడుదలవుతోంది.