మంగ్లీని బ్యాన్ చేయాలని డిమాండ్.. కేసులో కొత్త ట్విస్ట్?

మైక్రో ఫైనాన్స్ వ్యవహారంలో గాయని మంగ్లీ చుట్టూ నెలకొన్న వివాదం రోజురోజుకు ముదురుతోంది. తాజాగా ఆ అంశం మరో మలుపు తిరిగింది.;

Update: 2026-04-19 04:52 GMT

మైక్రో ఫైనాన్స్ వ్యవహారంలో గాయని మంగ్లీ చుట్టూ నెలకొన్న వివాదం రోజురోజుకు ముదురుతోంది. తాజాగా ఆ అంశం మరో మలుపు తిరిగింది. తెలంగాణ సినీ కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి సంపత్ నాయక్, మంగ్లీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు ఆమెను చిత్ర పరిశ్రమలో నుంచి తాత్కాలికంగా నిషేధించాలని ఆయన డిమాండ్ చేశారు.

మైక్రో ఫైనాన్స్ పేరిట భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మంగ్లీపై ఇప్పటికే పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ కేసులో ఆమెను ఏ5 నిందితురాలిగా చేర్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆ వివాదం చర్చనీయాంశంగా మారింది. సంపత్ నాయక్ మాట్లాడుతూ, మంగ్లీ వ్యవహారంపై గత కొద్ది రోజులుగా తీవ్ర చర్చ జరుగుతోందని తెలిపారు.

పేద ప్రజల నుంచి, ముఖ్యంగా గిరిజన, బంజారా సమాజానికి చెందిన వారి నుంచి మైక్రో ఫైనాన్స్ పేరుతో డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఆ మొత్తం రూ.100 నుంచి రూ.200 కోట్ల వరకు ఉండొచ్చని బాధితులు చెబుతున్నారని ఆయన అన్నారు. ఇంత పెద్ద ఆరోపణల నేపథ్యంలో పూర్తిస్థాయిలో విచారణ జరిగి నిజాలు బయటకు రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

మంగ్లీ గతంలో పేద ప్రజల మద్దతుతో ఎదిగిన గాయని అని, తెలంగాణ ఉద్యమం సమయంలో, యూట్యూబ్ ద్వారా ప్రజాదరణ పొందిందని సంపత్ నాయక్ గుర్తుచేశారు. అదే పేద ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు రావడం బాధాకరమని అన్నారు. మధుతో ఆమెకు సంబంధం లేదని చెబితే, ఆయనపై నేరుగా కేసు పెట్టాల్సిందిగా సూచించారు. అయితే లాయర్‌ పై కేసు పెట్టడం అనుమానాలకు తావిస్తున్నదని వ్యాఖ్యానించారు.

బాధితుల్లో చాలా మంది తను సంప్రదిస్తున్నారని, వారి వేదన విని ఆ అంశాన్ని ముందుకు తీసుకువస్తున్నామని సంపత్ నాయక్ తెలిపారు. ఒక మహిళ అన్న కారణంతో కొంతకాలం నిశ్శబ్దంగా ఉన్నామని, కానీ అన్యాయం జరిగితే మౌనం వహించడం సరికాదని అన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. తాము త్వరలో ఆధారాలు బయటపెడతామని సంపత్ నాయక్ వెల్లడించారు. మరో రెండు రోజుల్లో పూర్తి డేటాను ప్రజల ముందుకు తీసుకువస్తామని చెప్పారు.

అయితే ఆ వ్యవహారంపై దర్యాప్తు పూర్తయ్యే వరకు మంగ్లీకి సినిమాలు, ఈవెంట్లలో అవకాశాలు ఇవ్వకూడదని నిర్మాతల మండలిని కోరారు. మంగ్లీపై వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదని, ఆమె తప్పు చేసి ఉంటే చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం జరగడం తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. మొత్తంగా మైక్రో ఫైనాన్స్ వివాదం రానున్న రోజుల్లో ఎలా మలుపు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News